నిర్భయ కేసులో బాలనేరస్తుడిని విడుదల చేయాలా...వద్దా?

 

సరిగ్గా మూడేళ్ళ క్రితం డిల్లీలో జరిగిన నిర్భయ కేసులో దోషిగా నిర్ధారించబడిన బాల నేరస్థుడికి బాల నేరస్తుల చట్ట ప్రకారం మూడేళ్ళ నిర్బంధం విధించబడింది. అతను ఈ మూడేళ్ళ కాలం డిల్లీలో బాల నేరస్తుల సంరక్షణా కేంద్రంలో గడిపాడు. అతనికి విధించిన శిక్ష కాలం ఈనెల 20వ తేదీతో పూర్తవుతుంది. కనుక అతనిని విడుదల చేయవలసి ఉంది. అతనికిప్పుడు 20 ఏళ్ళు నిండాయి. కనుక అతను మళ్ళీ నేరాలు చేయకుండా సాధారణ జీవితం జీవించేందుకు డిల్లీ ప్రభుత్వం అతనికి రూ. 10,000 నగదు, ఒక కుట్టు మిషను అందించడానికి సిద్దపడింది. అతని తల్లి తండ్రులను స్వగ్రామం నుండి కారులో రప్పించి, అతనిని వారికి అప్పగించి మళ్ళీ కారులో వారిని స్వగ్రామంలో దింపి వచ్చేందుకు కూడా డిల్లీ ప్రభుత్వం సిద్దపడింది.

 

అటువంటి దారుణమయిన నేరం చేసిన వ్యక్తికి ప్రభుత్వమే ఆర్ధిక సహాయం చేయడాన్ని చాలా మంది తప్పు పడుతున్నారు. నేరం చేసినవాడిని కటినంగా శిక్షించలేకపోగా మళ్ళీ అతనికి ఇటువంటి బహుమానాలు ఇవ్వడమేమిటని ప్రశ్నిస్తున్నారు. “అతనికి డిల్లీ ప్రభుత్వమే ఇల్లు కట్టించి పెళ్లి చేసి ఉద్యోగం కూడా ఇస్తే బాగుండేది కదా? ఇంక మళ్ళీ అటువంటి నేరాలు చేయడు..”అని డిల్లీ ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు.

 

నేరస్తులను శిక్షించడం కంటే సంస్కరించడమే మేలని అందరూ అంగీకరిస్తారు. ఈ మూడేళ్ళ కాలంలో బాల నేరస్తుల సంరక్షణా కేంద్రంలో అతనిని సంస్కరించి సన్మార్గం వైపు మళ్ళించే ప్రయత్నాలు జరిగాయో లేదో తెలియదు కానీ అతను డిల్లీ హైకోర్టు బాంబు ప్రేలుడు కేసులో నిర్బంధించబడిన మరో బాల నేరస్తుడితో స్నేహం చేస్తున్నట్లు నిఘా వర్గాలు కనుగొన్నారు. అతను ఉగ్రవాదంపై ఆసక్తి పెంచుకొన్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. కనుక అతని మానసిక పరిస్థితి ఏవిధంగా ఉందో తెలుసుకోకుండా అతనిని బయటకు పంపినట్లయితే అతని వలన సమాజానికి ఇంకా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని, కనుక అతని విడుదలను మరికొంత కాలం పాటు పొడిగించాలని కేంద్రప్రభుత్వం డిల్లీ హైకోర్టుని అభ్యర్ధించింది.

 

బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి కూడా అతని విడుదల కాకుండా నిలిపివేయాలని కోరుతూ హైకోర్టులో ఒక పిటిషను వేశారు. ఒకవేళ అతనిని విడిచిపెట్టదలిస్తే, అతనిపై నిరంతర నిఘా ఉంచవలసిందిగా నిర్భయ తల్లి తండ్రులు హైకోర్టుని, కేంద్ర హోంమంత్రి రాజ్ నాద్ సింగ్ ని కోరారు. ఆ విధంగా చేసినట్లయితే మళ్ళీ అతని వలన సమాజానికి ప్రమాదం కలగకుండా నివారించవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ కేసును విచారణకు స్వీకరించిన డిల్లీ హైకోర్టు, దీనిపై తీర్పు చెప్పే ముందు ఈ విషయాలన్నిటినీ పరిగణనలోకి తీసుకొంటామని చెప్పింది కానీ ఇంకా తీర్పు చెప్పలేదు.

 

ఇటువంటి హేయమయిన నేరాలకి పాల్పడిన 16-18 ఏళ్ల వయసుగల బాల నేరస్తులను మేజర్లుగానే పరిగణించి వారికి చట్ట ప్రకారం శిక్ష వేసేందుకు కేంద్ర ప్రభుత్వం బాల నేరస్తుల చట్టానికి సవరణ చేసి పార్లమెంటులో ప్రవేశపెట్టింది. లోక్ సభ దానికి ఆమోదం తెలిపినప్పటికీ అధికార, విపక్షాల మధ్య పార్లమెంటులో జరుగుతున్న రాద్దాంతం కారణంగా అది రాజ్యసభ ఆమోదానికి నోచుకోలేదు. కనుక నేటికీ పాత చట్టమే అమలులో ఉంది. కనుక ఈ నిర్భయ కేసులో బాలనేరస్తుడు ఇప్పుడు మేజర్ అయినప్పటికీ అతనిని శిక్షించే అవకాశం లేదు.

 

అనేక నేరాలు చేసి జైలు శిక్ష అనుభవించిన వారిని సత్ప్రవర్తన కారణంగా జైలు నుండి విడిచిపెడుతుంటారు. కానీ ఈ నిర్భయ నేరస్థుడు తన శిక్ష కాలం పూర్తి చేసిన్నపటికీ అతని విషయంలో ఇంకా ఇంత చర్చ, అనుమానాలు రేకెత్తుతున్నాయి అంటే కారణం అంత చిన్న వయసులోనే అంత తీవ్రమయిన నేరానికి పాల్పడినందుకేనని భావించవచ్చును. మూడేళ్ళపాటు బాలనేరస్థుల సంరక్షణా కేంద్రంలో ఉంచినపుడు అతనిని సంస్కరించలేకపోతే అది వారి వైఫల్యంగానే భావించవచ్చును. లేదా అతను సంస్కరించలేనంత కరుడుగట్టిన నేరస్తుడిగా మారి ఉండవచ్చునని అనుకోవాలి. అయితే ఆ కారణంగా అతను శిక్ష పూర్తి చేసుకొన్న తరువాత కూడా ఇంకా నిర్బంధించి ఉంచడం కూడా చట్ట ప్రకారం తప్పే అవుతుంది. కానీ సమాజానికి అతని వలన హాని కలుగుతుందని భావిస్తున్నట్లయితే అతనిని జైలుకి తరలించక తప్పదు. లేదా నిర్భయ తల్లి తండ్రులు సూచిస్తున్నట్లుగా అతను విడుదలయిన తరువాత అతనిపై నిరంతర నిఘా పెట్టవలసి ఉంటుంది. డిల్లీ హైకోర్టు ఈ విషయంలో తగిన నిర్ణయమే తీసుకొంటుందని ఆశిద్దాము.