కిరణ్ కాంగ్రెస్ కోసం రెబల్స్ ఎదురుచూపులు

 

ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉందో పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ మొన్ననే మీడియా సమావేశం పెట్టి మరీ చెప్పుకొన్నారు. కనీసం 25మంది శాసనసభ్యులు మరో కొందరు మంత్రులు కూడా త్వరలోనే పార్టీలో నుండి వేరే పార్టీలలోకి జంప్ అయిపోనున్నారని బల్లగుద్దీ మరీ చెప్పారు. అయితే వారిలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారా లేదా? అనే సంగతి కూడా చెప్పి పుణ్యం కట్టుకొని ఉంటే, ఆయన కొత్త పార్టీ పెడతారని ఆశగా ఎదురుచూస్తున్నవారి నోట్లో పంచదార పోసినట్లయ్యేది.

 

వారిలో చాలా మంది తమకు సరిపడని జగన్మోహన్ రెడ్డితోనో, లేక తమ రాజకీయ ప్రత్యర్ధి చంద్రబాబుతోనో సర్దుకుపోవడం కంటే, ఒకటే బ్లడ్ గ్రూప్, ఒకటే బ్లడ్ కల్చర్, ఒకటే డీ.యన్.యే. ఉన్న కిరణ్ కుమార్ రెడ్డితోనే సర్దుకుపోవడమే సులువని భావిస్తు, జనవరి23 ముహూర్తం కోసం కళ్ళు కాయలు కాసేలా, చకోరపక్షుల్లా ఎదురుచూస్తున్నారు పాపం.

 

చివరికి రాయపాటి, లగడపాటి, ఉండవల్లి వంటి సీనియర్ రాజకీయ నేతలు కూడా ఎంతసేపు కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెడితే అందులో ఎక్కి ఈ ఎన్నికల వైతరిణిని దాటేద్దామని ఆశపడుతున్నారు తప్ప వారిలో ఎవరూ కూడా స్వయంగా పార్టీ పెట్టే ఆలోచన చేయడం లేదు. తమకంటే చాలా జూనియర్ అయిన కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పెడితే, ఆయన క్రింద ఇంతమంది సీనియర్లు పనిచేసేందుకు సిద్దపడుతుండటం చాలా అనుమానాస్పదంగా ఉంది. ఇదంతా చూస్తే కిరణ్ కుమార్ రెడ్డితో సహా అందరూ కూడా కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే నడుచుకొంటున్నారనే అనుమానం కలుగుతోంది.

 

రాష్ట్ర విభజన చేస్తే సీమాంధ్రలో తీవ్ర వ్యతిరేఖత ఎదురవుతుందని, దానివల్ల పార్టీకి తీవ్రంగా నష్టం కలుగుతుందని కాంగ్రెస్ అధిష్టానానికి తెలియకపోదు. బహుశః అందుకే రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ “పార్టీని రెండు ప్రాంతాలలో ఏవిధంగా గెలిపించుకోవాలో మాకు తెలుసు. అందుకు తగిన వ్యూహాలు మావద్ద ఉన్నాయని” ధీమా వ్యక్తం చేసారు.

 

ఇంతవరకు ఈ కాంగ్రెస్ అధిష్టాన వ్యతిరేఖ వర్గమంతా కలిసి రాష్ట్రవిభజనకు పూర్తి సహకారం అందించారు. జనవరి23తో అధిష్టానం తమకు అప్పజెప్పిన ఆ పని కూడా పూర్తి చేసిన తరువాత కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఈ తిరుగుబాటుదారులందరూ కొత్త జెండా పట్టుకొని ఎన్నికలలో పోటీచేయడం, కాంగ్రెస్ వ్యతిరేఖతను ఓట్లుగా మలచుకొని ఎన్నికలలో గెలిచిన తరువాత తిరిగి కాంగ్రెస్ పార్టీలో కలిసిపోవడమే ఆ వ్యూహం అయ్యిఉండవచ్చును.

 

ఆ ప్రయత్నంలో భాగంగానే వారందరూ కూడా కాంగ్రెస్ అధిష్టానం తమను, ప్రజలను కూడా చాలా అన్యాయం చేసిందని, రాష్ట్రంలో కాంగ్రెస్ భూస్థాపితమయిపోతుందని అంటూ కాంగ్రెస్ ను తిట్టిపోస్తూ ప్రజల సానుభూతిని, కాంగ్రెస్ పట్ల వ్యతిరేఖతను పెంచి పోషిస్తున్నారు. అందరూ కలిసి పార్టీకి తీరని నష్టం కలిగిస్తున్నా కూడా పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ ఎవరిమీద మీద ఇంతవరకు ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోవడం ఈ అనుమానాలను దృవీకరిస్తోంది. అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే వాళ్ళందరూ పార్టీ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నారు తప్ప సోనియాగాంధీని విమర్శించడం లేదు. పార్టీలో అందరూ తమ తమ అభిప్రాయాలు చెప్పుకోవచ్చని బొత్స వారిని వెనకేసుకొని వస్తున్నారు. అంటే కిరణ్-కాంగ్రెస్ లో జేరెందుకు ఆలోచిస్తున్నవారు మాత్రం నేటికీ పార్టీ క్రమశిక్షణ అధిగమించడం లేదని, వేరే పార్టీలలో టికెట్స్ ఖరారు చేసుకొన్నవారే కాంగ్రెస్ పార్టీని, అధిష్టానాన్నికించపరుస్తున్నారని అర్ధం అవుతోంది. బహుశః అందుకే జేసీ దివాకర్ రెడ్డికి షో-కాజ్ నోటీసులు జారీచేసారు. మిగిలిన వారు పార్టీకి ఎంత నష్టం కలిగిస్తున్నాదానిని అభిప్రాయ వ్యక్తీకరణ పద్దులో వ్రాసి అడ్జస్ట్ చేస్తున్నారు. బహుశః జనవరి23 తరువాత కిరణ్ కొత్త పార్టీ పెట్టగానే, అప్పుడు బొత్ససత్యనారాయణ వారందరి మీద మూకుమ్మడిగా క్రమశిక్షణ చర్యలు తీసుకొంటారేమో!