కొత్త భాషతో కొత్త జీవితం

 

చాలామంది ఏదో ఒక్క భాష మీద పట్టు ఉంటే చాలుకదా అనుకుంటారు. మరికొందరు అవసరం కదా అనుకుని ఇంగ్లీష్ వంటి మరో భాషని నేర్చుకుంటారు. కానీ భాష అంటే కేవలం ఇద్దరు మనుషులు మాట్లాడుకునే సాధనం మాత్రమే కాదు కదా! అది ఒక కొత్త ప్రపంచానికి ప్రతీక. భాష వెనుక ఏకంగా ఒక సంస్కృతే దాగి ఉంటుంది. అంతేకాదు! కొత్త భాషలని నేర్చుకోవడం వల్ల లెక్కలేనన్ని లాభాలు ఉంటాయంటున్నారు నిపుణులు. వాటిలో కొన్ని...


ఆత్మవిశ్వాసం:
ఒకటికి మించిన భాషలు నేర్చుకున్నవారిలో తాము ఇతరులకంటే ఏమాత్రం తీసిపోమన్న విశ్వాసం ఉంటుంది. భాష అనేది జ్ఞానానికి సూచన కాబట్టి, తాము ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోగల సమర్థులం అన్న నమ్మకం కలుగుతుంది. ముఖ్యంగా తాము నేర్చుకున్న భాష అవసరమయ్యే పరిస్థితులలో, తమ సహచరులకంటే వారే దూకుడుగా ఉండగలుగుతారు.


మెదడు పనితీరు:
ఎక్కువ భాషలను నేర్చుకున్నవారి మెదడులో రకరకాల సానుకూల చర్యలు జరుగుతూ ఉంటాయి. అల్జీమర్స్, మతిమరపు వంటి వ్యాధులు ఇలాంటివారికి దూరంగా ఉంటాయని ఎన్నో పరిశోధనలు నిరూపించాయి. అంతేనా! వీరిలో జ్ఞాపకశక్తి మెరుగుపడుతుందనీ, మెదడు మరింత చురుగ్గా పనిచేస్తుందనీ తేలింది. అటు వినికిడి కూడా మెరుగుపడుతుందట!

అదనపు అర్హత:
కొత్త భాష అనేది ఎప్పుడూ ఒక అదనపు అర్హతే! కొత్త భాషతో కొత్త కొత్త అవకాశాలు లభిస్తాయి. ఉపాధి పరిధి విస్తరిస్తుంది. ఉదాహరణకు హిందీ వచ్చినవాడు, దేశంలో ఎక్కడైనా ఉద్యోగం సంపాదించుకునే ప్రాథమిక అర్హతను సాధిస్తాడు. అంతేకాదు! యాజమాన్య సంస్థలు ఎప్పుడూ కూడా ఒకటికి మించి భాషలు వచ్చినవారికి అదనపు ప్రాధాన్యతని ఇస్తాయి.


భిన్నమైన పనులు:
పరుగులెత్తే ఈ జీవితంలో ఒకేసారి రకరకాల పనులు చేయాల్సి ఉంటుంది. దీనినే మల్టీ టాస్కింగ్ అంటారు. ఒకటి మించిన భాషలను నేర్చుకునేవారు వెంటవెంటనే వేర్వేరు పనులను చేయగలుగుతారనిన పరిశోధనలు నిరూపించాయి. పైగా వీరు కొత్త పరిస్థితులలో కూడా సులువుగా ఇమిడిపోగలుగుతారంట. అప్పటికప్పుడు అవసరమయ్యే నిర్ణయాలను కూడా తీసుకోగలుగుతారట.

విశాల దృక్పథం:
కొత్త భాషని నేర్చుకున్న మనిషి కొత్త ప్రాంతాలలో తిరగగలుగుతాడు. ఆ భాషలో ఉన్న విజ్ఞానాన్ని నేర్చుకోగలుగుతాడు. భిన్నమైన సంస్కృతినీ, జీవన విధానాన్నీ చూసి తన అభిప్రాయాలను మెరుగుపరుచుకుంటాడు. ఎక్కువ భాషలు నేర్చుకున్న వారు ప్రయాణాలు చేయడానికీ, ప్రపంచాన్ని అన్వేషించడానికీ ఉత్సాహం చూపుతారు. ఒక భాష తెలిసినవారికి మరో భాషని నేర్చుకోవడం మరింత సులువుగా మారుతుంది. మెదడు అప్పటికే భాషకి సంబంధించిన ప్రాథమిక సూత్రాలు నమోదై ఉంటారు కాబట్టి, మరో భాషని నేర్చుకునేందుకు అది అంతగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. మరింకేం... 30 రోజుల్లో ఏదో ఒక భాషను నేర్చుకునేందుకు సిద్ధపడితే పోలా!