బలపరీక్షకు డుమ్మాకొట్టిన నాగాలాండ్ సీఎం

నాగాలాండ్ రాజకీయ పరిణామాలు రోజుకొక మలుపు తిరుగుతున్నాయి. సీఎం షుర్హోజెలీ లీజిత్సు అసెంబ్లీలో బలపరీక్ష నిరూపించుకునేందుకు గవర్నర్ అనుమతి ఇచ్చారు. దీనికి ఇవాళ అన్నీ ఏర్పాట్లు చేశారు. ఆశ్చర్యకరంగా ఈ బలపరీక్షకు సీఎం లీజిత్సు, ఆయన మద్దతుదారులు హాజరుకాలేదు. నాగాలాండ్ మాజీ సీఎం టీఆర్ జెలియాంగ్ ఎమ్మెల్యేల్లో తనకు 47 మంది మద్ధతిస్తున్నారని, తనకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలని జెలియాంగ్ గవర్నర్‌కు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో జూలై 15 లోపు అసెంబ్లీలో తన బలం నిరూపించుకోవాలని గవర్నర్ ప్రస్తుత ముఖ్యమంత్రికి సూచించారు. గవర్నర్ సూచనతో ఏకీభవించని లీజిత్సు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన గుహవాటిలోని కోహిమా బెంచ్ గవర్నర్ ఆదేశాలపై స్టే విధించింది. ఇదే విషయంపై నిన్న మరోసారి విచారణ చేపట్టిన న్యాయస్థానం గవర్నర్ నిర్ణయాన్ని సమర్థించింది. దీంతో బుధవారం నాడు ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశపరచాలని గవర్నర్ నాగాలాండ్ స్పీకర్‌ను కోరారు..దీంతో బలపరీక్షకు అన్ని ఏర్పాట్లు చేశారు స్పీకర్..అయితే సమయం గడుస్తున్నా సీఎం లీజిత్సు కానీ..ఆయన మద్ధతుదారులు కానీ శాసనసభకు హాజరుకాలేదు..వారితో ఫోన్‌లో మాట్లాడేందుకు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదని దీంతో సభను నిరవధికంగా వాయిదా వేసినట్లు స్పీకర్ మీడియాకు తెలిపారు.