కొత్తపార్టీ పెట్టనున్న జయలలిత మేనకోడలు...
posted on Feb 7, 2017 3:46PM

తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇప్పటికే అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన శశికళ ముఖ్యమంత్రిగా ఎప్పుడు ప్రమాణం స్వీకారం చేస్తారో.. అసలు ఇప్పట్లో చేస్తారో..?లేదో..? అన్న గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు జయలలిత మేన కోడలు దీపా జయకుమార్ తెరపైకి వచ్చింది. ఆమె కొత్త పార్టీ పెట్టనున్నట్టు ప్రకటించారు. దీనికి సంబంధించిన వివరాలు ఈనెల 24న వెల్లడిస్తానని తెలిపారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ... జయలలిత ఆశయ సాధనే లక్ష్యంగా పార్టీ స్థాపిస్తున్నానని... ప్రజల చేత ఎన్నికైన వ్యక్తే ముఖ్యమంత్రి కావాలి.. ప్రజలు శశికళను సీఎంగా కోరుకోవడం లేదు.. జయలలిత మృతితో ఖాళీ అయిన స్థానం నుండే తాను పోటీచేస్తానని స్పష్టం చేశారు. అంతేకాదు జయను ఆస్పత్రిలో చూసేందుకు నన్ను అనుమతించలేదు.. అపోలో ఆస్పత్రి గేటు వద్దే నన్ను ఎందుకు నిలిపివేశారు..జయమృతిపై వైద్యుల వివరణ సరిగా లేదు.. చికిత్స వివరాలు బయటపెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. మరి తమిళరాజకీయాలు ముందు ముందు ఇంకెన్ని కొత్త మలుపులు తిరుగుతాయో చూడాలి.