కంప్యూటర్‌లో కనిపించేదంతా నిజమేనా!

 

ఓ ఇరవై ఏళ్ల నాటి సంగతి. ఇంటర్నెట్ ‌అందరికీ అందుబాటులో ఉండేది కాదు. ఒకవేళ ఏ నెట్‌ సెంటర్లోకన్నా వెళ్తే... అక్కడా ఏమంత సౌకర్యం కనిపించేది కాదు. మెయిల్‌ ఓపెన్‌ కావడానికి కూడా ఓ పావుగంట పట్టేది. దానికీ ఓ నలభై రూపాయలు చెల్లించాల్సి వచ్చేది. ఇప్పటి పరిస్థితి అలా కాదు. అరచేతిలో వైకుంఠంలా... ఓ సెల్‌ఫోన్‌ ఉంటే చాలు, నట్టింట్లోనే నెట్‌ చూసేయవచ్చు. అది కూడా కొద్దిపాటి ఖర్చుతోనే. కానీ మీరు ఓ విషయం గమనించారా!

 

ఇంటర్నెట్‌లో ఏదన్నా వార్త వచ్చిందనుకోండి... అది దావానలంలా వ్యాపిచేస్తుంది. ఆ వార్త నిజమా కాదా అని ఆగి ఆలోచించేంత ఓపిక ఎవ్వరికీ కనిపించదు. వినేందుకు కాస్త సంచలనంలాగా కనిపిస్తే చాలు, వార్తకి వీక్షకులు పెరిగిపోవడం ఖాయం. ఇక దాన్ని వీడియో రూపంలో మార్చేయడం, ప్రోమోలు రూపొందించేయడం మామూలే! అసలైన నిజం తెలిసేసరికి తాము నెట్‌లో చూసిందే నిజం అన్నంత భ్రమలో జనం ఉంటున్నారు. ఇంకా చెప్పాలంటే ఆకర్షణీయమైన అబద్ధాలను గ్రహించేందుకే జనం సిద్ధంగా ఉన్నారు.

 

కేవలం వార్తలు మాత్రమే కాదు, ఇంటర్నెట్‌లో ఎలాంటి సమాచారం దొరికినా కూడా, ఇలాంటి పరిస్థితే కనిపిస్తుంది. దీనికే ‘1% rule’ అని పేరు పెట్టారు. అంటే ఒక శాతం మంది మాత్రమే కంటెంట్‌ సృష్టిస్తే,  దాన్ని అనుసరించేవారు 99% మంది ఉంటారన్నమాట. ఉదాహరణకు వికీపీడియానే తీసుకోండి. ఒక అంచనా ప్రకారం వికీపీడియాలో మూడొంతులకు పైగా వ్యాసాలని, దాన్ని చూసేవారిలో కేవలం రెండు శాతం మంది మాత్రమే రాస్తూ ఉంటారు.

 

కొంతమందే తమకి తోచింది రాయడం, వెనకా ముందూ చూడకుండా ఇతరులు దాన్ని అనుసరించడం ఏమంత సమర్థనీయం కాదని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల నెటిజన్ల మనసులో విషాన్ని నింపడం చాలా తేలికని హెచ్చరిస్తున్నారు. దీనికి ఉదాహరణగా కొన్ని జిహాద్‌ గ్రూపుల వెబ్‌సైట్లనే చూపిస్తున్నారు. వాటిలో తరచూ పోస్టింగులు పెట్టేవారి సంఖ్య ఒకశాతాన్ని మించడం లేదని తేలింది. అంటే మిగతా 99 శాతం మందీ ఆ పోస్టులని చూసి, ఎలాంటి చర్చా సాగించకుండానే తమలో ద్వేషాన్ని నింపుకుంటున్నారన్నమాట.

 

ఈ తరహా అసమానత participation inequality అనే సమస్యకి దారితీస్తుందట. భయంతోనో, జంకుతోనో ఎలాంటి మార్పులోనూ పాలుపంచుకోకపోవడమే ఈ participation inequality. దానివల్ల అబద్ధానిదే పైచేయిగా మారిపోతుంది. ఇందుకోసం ‘yahoo groups’ని సాక్ష్యంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడంటే వీటి జోరు తగ్గింది కానీ, ఒకప్పుడు yahoo groupsతో జనం తెగ కాలక్షేపం చేసేవారు. తమ భావాలను పంచుకుంటూ, చర్చలు చేయడానికి వీటిని గొప్ప వేదికగా భావించేవారు. ఈ yahoo groupsని పరిశీలించినవారికి కూడా మనం పైన చెప్పుకొన్న గణాంకాలే కనిపించాయి. నూటికి ఒక్కరు ఏదో ఒక గ్రూప్‌ని మొదలుపెడతారు. అందులో ఓ పదిమంది పాల్గొంటారు. ఇంకో 90 మంది సభ్యులు సరదాగా వేడుక చూస్తారు.

 

మన జీవితాల్లో ఇంటర్నెట్‌ ప్రభావాన్ని ఏమాత్రం కాదనలేం. కానీ నెట్‌లో కనిపించేదంతా వేదం కాదని ఈ ‘1% rule’ గుర్తుచేస్తోంది. ప్రశ్నించకుండా, చర్చించకుండా దేన్నీ అంగీకరించకూడదని హెచ్చరిస్తోంది.

- నిర్జర.