పెద్దనోట్ల రద్దులో జీవితపాఠాలు

 

పెద్దనోట్లని తక్షణం రద్దుచేయడం సరైన చర్యా కాదా? దానికి తగినంత సన్నద్ధత ఉందా లేదా? అన్న చర్చలే ఇప్పుడు ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ పెద్ద నోట్ల రద్దుతో ఎంతో కొంత ప్రభావితం అయినవారే. ఎవరేమనుకున్నా ఓ ఆరు నెలలు గడిచిన తరువాత మధ్యతరగతి ప్రజల జీవితం మళ్లీ గాడిలోకి పడవచ్చు. కానీ ఈలోగా పెద్దనోట్లు నేర్పే పాఠాలు వారికి జీవితాంతం గుర్తుండిపోతాయేమో...

 


ఈజీమనీ- పాలించే అధికారం చేతిలో ఉండటం వల్లనో, అనుమతులిచ్చే ఉద్యోగం చేయడం వల్లనో కొందరికి ఎంతకావాలనుకుంటే అంత డబ్బు ప్రవాహంలా వచ్చిపడుతూ ఉంటుంది. ఇకమీదట ప్రజలు అలాంటి ఈజీమనీ జోలికి పోవాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. నల్లధనానికి అవకాశాలు తగ్గిపోవడంతో.... ఇంత డబ్బునీ ఏం చేసేది? ఎలా దాచేది? అంటూ ప్రశ్నలు తలెత్తుతాయి. ఇచ్చేవారి దగ్గరా అంత డబ్బు ఉండకపోవచ్చు. పుచ్చుకునేవారికీ అంత ధైర్యం రాకపోవచ్చు.

 


పన్నులు చెల్లింపులు- ఒకప్పుడు ఎంత సంపాదించినా లెక్కలు చూపాల్సిన అవసరం లేదన్న భరోసా ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. ఎక్కడికక్కడ లెక్కలు సరిపోలాల్సిన పరిస్థితి. ప్రభుత్వ కనుసన్నల్లలోనే ప్రతి ఆర్థిక లావాదేవీ నడిచే కాలం రానుంది. ఈ తలనొప్పులన్నీ ఎందుకనుకుంటే పన్నులను సక్రమంగా కట్టేస్తే సరి.

 


పొదుపు- ఒకప్పుడు చేతిలో పదివేలు ఉన్నా పదిరోజులలో ఇట్టే ఖర్చయిపోయేవి. సూపర్‌ మార్కెట్లో తెగ షాపింగ్‌ చేశాక ఇంటికి వచ్చి చూసుకుంటే అందులో సగానికి సగం పనికిరాని ఖర్చుగానే తేలేది. ప్రతి వంద రూపాయల నోటునీ పొదుపుగా పొదివి పట్టుకుంటే అది చాలాకాలం వస్తుందన్న విషయం ఈ పదిరోజులలోనే అనుభవం అయిపోయింది.

 


ఆన్‌లైన్‌ లావాదేవీలు- ఒకప్పుడు ఆన్‌లైన్ చెల్లింపులంటే సాంకేతికత తెలిసినవారు చేసే పని అనుకునేవారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కాస్తోకూస్తో అక్షరజ్ఞానం ఉన్న ప్రతిఒక్కరూ ఆన్‌లైన్‌కు అలవాటు పడాల్సిన అగత్యం వచ్చేసింది. దీని వలన కాలం, శ్రమా ఎలాగూ పొదుపవుతాయి. ఇక ప్రతి లావాదేవీకీ రుజువు ఉంటుంది. ప్రతి ఖర్చుకీ లెక్క ఉంటుంది. నగదు లేని రోజు కోసం సమాజం సిద్ధపడుతుంది.

 


తత్వమసి- 500 రూపాయల నోటుని చూస్తే జీవితంలో ఏదీ శాశ్వతం కాదని తేలిపోతోందని సోషల్‌ మీడియలో జోకులు పేల్తున్నాయి. నిజమే కదా! వాళ్ల నోళ్లు కొట్టీ, వీళ్ల నోళ్లు కొట్టీ... కట్టలు కట్టిన నోట్లన్నీ ఇప్పుడు చెల్లకుండా పోయాయి. బడాబాబుల బాధ అలా ఉంటే మధ్యతరగతి వ్యధ ఇంకోలా ఉంది. జీవితంలో ఏ ఉపద్రవం ఎప్పుడు ముంచుకువస్తుందో, ఎప్పుడు ఏ అధ్యాయం ముగిసిపోతుందో తెలీదన్న తత్వాన్ని నోట్ల రద్దు తెలియచేసింది. అందుకనే అతిగా సంపదల మీద మమకారం పెంచుకోకుండా, భగవంతుడు ఇచ్చిన కాస్త జీవితాన్నీ హాయిగా గడిపేయమనీ... పెద్ద నోట్లు ఘోషపెడుతున్నాయి.

 

 

- నిర్జర.