దేశానికి బలమయిన నాయకత్వం అవసరమే కదా?

 

జాతీయ పార్టీలయిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలలో వ్యక్తిపూజ బాగా ఎక్కువయిపోయిందని ఎస్.సి.పి అధినేత శరద్ పవార్ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ, బీజేపీలో ప్రధాని నరేంద్ర మోడీల చుట్టూనే ఆ పార్టీల రాజకీయాలు నడుస్తున్నాయని, అలాగే అధికారం అంతా వారి చేతుల్లోనే కేంద్రీకృతం అయి ఉందని, అది మంచి పద్ధతి కాదని శరద్ పవర్ తన ఆత్మకధలో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో వ్యక్తి ఆరాధన ఇవ్వాళ్ళ కొత్తగా మొదలయిందేమీ కాదు. ఇందిరా గాంధీ హయాంలోనే అది పరాకాష్టకు చేరుకొంది. నాటి నుండి నేటి వరకు అది కొనసాగుతూనే ఉంది. అప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ తన స్వశక్తి, పార్టీ సిద్దాంతాల కంటే గాంధీ, నెహ్రూ కుటుంబం పేరు మీద, ప్రాంతీయ పార్టీల మద్దతుతోనే తన రాజకీయ మనుగడ సాగిస్తోందని చెప్పక తప్పదు. అందుకే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పదవికి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి తనే అర్హుడనని భావించగలుగుతున్నారు. కానీ ఆయన తన నాయకత్వ లక్షణాలు నిరూపించుకోలేకపోవడం, పార్టీలో సమర్దులయిన వేరెవరికీ పార్టీ పగ్గాలు కట్టబెట్టే ఆలోచన చేయకపోవడంతో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికి దిగజారుతోంది. ఒక వ్యక్తి మీద ఆధారపడి పార్టీ లేదా సంస్థ నడవడం వలన ఎటువంటి నష్టం జరుగవచ్చో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని చూసినట్లయితే అర్ధమవుతుంది.

 

బీజేపీలో ఏనాడూ ఇటువంటి వ్యక్తి ఆరాధన చూడలేదు. ఒకప్పుడు బీజేపీ అనగానే అటల్ బిహారీ వాజ్ పేయి, లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషి, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, యశ్వంత్ సిన్హా వంటి అనేకమంది ప్రముఖుల పేర్లు మదిలో మెదిలేవి. కానీ ప్రస్తుతం ఆ పార్టీ మోడీ నామస్మరణలో మునిగిపోయిందని, అధికారం అంతా ఆయన చేతిలోనే కేంద్రీకృతం అయిందని శరద్ పవార్ అభిప్రాయపడ్డారు. దేశంలో చాలా మంది అదే అభిప్రాయంతో ఉన్నారు.

 

ఆ అభిప్రాయం సహేతుకంగానే కనిపిస్తునప్పటికీ, ఒక్కోసారి అటువంటి విధానం కూడా అవసరం అవుతుంటుంది. గత పదేళ్ళ యూపీఏ పాలనలో పరిపాలనా వ్యవస్థలన్నీ అదుపు తప్పాయి. తత్ఫలితంగా దేశంలో అవినీతి, ఆరాచకం పెరిగిపోయి ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఆ పరిస్థితులను చక్కదిద్ది మన వ్యవస్థలను మళ్ళీ గాడినపెట్టాలంటే దేశానికి చాలా దృడమయిన నాయకత్వం అవసరం. అది మోడీలో ఉందని దేశ ప్రజలు భావించబట్టే ఆయనకు అధికారం కట్టబెట్టారు. అందుకే ఆ పార్టీలో అందరూ ఆయన నాయకత్వాన్ని అంగీకరిస్తున్నారు. నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు చేప్పట్టిన వెంటనే ఆ గాడి తప్పిన వ్యవస్థలన్నిటినీ మళ్ళీ గాడిన పెట్టడం మొదలుపెట్టారు. అవినీతి, కుంభకోణాలకు తావులేని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దేశంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. అంతర్జాతీయంగా దేశ పేరు ప్రతిష్టలు, విదేశాలతో భారత్ సంబంధాలు మెరుగుపరచగలిగారు.

 

ఇంతకు ముందు కేంద్రంలో దీనికి పూర్తి భిన్నమయిన పరిస్థితులు నెలకొని ఉండేవి. దేశంలో ఆర్ధిక సంస్కరణలు ప్రవేశపెట్టి గొప్ప పేరు సంపాదించుకొన్న డా. మన్మోహన్ సింగ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత అంతకు పదింతలు చెడ్డపేరు మూటగట్టుకట్టుకొన్నారు. ఆయన మచ్చ లేని నాయకుడయినప్పటికీ బొగ్గు కుంభకోణం కేసులో నిందితుడుగా కూడా పేర్కొనబడ్డారు. అందుకు కారణం ఆయన దృడంగా వ్యవహరించలేకపోవడమే. ఆయన పేరుకి ప్రధాని అయినప్పటికీ పెత్తనమంతా సోనియా గాంధీ చేసారు. కేంద్రంలో రెండు సమాంతర అధికార కేంద్రాలు ఏర్పడటం వలన దేశంలో వ్యవస్థలన్నీ గాడి తప్పాయి. దానిని మోడీ సరిచేస్తున్నారు. అందువలన అధికారం అంతా అయన చేతిలోనే ఉన్నట్లు పైకి కనబడుతున్నప్పటికీ లేదా అలాగ ప్రచారం జరుగుతున్నప్పటికీ అది పూర్తిగా వాస్తవం కాదని చెప్పవచ్చును.

 

ఉదాహరణకి కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారి ఇటీవల విజయవాడలో ఫ్లై ఓవర్ కి శంఖుస్థాపన చేయడానికి వచ్చినపుడు రాష్ట్రంలో హైవే ప్రాజెక్టుల నిర్మాణానికి ఏకంగా రూ. 65,000 కోట్ల నిధులను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే కేంద్రమానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతీ ఇరానీ రాష్ట్రంలో ఐదు ఉన్నత విద్యాసంస్థలకు శంఖుస్థాపన చేసి, శిక్షణా తరగతులు ప్రారంభించడానికి అనుమతులు కూడా మంజూరు చేసారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు రాజధాని నిర్మాణం మొదలుకాక మునుపే రాష్ట్రానికి రూ.1850 కోట్ల నిధులు తన శాఖ నుండి విడుదల చేసారు. ఇంకా డ్రెడ్జింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా, బెల్ వంటి అనేక ఇతర ప్రాజెక్టులు మంజూరు అయ్యేయి.

 

ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే కాకుండా దేశంలో వివిధ రాష్ట్రాలకు గత ఎదాదిన్నర కాలంలో అనేక ప్రాజెక్టులు, నిధులు మంజూరు అవుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, మంత్రులు, అధికారులు అందరూ కలిసికట్టుగా చేస్తున్న సమిష్టి కృషి కారణంగానే ఇవన్నీ సాధ్యం అవుతాయి తప్ప కేవలం మోడీయే స్వయంగా చేయలేరని అందరికీ తెలుసు. అయితే ఈ వ్యవస్థలన్నీ సక్రమంగా, సమర్ధంగా పనిచేస్తున్నాయంటే ప్రధాని నరేంద్ర మోడి దృడమయిన నాయకత్వం ప్రధాన కారణమని చెప్పక తప్పదు. దానిని ఎవరు ఏ విధంగా భావిస్తే ఆవిధంగా ఊహించుకోవచ్చును. కానీ దేశాభివృద్ధికి అటువంటి బలమయిన నాయకత్వం అవసరమనే విషయంలో ఎవరికీ భిన్నాభిప్రాయాలు ఉండవనే భావించవచ్చును.