ఏపీలో టీఆర్ఎస్ ప్రచార రథం.. లోకేష్ వేమన పద్యం

 

వైఎస్ జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ తో కలిసి ఏపీ మీద కుట్రలు చేస్తున్నారని టీడీపీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్, జగన్ కు వెయ్యి కోట్లు పంపారని కూడా టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలు కాసేపు పక్కన పెడితే.. కేసీఆర్, జగన్ దోస్తీ గురించి విమర్శించడానికి టీడీపీకి తాజాగా ఓ ఆయుధం దొరికింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ వినియోగించిన ప్రచార రథాలు ఏపీలో దర్శనమిచ్చాయి. ఆ వాహనాలు వైసీపీ ప్రచార రథాలుగా మారుతున్నాయి. నెల్లూరు జిల్లా వేదాయపాలెం పుట్టవీధిలోని ఓ మెకానిక్ షెడ్డులో టీఆర్‌ఎస్ వాహనాలకు వైసీపీ కలర్ వేస్తున్నారు. పైన వైసీపీ కలర్స్, లోపల సీటు కవర్స్ పై టీఆర్ఎస్ సింబల్ ఉన్న కార్లు దర్శనమిచ్చాయి. దీంతో జగన్‌కు కేసీఆర్ సహకరిస్తున్నారన్నది నిజమని తేలిపోయిందని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.

మంత్రి నారా లోకేష్ కూడా ట్విట్టర్ వేదికగా ఈ విషయంపై విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్, వైసీపీ బంధం గురించి వేమన పద్యాన్ని పేరడీగా రాసి పోస్టు చేసారు. "తెలంగాణ దొరగారి కారు...ఆంధ్రాలో జగన్ షికారు!. వైకాపా కారు చూడ మేలిమై ఉండు. సీటు విప్పిచూడ కారు గుర్తు ఉండు. రంగు మార్చుడెందుకు కలువకుంట జగన్ గారూ. దొరగారి ప్ర`గఢీ`భవన్ గులాబీ తోటలో పువ్వే మీరు!" అని లోకేష్ ఎద్దేవా చేశారు.