గోల్డ్ స్టోన్ కుంభకోణంలో కొత్త ట్విస్ట్... బయట పడుతున్న బడా బాబులు
posted on Jun 10, 2017 12:19PM
అనుకున్నదే జరిగింది. తీగ లాగితే డొంక కదిలినట్ట్టు... ఈ గోల్డ్ స్టోన్ కంపెనీ చేసిన భూ కుంభకోణంలో పలు ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి. గోల్డ్ స్టోన్ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తు వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఇబ్రహీంపట్నం దందుమైలారంలో మరో భూ కుంభకోణం బయటపడింది. ప్రభుత్వ భూములను కబ్జా చేసి పలువురు రియల్టర్లు, రాజకీయ నాయకులు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులతో కుమ్మక్కై ఈ కుంభకోణానికి తెర లేపినట్లు అనుమానాలు ఉన్నా ఇప్పుడు.. ఆ అనుమానాలు నిజమనే పరిస్థితి ఏర్పడింది. ఈ కుంభకోణం వెనుక ఉన్న అసలు పాత్ర ధారుల కోసం వేటాడుతున్న పోలీసుల దర్యాప్తులో తెలంగాణ అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు (కె.కె) కుటుంబం బయటపడింది. నకిలీ జీపీఏతో అటవీ భూములను కబ్జా చేసిన గోల్డ్ స్టోన్ కంపెనీ నుండి కె.కె కుటుంబం 50 ఎకరాలు కొనుగోలు చేసినట్టు తెలిసింది. ఈ భూములన్ని దొంగ జీపీఏల ద్వారా కబ్జా చేసినవేనని.. కెకె కుమార్తె గద్వాల విజయలక్ష్మి, కోడలు జ్యోత్న(విప్లవ్ కుమార్ భార్య), కంచర్ల నవజ్యోతిలకు ఈ భూమిని గోల్‌స్టోన్ కంపెనీ రిజిస్ట్రేషన్ చేసినట్లు సమాచారం.
ఇక తమ కుటంబంపై వస్తున్న ఆరోపణలపై కె.కె స్పందించారు. మేం ప్రభుత్వ భూములు కొనలేదు.. అన్ని డాక్యుమెంట్లు పరిశీలించి క్లియరెన్స్ తీసుకున్న తరువాతే భూమిని కొనుగోలు చేశాం.. తాము కొన్న భూములకు అన్ని పత్రాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. హైకోర్టు ఆదేశాలతోనే భూమి రిజిస్ట్రేషన్ అయ్యింది.. 12 మెమోలను కూడా పరిశీలించాం..సీఎస్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ వివరణ కూడా కోరాం.. అధికారులు అన్నీ సక్రమంగా ఉన్నాయని చెప్పిన తరువాతే విల్ గో మీడియా సంస్థ నుండి భూమి మాకు రిజిస్ట్రేషన్ అయింది.. ఒకవేళ్ హైకోర్టు ఆదేశాలపై అభ్యంతరాలు ఉంటే ప్రభుత్వ అధికారులే రివిజన్ కు వెళ్లాలి అని అన్నారు. ఈయన ఒక్కడే కాదు.. టీడీపీ నుండి అధికార పార్టీ లోకి జంప్ అయిన ఓ సిటీ ఎమ్మెల్యే కూడా గోల్డ్ స్టోన్ కంపెనీ భూముల్లోనే విల్లాలు కట్టి దర్జాగా తిరుగుతున్నాడు. ఇంకా ప్రజారాజ్యం పార్టీ, వైసీపీ పార్టీ నుండి ఎంపీగా పోటీ చేసి ఓడిన ఓ నేత కూడా హైటెక్ సిటీ పరిధిలోని 30 ఎకరాల భూమిని డెవలప్ మెంట్ కోసం తీసుకున్నాడు. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేకుండా.. రాజకీయ నేతలందరూ గోల్డ్ స్టోన్ విసిరే ఎంగిలి మెతుకులకు ఆశపడి.. దాని వెనుక ఉండి పనులు చేసిపెడుతూ.. వారు లబ్ది పొందుతున్నారు.
మొత్తానికి తెలుగువన్ ముందు చెప్పినట్టు ఈ భూ కుంభకోణంలో దాగివున్న పెద్ద తలకాయల పేర్లు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇప్పటికే గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఆచూకీ కోసం పోలీసులు 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దేశం మొత్తం గాలిస్తున్నాయి. మరికొంత మంది ఈ భూ కుంభకోణలో అవినీతి అనకొండలకు ఎవరి సహకారం అందుతుంది.. ఇంకా ఎవరు ఈ ల్యాండ్ కిరికిరిలో ఉన్నారు అని వేటాడుతున్నారు. మరి పోను పోను ఇంకా ఎంతమంది పేర్లు బయటకు వస్తాయో తెలియాలంటే కీప్ వాచింగ్.