వివక్షను నిరూపించిన ప్రయోగం

Publish Date:Oct 19, 2016


అది 1968 సంవత్సరం, ఏప్రిల్‌ 4. అమెరికాలో నల్లజాతీయుల హక్కుల కోసం పోరాడుతున్న ‘మర్టిన్‌ లూథర్‌ కింగ్’ అనే నాయకుని, శ్వేతజాతీయులు అత్యంత దారుణంగా కాల్చి చంపారు. ఈ సంఘటనతో అమెరికా అంతా అట్టుడికిపోయింది. అమెరికాలో ఉన్న నల్ల జాతీయుల మీద అకృత్యాలు పెరిగిపోతున్నాయంటూ మేధావులు గగ్గోల పెట్టేశారు. ఆ దేశంలోని వివిధ జాతుల మధ్య సఖ్యత కుదిరేది ఎలాగా అంటూ నేతలు మధనపడిపోయారు. ఇదే సమయంలో ‘జేన్‌ ఎలియట్‌’ అనే ఉపాధ్యాయురాలు మరో విధంగా ఆలోచించడం మొదలుపెట్టింది.

 

వివక్ష మూలాలు

జేన్‌ ఎలియట్‌ అమెరికాలోని లోవా నగరంలోని ఓ పాఠశాలలో మూడో తరగతి పిల్లలకు పాఠాలు చెబుతూ ఉండేది. లూథర్‌ కింగ్‌ హత్య జరిగిన తరువాత ఆమె తన విద్యార్థులని వివక్ష గురించి రకరకాల ప్రశ్నలు అడిగింది. అందులో శ్వేతజాతీయులైన పిల్లలు తాము నల్లజాతీయుల పిల్లలు పనికిరానివారిగా భావిస్తూ ఉంటామనీ, వారిని నిగ్గర్లని పిలుస్తూ అవమానిస్తూ ఉంటామనీ చెప్పారు. నల్లజాతి పిల్లలేమో తాము వివక్షకు గురవుతున్న విషయం తమ మనసుకి తెలుస్తూనే ఉందని తేల్చి చెప్పారు.

 

 

ఒక వింత ప్రయోగం

పిల్లలలో వివక్ష ఎలా మొదలవుతుంది? దాని కారణంగా వారి ప్రవర్తనలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి? వివక్షకి సంబంధించిన దృక్పథం వారి చదువు మీద ఎలా పడుతుంది?... వంటి ప్రశ్నలకు పిల్లలే జవాబులు కనుక్కునేలా చేయాలని ఎలియట్‌ భావించారు. ఇందుకోసం ఆమె రెండు రోజుల పాటు తన తరగతిలో ‘A Class Divided’ అనే ఓ ప్రయోగాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా మొదటి రోజున నీలం కళ్లు ఉన్నవారు నల్లటి కళ్లున్నవారికంటే చాలా అధికులని పిల్లలని నమ్మించారు ఎలియట్‌. నల్లటి కళ్లున్నవారు తెలివితక్కువవారనీ, సంస్కారం లేనివారనీ, మాట వినరనీ చెప్పుకొచ్చారు. వారితో ఆడకూడదంటూ నీలం కళ్లున్నవారికి సూచించారు. పైగా తమ ఆధిపత్యాన్ని చాటుకునేందుకు నీలం కళ్లున్నవారు ప్రత్యకమైన కాలర్‌ ధరించవచ్చని చెప్పారు.

 

ఫలితం అనూహ్యం

శ్వేత జాతీయులు, నల్ల జాతీయులు అన్న తేడా లేకుండా నీలం కళ్లు ఉన్నవారు ఎలియట్ మాటలకి చెలరేగిపోయారు. ఒక్క పూటలోనే వారి ప్రవర్తన మారిపోయింది. నల్లని కళ్లున్నవారిని నీచంగా చూడటం, వారిని ఏడిపించడం, ఇంకా మాట్లాడితే కొట్టడం చేయసాగారు. అభం శుభం తెలియని ఎనిమిదేళ్ల పిల్లలు కాస్తా రాక్షసంగా మారిపోయారు. వారిలో అన్ని రంగాలలో ఆధిక్యత కనిపించింది. చదువులో కూడా నల్లరంగు పిల్లలకంటే మెరుగైన ఫలితాలు సాధించారు.

 

 

ప్రయోగంలో మార్పు!

మర్నాడు ఎలియట్‌ పిల్లల ముందు మరో ప్రతిపాదన చేశారు. తాను నిన్న నీలం రంగు పిల్లలు అధికులని చెప్పాననీ, నిజానికి నల్లకళ్లున్న పిల్లలే గొప్పవారనీ... వారే అధికులనీ తేల్చి చెప్పారు. నల్ల కళ్లున్న పిల్లల నీలం రంగు కళ్లున్న పిల్లలని దూరంగా పెట్టాలని సూచించారు. అనూహ్యంగా అంతకు ముందు రోజు నీలం రంగు కళ్లున్న పిల్లలు ఎలా ప్రవర్తించారో, మర్నాడు నల్లకళ్ల పిల్లలూ అలాగే ప్రవర్తించారు. ఆవేళ చదువులో వారిదే పైచేయిగా సాగింది.

 

విశ్లేషణ

ఫలానా జాతివాళ్లు, రంగువాళ్లు, కులంవాళ్లు గొప్పవారు అనే భావన మనిషి మనస్తత్వం మీద ఎలా ప్రభావం చూపుతుందో తెలియచేసే గొప్ప ప్రయోగం ఇది. తరువాత కాలంలో ఎలియట్‌ ఇదే ప్రయోగాన్ని పెద్దవారి మీద ప్రయోగించి ఇదే తరహా ఫలితాలను పొందారు. నిజానికి ఎవరూ ఉన్నతులు కారనీ, తాము ఉన్నతులం అనుకునే దృక్పథమే వారి ప్రవర్తనను ప్రభావితం చేస్తుందని ఎలియట్‌ తేల్చి చెప్పారు. అంతేకాదు! ఇలాంటి వివక్షతో కూడిన వాతావరణం పిల్లల నేర్పు మీద తప్పకుండా ప్రభావం చూపుతుందని తేల్చారు.

 

ఇప్పటికీ చాలామంది నల్లజాతీయుల పిల్లలు తెలివితక్కువవారని భావిస్తుంటారు. దానికి సంబంధించిన గణాంకాలను కూడా చూపిస్తుంటారు. నిజానికి సదరు పిల్లలు వెనుకబడి ఉండటానికి వారి చుట్టూ కల్పించిన అవిశ్వాసపు వాతావరణమే అంటున్నారు శాస్త్రవేత్తలు. అలాంటి వివక్షపు అడ్డుగోడలను కూల్చివేసిన రోజున, తరతరాలుగా పేరుకున్నా తప్పుడు అభిప్రాయాలను మార్చుకున్న రోజున... అందరూ సమానంగా జీవించగలరని ఈ ప్రయోగం తేల్చిచెబుతోంది.

 

 

- నిర్జర.

By
en-us Life Style News -