విషప్రచారంతో అమరావతి ప్రతిష్టను దెబ్బ తీస్తున్న ప్రతిపక్షాలు

 

ఒక నగరానికి లేదా దేశానికి మంచి పేరు సంపాదించుకోవడానికి అనేక దశాబ్దాలు పట్టవచ్చును. కానీ చెడ్డ పేరు సంపాదించుకోవడానికి కొన్ని రోజుల సమయం చాలు. కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టిన ‘మత అసహనం’ అనే విష ప్రచారం వలన ప్రపంచ దేశాలు మళ్ళీ భారత్ ని అనుమానంగా చూస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడి కొన్ని వారాల క్రితం అమెరికా వెళ్ళినప్పుడు అక్కడి మీడియా ప్రతినిధులు భారత్ లో మత అసహనం గురించి ఆయనను ప్రశ్నించడమే అందుకు ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చును. దేశంలో రాజకీయ పార్టీలు ఒకదానినొకటి దెబ్బ తీసుకొనేందుకు మొదలుపెడుతున్న ఇటువంటి విష ప్రచారాల వలన దేశానికి, రాష్ట్రాలకి ఎంత చెడ్డపేరు కలుగుతుందో అర్ధం చేసుకోవడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చును.

 

ఇప్పుడు విజయవాడలో కల్తీ మద్యం, కాల్ మనీ వ్యవహారం బయటపడిన తరువాత ‘విజయవాడ మాఫియా రాజధాని’, 'ఆంధ్రప్రదేశ్ రాజధాని 'ఒక నేర సామ్రాజ్యానికి రాజధాని’ అంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చాలా జోరుగా ప్రచారం చేస్తోంది. ఈ ప్రచారంతో వైకాపా తన రాజకీయ శత్రువు అయిన తెదేపాను, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని రాజకీయంగా దెబ్బ తీయాలని ప్రయత్నిస్తోంది. కానీ అది చేస్తున్న ఈ విషప్రచారం వలన అమరావతికి చెడ్డపేరు వస్తుందనే విషయం పట్టించుకోవడం లేదు.

 

నిజానికి అమరావతి నిర్మాణం మొదలుకాక మునుపు నుండే దానికి ప్రపంచ వ్యాప్తంగా ఒక మంచి పేరును సంపాదించిపెట్టాలనే ఉద్దేశ్యంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంఖుస్థాపన కార్యక్రమాన్ని అంత అట్టహాసంగా నిర్వహించారు. తద్వారా ప్రపంచ దేశాల నుండి రాష్ట్రానికి బారీగా పెట్టుబడులు, పరిశ్రమలు వస్తాయని, తద్వారా రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుందని ఆయన కలలు కన్నారు. కానీ రాష్ట్రం, రాజధాని పరువు ఏమయినా పరువాలేదు తెదేపా ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని దెబ్బ తీయగలిగితే చాలు అన్నట్లు వైకాపా ‘విజయవాడ మాఫియా రాజధాని’ అంటూ విషప్రచారం చేస్తున్నారు. దాని వలన రాష్ట్రానికి, రాజధానికి, ప్రభుత్వానికి ఎంత నష్టం, అప్రదిష్ట కలుగుతుందో ఎవరూ ఊహించలేరు.

 

ప్రపంచంలో ఎంత చిన్న, పెద్ద, బీద, గొప్ప దేశాలు, నగరాలలోనయినా ఏదో ఒకస్థాయిలో ఇటువంటి నేరాలు జరుగుతూనే ఉంటాయి. అమెరికాలో పట్టపగలే కాల్పులు జరుగుతుంటాయి. వాటిలో అనేక మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటారు. అంత మాత్రాన్న అమెరికాని తప్పు పట్టడం అవివేకమే అవుతుంది. అలాగే బ్యాంకాక్, హాంగ్ కాంగ్ వంటి నగరాలలో అనేక ఘోరమయిన నేరాలు జరుగుతుంటాయి. కనుక వాటిని చెడ్డ నగరాలనలేము.

 

ప్రతీ చోట నేరాలు ఏదో ఒక స్థాయిలో జరుగుతూనే ఉంటాయి. వాటిని నియంత్రించడానికే ప్రభుత్వం, పోలీస్, న్యాయ వ్యవస్థలు ఉంటాయి. విజయవాడలో బయటపడుతున్న నేరాలను కూడా అదే విధంగా నియంత్రించవలసి ఉంటుంది. ప్రస్తుతం ప్రభుత్వం, పోలీసులు ఆ పనిలోనే ఉన్నారు. ఒకవేళ ప్రతిపక్షాలకు రాష్ట్ర ప్రభుత్వంపై, పోలీసులపై నమ్మకం లేకపోయినట్లయితే, ప్రభుత్వమే నేరస్తులను వెనకేసుకొని వస్తోందని అవి భావిస్తున్నట్లయితే దానిని సరిచేసేందుకు వారు న్యాయ వ్యవస్థను ఆశ్రయించవచ్చును. కానీ ప్రతిపక్షాలు తమ రాజకీయ పగలు, కక్షల కోసం రాష్ట్రం, రాజధాని పేరు ప్రతిష్టలకు భంగం కలిగించడాన్ని ఎవరూ సహించరు.