అప్పుడే కేసు ముగించొద్దంటున్న జగన్ లాయర్లు?

 

జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో సిబిఐ ఉద్దేశ్యపూర్వకంగానే దర్యాప్తు పూర్తిచేయకుండా సాగదీస్తోందని, కనీసం ఇంతవరకు ఒక్క చార్జ్ షీటు కూడా కోర్టులో దాఖలు చేయకుండా, కాంగ్రెస్ ప్రభుత్వం, సిబిఐ రెండూ కలిసి కుట్రపన్ని జగన్ మోహన్ రెడ్డిని అన్యాయంగా జైల్లో ఇరికించారని, ఇంకెంత కాలం దర్యాప్తు చేస్తారని ప్రశ్నిస్తూ వచ్చిన జగన్ తరపు న్యాయవాదులు, ఈ రోజు జగన్ అక్రమాస్తుల కేసులో కోర్టులో అభియోగం నమోదు చేయడానికి సిబిఐ సంసిద్దత తెలిపినప్పుడు, వారు దానిని తీవ్రంగా వ్యతిరేఖించడం విశేషం.

 

కేసు దర్యాప్తు జరుగుతున్నఈ తరుణంలో అభియోగాలు నమోదు చేస్తే నష్టం కలుగుతుందని మాత్రం చెప్పారు. అది ఏవిధంగా నష్టమో మాత్రం వారు చెప్పలేదు. అందువల్ల, కోర్టు జగన్ కేసును వచ్చే నెల 13వ తేదికి వాయిదావేసింది.

 

బహుశః జగన్ కేసులో ఇప్పుడ సిబిఐ కోర్టులో అభియోగాలు నమోదు చేసినట్లయితే, కేసు విచారణ మొదలయి, జగన్ పై మోపబడిన అనేక అభియోగాలలో ఏ ఒక్కటి నిరూపింపబడినా కూడా జగన్ మోహన్ రెడ్డి మళ్ళీ కొత్తగా శిక్షలు ఎదుర్కోవలసి ఉంటుందని వారి ఆలోచన (భయం) కావచ్చును.

 

అయితే, ఈ రోజు కాకపొతే రేపయినా కోర్టులో అభియోగాల నమోదు తప్పదన్నపుడు మరి జగన్ తరపున వాదిస్తున్నన్యాయవాదులు ఎందుకు వద్దంటున్నారు? సిబిఐ ఉద్దేశ్యపూర్వకంగానే దర్యాప్తు పూర్తిచేయకుండా సాగదీస్తోందని ఆరోపిస్తున్న వారు, ఇప్పుడు సిబిఐని దర్యాప్తు పూర్తిచేయమని (కొనసాగించమని) కోరడంలో అంతర్యం ఏమిటి? ఈ ప్రశ్నకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మరియు న్యాయ నిపుణులు  మాత్రమే సరయిన జవాబు ఈయగలరు.