తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ
posted on Jun 29, 2013 3:33PM

తెలంగాణాలో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు ఉస్మానియా విద్యార్థి జేఏసీ ప్రకటించింది.సెప్టెంబర్ 17న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఓయూ జేఏసీ భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. అదే వేదికపై పార్టీ పేరు, విధివిధానాలు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాబోయే స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలని ఓయూ జేఏసీ నిర్ణయించింది. మహబూబ్‌నగర్, వరంగల్, రంగారెడ్డి, నిజామాబాద్, నల్లగొండ జిల్లాల్లోని 10 గ్రామ పంచాయతీలకు ఓయూ జేఏసీ పోటీ చేయనుంది. ఈ పది స్థానాలకు ఓయూ జేఏసీ అభ్యర్థులను ప్రకటించింది.
తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పెద్ద ఎత్తున జేఏసీలు ఏర్పడ్డాయి. ఇక్కడ చురుకుగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన బాల్క సుమన్ టీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు అయ్యారు. తాజాగా రాజారాం యాదవ్ టీడీపీలో చేరి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక మరో నేత పిడమర్తి రవి ఖమ్మం జిల్లా మధిర నుండి పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.