తిరిగివచ్చిన జీవితం

ఆ రోజు ఎలాగైనా తన మనసులో మాటని భార్య చెప్పాలనుకుని గుండెను రాయి చేసుకుని ఇంటికి బయల్దేరాడు. తన జీవితంలోకి వేరే అమ్మాయి ప్రవేశించిందనీ... అందుకోసం విడాకులు కావలన్న విషయాన్ని తన భార్యకు చెప్పేందుకు బయల్దేరాడు. విడాకులు కావాలన్న నిర్ణయాన్ని వినగానే ఆమె ఒక్కసారిగా పాలిపోయింది. ఆమె బాధని చూసిన అతను తనకి విడాకులు ఎందుకు కావాలన్న విషయాన్ని మాత్రం చెప్పలేకోపోయాడు. అంతగా ప్రేమించే భార్యని విడిచి తను ఇంకొకరిని ప్రేమిస్తున్నానన్న విషయాన్ని ఎలా చెప్పగలడు! కాకపోతే వివాహం తరువాత కూడా ఆమెను లోటు రాకుండా చూసుకుంటానని మాట ఇచ్చాడు. పెళ్లైన తరువాత తాము ఎన్నో కలలతో నిర్మించుకున్న ఇంటితో పాటుగా, నెలనెలా తన జీతంలో కొంతభాగాన్ని ఆమెకు ఇస్తానని చెప్పాడు. కానీ విడాకులు మాత్రం ఇచ్చి తీరాల్సిందేనని పట్టుబట్టాడు.

 

ఆ రాత్రంతా తన భార్య మెలకువగానే ఉండటాన్ని గమనించాడు. మర్నాడు ఉదయం అతను ఆఫీసుకి బయల్దేరుతుండగా- ‘‘నేను విడాకులు ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాను. అందుకు బదులుగా నాకేమీ డబ్బు, ఆస్తి అక్కర్లేదు. కానీ ఒక్క చిన్న షరతు...’’ అంది భార్య. భార్య విడాకులకు ఒప్పుకోగానే అతను ఎగిరి గంతేసినంత పనిచేశాడు. ‘‘నీ షరతు ఏమిటో చెప్పు! దాన్ని నా తల తాకట్టు పెట్టయినా నెరవేరుస్తాను,’’ అన్నాడు.

 

‘‘మనం ఎంత కష్టపడి, ఎన్ని కలలు కని ఈ ఇంటిని కట్టుకున్నామో మీకు తెలుసు. ఇల్లు కట్టుకున్న మొదట్లో రోజూ సాయంత్రం కాసేపు పెరట్లో కూర్చుని, అక్కడే కబుర్లు చెప్పుకొంటూ భోజనం చేసేవారం గుర్తుందా!’’ అని అడిగింది భార్య. ‘‘ఓ గుర్తులేకే!’’ అన్నాడు భర్త ఉత్సాహంగా. ఈ మధ్య కాలంలో అతని ఉద్యోగపు బాధ్యతల్లో పడి ఎప్పుడో చీకటి పడేవేళకు వస్తున్నాడతను. ‘‘అలా ఒక నెల రోజుల పాటు మనం తిరిగి ఈ పెరట్లోనే మన సాయంత్రపు వేళలను గడపాలి. రాత్రిళ్లు ఇక్కడే భోజనం చేయాలి. ఇదే నా షరతు!’’ అంది భార్య. ‘ఓస్‌ ఇంతేనా!’ అనుకున్నాడు భర్త. కళ్లుమూసి తెరిచేలోగా ఆ నెలరోజులూ గడిచిపోతాయని అతనికి తెలుసు. ఆ నెల రోజులూ తన పనిని త్వరగా ముగించుకుని ఇంటికి రావడం ఏమంత కష్టం కాదు కూడా!
***

మొదటిరోజు ఏదో తప్పనిసరి తద్దినంగా ఆఫీసునుంచి త్వరగా వచ్చి పెరట్లో కూర్చున్నాడు భర్త. తన భార్య విడాకుల గురించి ఏదో ఒక క్లాసు పీకుతుందని అతను సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆశ్చర్యం! ఆవిడ విడాకుల గురించి కానీ, తమ మధ్య ఉన్న గొడవల గురించి కానీ ఒక ముక్క కూడా మాట్లాడలేదు. పైగా వారిమధ్య ఏమీ జరగనట్లుగా సరదా సరదా కబుర్లన్నీ మొదలుపెట్టింది.

 

తన భార్య సందడిగా మాట్లాడుతుంటే భర్త ఆమెను గమనిస్తూ ఉండిపోయాడు. ఆమెను అతను అలా దగ్గరగా చూసి ఎన్నాళ్లయ్యిందో! ఆమె మొహంలో సంసారం కోసం పడిన తపన కనిపిస్తోంది. ఆ తపన కోసం పడ్డ కష్టం కనిపిస్తోంది. ఆ కష్టంతో వచ్చిన అలసట కనిపిస్తోంది. కానీ అవేవీ పట్టించుకోకుండా ఆమె నిరంతరం ఈ ఇంటి కోసమే బతకడం కనిపిస్తోంది. ఇంతలో వాళ్ల పిల్లవాడు కూడా ట్యూషన్‌ నుంచి అక్కడికి వచ్చాడు. వాడికి తన తండ్రి అంత త్వరగా ఇంటికి రావడం చూసి భలే ఆశ్చర్యం వేసింది. స్కూల్‌ బ్యాగ్ ఒక్కసారిగా విసిరేసి తండ్రిని చుట్టుకుపోయాడు. మొదటి రోజు అలా గడిచింది. రెండో రోజు కూడా అతను ఆఫీసు నుంచి ఇంటికి త్వరగా రావడం, అతని భార్య ఏమీ జరగనట్లు హాయిగా మాట్లాడటం, అతను విస్తుపోయి చూస్తుండటం, కొడుకు తండ్రిని చూసి సంబరపడిపోవడం... అంతా యథాతథంగా జరిగిపోయాయి. కానీ మూడో రోజు నుంచి అతని పరిస్థితిలో మార్పు రాసాగింది. ‘ఎలాగూ విడికులిస్తున్నాను కదా! ఈ నెల రోజులూ వీరితో హాయిగా గడిపితే ఏం?’ అన్న ఆలోచన అతనిలో మొదలైంది. పైగా భార్యాపిల్లలతో అలా గడపడం అతనికి మంచి కాలక్షేపంగా తోచింది.

 

రోజులు కాస్తా వారాలుగా మారాయి. ఒక్క రెండు వారాలు గడిచాయో లేదో... ఆపీసులో కూర్చున్నంతసేపూ ఇంటికి ఎప్పుడెప్పుడు వెళ్దామా అని ఆత్రుత పడసాగాడు. ఒకప్పుడు సాయంత్రం మిత్రులతో కలిసి ఎంత తాగినా పొందలేని సంతోషం ఇప్పుడు రాత్రివేళ కలిసి చేసే భోజనంలో కలుగుతోంది. తన పిల్లవాడి మొహంలో కనిపించే ఆనందం ముందు తన ఉద్యోగం కూడా చిన్నదిగా కనిపిస్తోంది. ఇక బంగారంలాంటి భార్యని కాదని తను వేరే మనిషి ప్రేమలో ఎలా పడ్డాడో అతనికే అర్థం కాకుంది. మరో వారం గడిచిందో లేదో... ఇక అతనివల్ల కాలేదు. ఒక రోజు సాయంత్రం ఇంటికి తిరిగివచ్చి విడాకుల పత్రాన్ని కాస్తా ముక్కుముక్కలుగా చించేశాడు. ఆపై భార్య చేతులు పట్టుకుని భోరున ఏడ్చేశాడు. అతనిలో ఈ మార్పు వస్తుందని ఆమెకు ముందే తెలుసనుకుంట! ఒక్క చిరునవ్వు ఆమె మొహంలో విరిసింది!!!

(ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)

- నిర్జర.