నా నెంబర్‌కు ఆధార్‌ను లింక్ చేయను

ఇప్పుడంతా ఆధార్‌మయం.. సిమ్‌కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్ దాకా ఆధార్‌ లేకపోతే ఏ పని జరగడం లేదన్నది అందరికి తెలిసిందే.. కేంద్రప్రభుత్వం నిర్ణయంతో ఎక్కడికి వెళ్లినా ఆధార్‌ని వెంటపెట్టుకోవాల్సి వస్తుంది. ఏ పనికైనా.. పథకానికైనా 12 అంకెల సంఖ్యను తప్పనిసరి చేస్తుండంటంతో సమస్త సమాచారం ఒకే ఛత్రం కిందకు వచ్చేస్తోంది. దీని వల్ల విస్తృత ప్రయోజనాలున్నట్లే అంతేస్థాయిలో ప్రమాదం ఉందని అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా పౌరుల వ్యక్తిగత సమాచారానికి భద్రత లేకుండా పోతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

 

ప్రతీ దానికి ఆధార్ అనుసంధానం వల్ల ప్రజల బ్యాంక్ ఖాతా సంఖ్యలు, ఈ-మెయిల్స్ చిరునామాలు, ఫోన్ నెంబర్లు వంటి వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించే ప్రమాదముందంటున్నారు. ఆధార్ అనుసంధానంపై ఇప్పటికే ఎన్నో పిటిషన్లు సుప్రీంకోర్టు వద్ద ఉన్నాయి. దీనిపై స్పందించిన సర్వోన్నత న్యాయస్థానం.. సంక్షేమ పథకాలకు ఆధార్ తప్పనిసరి చేయరాదని కేంద్రానికి అక్షింతలు వేసింది.

 

తాజాగా ఇదే వ్యవహారంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. తన ఫోన్ నెంబర్‌కు ఎట్టిపరిస్థితుల్లోనూ ఆధార్‌‌ను జతపరిచేది లేదని ఆమె తేల్చి చెప్పారు. ఇవాళ కోల్‌కతాలో పార్టీ కోర్‌ కమిటీ సమావేశంలో మాట్లాడిన మమత ప్రతీ ఒక్కరూ తమ ఫోన్‌ నంబర్‌ను ఆధార్‌కు అనుసంధానం చేసుకోవాలన్న కేంద్ర ఆదేశాలను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. అసలు బీజేపీ ప్రభుత్వానికి ఏం కావాలి.. పౌరుల వ్యక్తిగత వివరాలను వినాలనుకుంటుందా అని ప్రశ్నించారు. ఆధార్‌ను ఫోన్‌ నెంబర్‌కు అనుసంధానం చేసిన తర్వాతి క్షణం నుంచి భార్యభర్తలు మాట్లాడుకునే వ్యక్తిగత వివరాలన్నీ బీజేపీ హెడ్ ఆఫీసుకు వెళ్లిపోతాయని ఆరోపించారు. నా సమాచారం అలా మూడో కంటికి తెలియడం నాకు ఇష్టం లేదు.. కాబట్టి నా ఫోన్‌ నెంబర్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసుకోనని.. కావాలంటే తన నంబర్‌ను కట్ చేసుకోవచ్చని అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu