కోహినూర్ పై పాకిస్థాన్ కూడా చేతులెత్తేసింది..

 

కోహినూర్ వజ్రంపై ఇప్పటికే కోర్టులో పలు వాదనలు జరుగుతున్నాయి. ఈ వజ్రాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీకి గిఫ్ట్ గా ఇచ్చారని దీనిని వెనక్కి తీసుకురావడం కష్టమని మన ప్రభుత్వం మొదట చెప్పినా.. ఆతరువాత మళ్లీ కోహినూర్ ను తీసుకురావడానికి ప్రయత్నిస్తామని చెప్పింది. మరోవైపు బ్రిటన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోహినూర్ ను వెనక్కి ఇవ్వడానికి సిద్దంగా లేనట్టే కనిపిస్తోంది. ఏదో కోహినూర్ ఒకటే కదా అని ఇస్తే..ఇక ఏం మిగలదు అని బ్రిటన్ ప్రధాని ఈమధ్యే వ్యాఖ్యానించారు కూడా. అయితే ఇప్పుడు తాజాగా కోహినూర్ వజ్రంపై పాకిస్థాన్ కూడా చేతులెత్తేసినట్టు కనిపిస్తోంది. కోహినూర్‌పై దాఖలైన పిటిషన్‌పై విచారణ జరగగా.. పంజాబ్‌ ప్రభుత్వ న్యాయాధికారి లాహోర్‌ హైకోర్టుకు తమ వాదనలు వినిపించారు. 1849 నాటి లాహోర్‌ ఒప్పందం కింద కోహినూర్‌ వజ్రాన్ని బ్రిటన్‌కు అప్పగించినట్టు పాకిస్థాన్‌లోని పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కోహినూర్‌ ఇక బ్రిటన్‌దేనని,  బ్రిటన్‌ నుంచి దీనిని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఏవీ వెనక్కి తీసుకురాలేవని తేల్చి చెప్పేసింది.