వజ్రాల కోసమని వెళ్తే!

 

చాలా రోజుల క్రితం ఆఫ్రికాలో ఒక రైతు ఉండేవాడు. అతని ఇల్లు ఓ కొండ కొసన ఉండేది. అక్కడి నుంచి చూస్తే ప్రకృతి అంతా తన పాదాక్రాంతమన్నంత దగ్గరగా కనిపించేది. ఆ ఇంటికి దగ్గరలోనే ఒక చిన్న సెలయేరుతో రైతుకి కావల్సినంత నీరు కూడా లభించేది. రైతు తన పెరట్లో కావల్సినన్ని కూరలను పండించుకుంటూ, అవసరానికి మించినవాటిని ఊళ్లో అమ్ముకుంటూ హాయిగా గడిపేసేవాడు. ఓసారి ఆ రైతుని పలకరించి వెళ్లేందుకు ఓ చుట్టం వచ్చాడు. వచ్చిన చుట్టం వచ్చినట్లు ఉండలేదు.

 

‘ప్రపంచమంతా ముందుకు సాగిపోతుంటే, నువ్వు మాత్రం కొండ అంచుకి వేళ్లాడుతున్నావా. ఇప్పుడు జనమంతా వజ్రాల వేటలో పడ్డారు. ఆ కింద కనిపిస్తున్న లోయలో వెతికితే బోలెడు వజ్రాలు కనిపిస్తున్నాయంట! ఇలాంటి పనికిరాని జీవితాన్ని గడిపేసే బదులు నువ్వు కూడా వాటి కోసం వెతకవచ్చు కదా! ఒక్క వజ్రాన్ని సంపాదించావంటే నీ జీవితమే మారిపోతుంది’ అంటూ ఊదరగొట్టాడు బంధువు.

 

బంధువు మాటలకు నవ్వేసి ఊరుకున్నాడే కానీ, రైతు మనసు మాత్రం వాటినే పట్టుకుని వేళ్లాడసాగింది. ఆ బంధువు చెప్పినట్లు నిజంగానే తనకి ఓ వజ్రం దొరికితే ఎంత బాగుండు అన్న ఆశ మొదలైంది. వెంటనే మూటాముల్లే తీసుకుని లోయలోకి దిగాడు. ఊహూ! లోయలో ఎంత వెతికినా వజ్రాలు కనిపించనేలేదు. ఎవర్నో అడిగితే ‘ఇక్కడ కాదు, మరికాస్త దూరంలో వజ్రాల కనిపిస్తాయని చెప్పారు’. మరికాస్త దూరం వెళ్తే, అక్కడ ఉన్నవారు మరోచోటకి దారి చూపారు. అలా ఏళ్ల తరబడి రైతు దేశాలు పట్టుకుని తిరిగాడే కానీ వజ్రం దక్కలేదు. చివరికి ఇక అతని ఒంట్లో ఓపిక నశించింది. మనసులోని ఆశ అడుగంటింది. తిరిగి తన ఇంటికి ప్రయాణం కట్టాడు.

 

రైతు తన ఇంటికి చేరుకునేసరికి కనిపించిన దృశ్యంతో అతని కళ్లు చెదిరిపోయాయి. తన పాత ఇంటి స్థానంలో ఒక తళతళలాడిపోయే భవంతి ఉందక్కడ. నిదానంగా ఆ ఇంట్లోకి ప్రవేశించిన రైతుకి అక్కడ ఓ ఆసామి పడకకుర్చీలో కూర్చుని కనిపించాడు. అతని దగ్గరకి బిక్కుబిక్కుమంటూ వెళ్లి తనని పరిచయం చేసుకున్నాడు రైతు. రైతు గురించి విన్న ఆసామి కంగారుపడలేదు సరికదా ఆప్యాయంగా కౌగలించుకుని ఎదురుగా కూర్చోపెట్టుకున్నాడు.

 

‘సోదరా! నేను ఏదో ఒక వ్యాపకం కోసమని వెతుక్కుంటూ వెతుక్కుంటూ నీ ఇంటికి చేరుకున్నాను. ఇంట్లో ఎవ్వరూ కనిపించకపోయేసరికి నిదానంగా ఇక్కడే ఉండిపోయాను. కాయగూరల్ని పండించుకుంటూ, మేకలని కాచుకుంటూ రోజులు గడపడం మొదలుపెట్టాను. కానీ ఒక రోజు ఏం జరిగిందనుకున్నావ్! ఆ సెలయేట్లోకి దిగి స్నానం చేస్తుండగా ఓ తళతళలాడే రాయి కనిపించింది. దాన్ని చేతిలోకి తీసుకుని చూస్తే... అది రాయి కాదు, వజ్రమని తేలింది! ఆ సెలయేట్లోనే మరికాస్త శోధించాక అలాంటి రాళ్లు అనేకం కనిపించాయి. ఇదిగో ఆ వజ్రాలను అమ్మి నేను ఈ భవంతిని కట్టుకున్నాను. కావాలంటే నువ్వు కూడా ఇందులోనే ఉండవచ్చు,’ అంటూ అసలు విషయాన్ని చెప్పుకొచ్చాడు.

 

ఇంటి యజమాని మాటలు విన్న రైతుకి దుఃఖం ఆగలేదు. అత్యాశకి పోయి చేతిలో ఉన్న వనరులను తరచి చూసుకోకుండా ఊళ్ల మీద పడి తిరిగానే అనుకుంటూ కూలబడిపోయాడు.

(ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)

 

- నిర్జర.