ఆలోచించండి బాబూ..ఆలోచించండి..!


మనిషికి దేవుడు ఇచ్చిన గొప్పవరం మెదడు..ఇది మన శరీరంలోని అత్యంత నిగూడమైన అవయవం..ఇప్పటికీ మన మెదడు గురించి మనకు తెలిసింది సముద్రంలో ఇసుక రేణువంత. మన మెదడును మన భావాలను సజీవంగా ఉంచటం మరియు అవయవాలను కదిలేలా చేస్తుంది. మన మెదడు కొన్ని కోట్ల సూపర్‌ కంప్యూటర్లతో సమానం..కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు లేనికాలంలో ఎంతటి సంక్లిష్టమైన సమస్యనైనా మన మస్తిష్కం పూర్తి చేసేది. ఎంత పెద్ద లెక్కయినా టక్కున నోటితోనే చెప్పేసేవారు. కానీ ఇప్పుడు దుకాణానికి వెళ్లి రెండు వస్తువులు కొంటే మొత్తం ఎంతయిందో క్యాలిక్యులేటర్ ఉంటే కానీ చెప్పలేం.  అంతేందుకు మొబైల్ ఫోన్లు ఇంతగా లేనపుడు ప్రతి ఒక్కరి కి వందల కొద్దీ ఫోన్ నెంబర్లు అలా తలచుకుంటే ఇలా కళ్ల ముందు మెదిలేవి. కానీ ఇప్పుడు మొబైల్ కాంటాక్ట్ లిస్ట్‌లో పేరు పెట్టి వెతికితే కానీ నంబర్ తెలియదు..అసలు ఇంతకీ మన మెదడుకి ఎమైంది. మారుతున్న జీవనశైలి మెదడును మొద్దు బారుస్తోంది..ఉద్యోగాలు, పనులన్నీ కంప్యూటర్లలోనూ, ఆన్‌లైన్లోనే అయిపోతున్నాయి. నెట్ బ్యాంకింగ్ వివిధ రకాల యాప్‌లతో బ్యాంకులకు వెళ్లే పని, దుకాణాలకు వెళ్లే పని, చివరికి హోటళ్లకు వెళ్లే పనీ తప్పిపోతోంది.. అపరిమితమైన సమాచారాన్ని తనలో నిక్షిప్తం చేసుకోగలిగే సత్తా ఉన్న మస్తిష్కాలను అంతులేని సంగతులు చెప్పే ఇంటర్నెట్ బలహీనం చేస్తోంది. బోలెడన్ని యూజర్ ఐడీలు, పాస్‌వర్డ్‌లు, సీక్రెట్ కోడ్‌లు పెట్టినా అవి కూడా గుర్తు రాక నానాతంటాలు పడుతున్నారు. కొందరైతే ఇవి సమయానికి గుర్తురాక మతిమరుపు వచ్చేసిందేమోనని భయపడుతున్నారు.

 

కారణాలు: నేటి ఆధునిక జీవిన విధానంలో ఇంటర్నెట్ రాక..మనిషి గమనాన్ని పూర్తిగా మార్చేసింది. తినాలన్నా...పడుకోవాలన్నా..మేల్కొనాలనే అంతా టెక్నాలజీయే..ఇప్పటి తరం ఏ సమాచారం కావాలన్నా వెంటనే గూగుల్‌లో వెతుకుతున్నారే కానీ గుర్తుంచుకోవడం లేదు..అరచేతిలో సమస్తం దొరుకుతున్నపుడు కావాల్సినపుడు తెలుసుకోవచ్చులే అని దేనిని మెదడులోకి ఎక్కించడం లేదు. చాలా మంది రోజుకు గంట నుంచి మూడు గంటల దాకా ఫోన్‌లో నెట్ వినియోగిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఖాళీ దొరికితే చాలు ఇంటర్నెట్‌లో మునిగిపోతుండటంతో..అవసరమైనది, లేనిదీ కనిపిస్తుండటంతో మెదడు షార్ట్ టెర్మ్ మెమొరీకి సవాలుగా మారుతోంది..ఒకదానికొకటి సంబంధం లేని అనేక అంశాలను తక్కువ కాలవ్యవధిలో వీక్షిస్తుండటంతో మెదడుపై భారం పడుతోంది. ఇవన్నీ కలగలిసి ధీర్ఘకాలంలో మెదడుపై దుష్ప్భ్రభావాన్ని చూపుతున్నాయి.

 

సమస్యలు: పనిచేస్తుంటేనే మన కండరాలు బలపడతాయి. ఎప్పటికప్పుడు కొత్త శక్తిని సంతరించుకుంటాయి. మెదడు కూడా అంతే. ప్రతీ పనికీ ఏదో ఒక సాధనం మీద ఆధారపడుతూ మెదడును వాడటం తగ్గించేస్తున్నాం. దీని వల్ల మెదడు త్వరగా వృద్ధాప్యం బారిన పడుతోంది. ఫలితంగా డిమెన్షియా, అల్జీమర్స్ వంటి తీవ్ర మతిమరుపు వ్యాధుల ముప్పూ పెరుగుతోంది. 2015 నాటి ప్రపంచ అల్జీమర్స్ నివేదిక ప్రకారం..మనదేశంలో 41 లక్షల మంది అల్జీమర్స్‌తోనే బాధపడుతున్నారు. 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా డిమెన్షియాతో బాధపడేవారిలో సగం మంది ఆసియాలోనే ఉండొచ్చనీ నివేదిక హెచ్చరించింది. 

 

నివారణ: మెదడును ఆరోగ్యంగా ఉంచుకోవటం మన చేతుల్లోనే ఉంది. మెదడుకు పదును పెట్టే పజిల్స్, సుడోకులు వంటి ఆటలు ఆడుతుండాలి. నిరంతరం కొత్తకొత్త విషయాలను నేర్చుకుంటూ ఉండటం ద్వారా మనం మెదడు పదును తగ్గకుండా చూసుకోవచ్చు. కొత్త భాష, సంగీతం, వంటలు ఇలా ఏవైనా కొత్త కొత్త విషయాలు నేర్చుకోవటం మంచిది. కంటి నిద్రపోవటం వల్ల జ్ఞాపకాలు స్థిరపడతాయి. ఏకాగ్రత కుదురుతుంది, మెదడు చురుకుగా పని చేస్తుంది. 

 

ఆహారం: మెదడు సమర్థంగా పని చెయ్యటానికి కొన్ని పోషకాలు చాలా అవసరం. శరీరంలోని మిగతా అవయవాల మాదిరిగానే శక్తి లేకపోతే మెదడు కూడా పనిచేయలేదు. అందువల్ల దంపుడు బియ్యం, రాగులు, సజ్జలు, జొన్నలు, చేపలు, టమోటాలు, ఆకుకూరలు, చికెన్, గుడ్లు, అరటి, బ్రకోలీ వంటివి తీసుకోవటం మంచిది.