వెన్నంటి వచ్చే ధైర్యం

 


అతని లోకం ఒక్కసారిగా చీకటిగా మారిపోయింది. ఏదో మాయదారి ఇన్ఫెక్షన్ సోకి అతని రెండు కళ్లూ కనిపించకుండా పోయాయి. వైద్యులంతా చేతులెత్తేశారు. పరిచయస్తులంతా సానుభూతి చూపేందుకు సిద్ధపడిపోయారు. కానీ ఎవరి ఓదార్పూ కూడా అతనికి స్వాంతన కలిగించలేదు. అకస్మాత్తుగా గుడ్డివాడిగా మారిపోవడం అంటే జీవితం చేజారిపోవడమే అనిపించింది. కానీ ఎన్నాళ్లని అలా ఇంట్లో కూర్చుంటాడు! అతనికి తగినట్లుగా ఏదో ఒక పని చూసిపెడతామని ఆఫీసువాళ్లు కబురుపెట్టారు. దాంతో భార్యని తీసుకుని రోజూ ఆఫీసుకి వెళ్లడం మొదలుపెట్టాడు. మళ్లీ సాయంత్రం వేళకి భార్య ఆఫీసు దగ్గరకి వచ్చి అతన్ని ఇంటికి తీసుకువెళ్లేది.

 

రోజూ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి బస్సులో ఆఫీసుకి వెళ్లడం, భార్య అతన్ని ఆఫీసులో దింపేసి ఇంటికి వచ్చి తన పనుల్లో మునిగిపోవడం, తిరిగి ఆఫీసు ముగిసే సమయానికి అక్కడికి వెళ్లి భర్తని తీసుకురావడం... ఇదే వారి దినచర్యగా మారిపోయింది. ఇలా ఒక నెలరోజులు గడిచాయి. ఒక రోజు ఉదయం భార్య, భర్త దగ్గరకి వెళ్లి నిదానంగా ‘‘ఎన్నాళ్లని ఇలా రోజూ మీతో పాటు రాగలను. పైగా ఏదో ఒక రోజు మీరు ఒంటరిగా వెళ్లక తప్పదు. అందుకని ఇప్పటినుంచే ఒంటరిగా వెళ్లడాన్ని అలవాటు చేసుకోరాదా! ఇంటి ముందర బస్సు ఎక్కితే ఆఫీసు ముందర దిగుతారు కదా!’’ అన్నది.

 

భార్య మాటల్లో నిజం లేకపోలేదని అతనికి తెలుసు. రోజూ ఇంటిపని వదులుకొని అంతంత దూరం తనతో పాటు రావడం వల్ల ఆమెకు సమయం వృధా కావడమే కాదు, విపరీతమైన అలసట కూడా కలుగుతోంది. కానీ తన మానాన తనని వదిలేయాలన్న ఆమె నిర్ణయం అతనికి బాధని కలిగిస్తోంది. ‘నిస్సహాయంగా ఉన్న తనని అలా ఎలా ఒంటరిగా వదిలిపెట్టగలదు!’ అన్న ఆలోచన అతని మనసుని తొలిచేస్తోంది. కానీ తప్పదు! ఆ రోజు నుంచి తనే ఒంటరిగా ఆఫీసుకి వెళ్లడం అలవాటు చేసుకున్నాడు. మొదట్లో తన భార్య తనని అలా వదిలిపెట్టేసినందుకు మనసు కుతకుతా ఉడికిపోయేది. కానీ రోజులు గడిచేకొద్దీ ఆమె తనతో రాకపోవడం వల్ల ఎలాంటి లోటూ కనిపించకపోయేది.ఇలా ఒక ఏడాది గడిచింది. ఒక రోజు అతను బస్సులో ఎక్కి ఎప్పటిలాగే ఒక ఖాళీ సీటులో చేరగిలపడ్డాడు. ఇంతలో అతని పక్కనే కూర్చున్న వ్యక్తి- ‘ఇవాళ ఆవిడ వచ్చినట్లు లేదేంటండీ?’ అంటూ అడిగాడు.‘ఎవరావిడ?’ అని యాంత్రికంగా ఎదురు ప్రశ్న వేశాడతను.

 

‘‘అదే! రోజూ మీ వెనకే బస్సు ఎక్కి ఆ మూల ఉన్న సీట్లో కూర్చునేది. మళ్లీ మీ వెనకే ఆఫీసు దగ్గర దిగిపోయేది. ఓ రెండు రోజుల నుంచీ ఆవిడ కనిపించడం లేదు. ఆవిడ ఇల్లు కూడా మీ ఇంటి దగ్గరేనేమో అనుకుని అడిగాను,’’ అన్నాడు తోటి ప్రయాణికుడు.

 

ఒక్క క్షణం పాటు తోటి ప్రయాణికుడు ఏం చెబుతున్నాడో అర్థం కాలేదు. ఆ తరువాత అతని మాట వెనుక మర్మం తెలిసొచ్చింది. ఏడాది క్రితం తన భార్య ఒంటరిగా ఆఫీసుకి వెళ్లడం అలవాటు చేసుకోమని చెప్పింది. కానీ తను క్షేమంగా వెళ్తున్నాడా లేదా గమనించేందుకు రోజూ తనని వెన్నంటే వచ్చేదన్నమాట! రోజూ ఎలాంటి ఇబ్బంది లేకుండా తను గమ్యం చేరుకుంటున్నాడన్న భరోసా కలిగిన తరువాతే తను ఇంటికి పరిమితమైంది. తను ఒంటరిగా అడుగు వేయలేనప్పుడు నడవక తప్పని పరిస్థితి కల్పించింది. ఒంటరిగా నడవడం అలవాటయ్యేదాకా తన క్షేమాన్ని గమనించుకుంది. అంత గొప్ప తోడు దొరకడం ఎంత అదృష్టమో కదా అనిపించింది అతనికి. ఏమిచ్చి తన బదులు తీర్చుకోగలనా అన్న ఆలోచనలో పడిపోయాడు!

(ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)

 

- నిర్జర.