కమల్ హస్సన్ కి విశ్వరూపం చూపిస్తున్న జయ, కరుణ

 

కమల్ హస్సన్ తన విశ్వరూపం సినిమాని తన స్వంత రాష్ట్రమయిన తమిళనాడులో విడుదలచేసుకోవడానికి పడరాని పాట్లు పడుతుంటే, మరో పక్క జీవితకాల రాజకీయ ప్రత్యర్దులయిన తమిళనాడు ముఖ్యమంత్రి కుమారి జయలలిత, డీ.యం.కే. అధ్యక్షుడు కరుణానిధి ఇద్దరూ కూడా కమల హస్సన్ కి తమ రాజకీయ విశ్వరూపం చూపిస్తున్నారు.

 

జయలలిత కు చెందిన ‘జయ టీవీ చానల్’ కి కమల్ తన సినిమా శాటిలయిట్ హక్కులు ఈయనందుకే ఆమె అతని సినిమా విడుదల కాకుండా అడ్డుపడుతోందని ఆరోపిస్తుంటే, తన మీద అటువంటి ఆరోపణలు చేస్తున్న అతనిమీద, అవి ప్రచురించిన పత్రికలమీద కూడా చట్ట పరమయిన చర్యలు తీసుకోనున్నట్లు ఆమె ప్రకటించారు.

 

సినిమాని నిషేదించడం గురించి మాట్లాడుతూ “ విశ్వరూపం సినిమాను 534 ధియేటర్లలో విడుదల చేయాలని నిర్మాతలు అనుకోన్నారని, తనకు అందిన నిఘా వర్గాల నివేదికల ప్రకారం సినిమా ప్రదర్శించే ప్రాంతాలలో అల్లర్లు చెలరేగే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది కనుకనే, రెండు వారాల పాటు సినిమ్మను నిషేదించవలసి వచ్చిందని ఆమె అన్నారు. అల్లర్లు చెలరేగితే అదుపుచేసేందుకు అవసరమయిన కనీస పోలీసు సిబ్బంది కూడా తన వద్ద లేరని అందువల్ల సినిమాను రెండు వారాలు ఆపితే అప్పటికి పరిస్థితులు చక్కబడుతాయనే ఉద్దేశ్యంతోనే నిషేధం విదించవలసి వచ్చిందని ఆమె అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడవలసిన బాధ్యత తనదే గానీ, కరునానిధిది కాదుకదా, అందుకే ఆయన అంత తేలికగా మాట్లాడుతున్నాడని, జయలలిత విమర్శించారు.

 

కమల్ హస్సన్ పంచె కట్టుకొన్న వ్యక్తి(చిదంబరం)ని ప్రధాన మంత్రిగా చూడాలనుకొంటే అందుకు తనకెందుకు అభ్యంతరం ఉంటుందని, కరుణానిధి చేసిన మరో వ్యాఖ్యలకు ఆమె ఘాటుగా సమాధానం ఇచ్చారు. వీరిద్దరి మద్య జరుగుతున్న రాజకీయ యుద్ధంలో కమల్ హస్సన్ లేగదూడలా నలిగిపోతున్నాడు.