పల్లాకు కేసీఆర్ పరామర్శ
posted on Jun 11, 2025 2:40PM

ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో జారి పడి గాయపడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పరామర్శించారు. బుధవారం కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరు కానున్న నేపథ్యంలో పల్లా ఉదయమే ఆయనను కలిసేందుకు ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. ఏమైందో ఏమో కానీ అక్కడ ఆయన కాలు జారి కిందపడ్డారు. దీంతో ఆయనను హుటాహుటిన యశోదా ఆస్పత్రికి తరలించారు.
కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరైన మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు విచారణ పూర్తయిన తరువాత తిరుగు ప్రయాణంలో యశోదా ఆస్పత్రికి వచ్చి పల్లాను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఇలా ఉండగా పల్లా తుంటి ఎముక విరిగిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆస్పత్రిలో ఆయనకు చికిత్స కొనసాగుతోంది. తుంటి ఎముకకు గాయం కావడంతో పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు ఆయనకు సూచించారు. సర్జరీ చేయాల్సి ఉంటుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.