సస్పెన్స్ థ్రిల్లర్... మహా రాజకీయంలో మరిన్ని మలుపులు

 

మరాఠా రాజకీయాలు ఓ పట్టాన తేలడం లేదు. రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఎన్సీపీ, కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని శివసేన ప్రకటించింది.. కానీ మూడు పార్టీలు కలిసి ఇప్పటి వరకు ఎలాంటి ఉమ్మడి ప్రకటన చేయలేదు. మరోవైపు పవార్ చేసిన వ్యాఖ్యలు కూడా అనుమానాలకు తెరలేపుతున్నాయి. మహారాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ సరికొత్త మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వ ఏర్పాటు అంశం మరోసారి హస్తిన చేరుకుంది. ఎన్సీపీ చీఫ్ శరత్ పవార్, కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీల మధ్య ఢిల్లీలో మహారాష్ట్ర పరిణామాలపై కీలక భేటీ జరిగింది. భేటీ తర్వాత శరత్ పవార్ చేసిన వ్యాఖ్యలు మరో ట్విస్ట్ కు దారితీశాయి. అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన, బీజేపీ కలిసి పోటీ చేశాయి. ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమిగా పోటీ చేశాయి. వాళ్ళ రాజకీయాలు వాళ్ళు చూసుకుంటారు శివసేన దారి ఎటువైపో వారే తేల్చుకోవాలంటూ ఆశ్చర్యకరమైన రీతిలో శరత్ కామెంట్ చేశారు. 

అటు ప్రభుత్వ ఏర్పాటుపై శివసేన ఆశలు ఏమాత్రం వదులుకోవడం లేదు. తాము త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ముగిసాక శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆ పార్టీ నేతలు ప్రకటిస్తున్నారు. అయితే మహారాష్ట్రలో బీజేపీ, శివసేన ప్రభుత్వం ఏర్పడుతుందని కేంద్ర మంత్రి రామ్ దాస్ అథవాలే జోస్యం చెప్పారు. మహారాష్ట్రలో బీజేపీ, శివసేన ప్రభుత్వం ఏర్పాటవ్వాలనే విషయం పై నయా ఫార్ములా తెరపైకి తీసుకొచ్చారు కేంద్ర మంత్రి రామ్ దాస్ అథవాలే. 3 ఏళ్లు బీజేపీ సీఎం,2 ఏళ్లు శివసేన సీఎం ఉండేలా సరికొత్త ఫార్ములాను ఆ పార్టీ నేతల ముందు ఉంచామని తెలిపారు. ఇలా మహారాష్ట్ర రాజకీయాలు 3 ట్విస్ట్ లు 6 మలుపులతో సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తోంది.