మాయ చెట్టు

 

ఆ వడ్రంగికి ఆ రోజు పెద్ద బేరం తగిలింది. తన పాత ఇంటికి అవసరమయ్యే చిన్నచితకా మరమ్మత్తులను చేసిపెట్టమంటూ ఒక పెద్దాయన వడ్రింగిని పిలిపించాడు. చాలా రోజుల తరువాత మంచి పని దొరికింది కదా అనుకుని ఉత్సాహంగా బయల్దేరాడు వడ్రంగి. కానీ పని మొదలు పెట్టిన దగ్గర్నుంచీ ఏదీ అతనికి అనుకూలంగా సాగలేదు. రంపం మధ్యలోకి విరిగిపోయింది. డ్రిల్లింగ్‌ చేయబోతే ఫ్యూజులు కాస్తా ఎగిరిపోయాయి. నేల మీద పడి ఉన్న పాతమేకు ఒకటి కాల్లోకి దిగబడిపోయింది. ఇలా ఏదో ఒక అవాంతరం అడుగడుగునా ఎదురుపడుతూనే ఉంది.

 

ఒకదాని తరువాత ఒకటిగా వచ్చిన సమస్యలని చూసి వడ్రంగికి చిరాకెత్తిపోయింది. చీకటిపడే వేళకి జరగాల్సిన పనిలో మూడో వంతు కూడా పూర్తికానేలేదు. తీరా ఇంటికి వెళ్దామని బయల్దేరబోతుంటే అతని బండి కూడా మొరాయించింది. ‘‘ఈ బండిని ఇక్కడే వదిలెయ్యి! ఇవాల్టికి నేను నిన్ను మీ ఇంటి దగ్గర దింపుతానులే!’’ అన్నాడు ఆ ఇంటి యజమాని. అలా ఆ పెద్దాయనతో కలసి తన ఇంటికి వెళ్లాడు వడ్రంగి. తన ఇల్లు చేరుకోగానే ‘‘ఎలాగూ ఇక్కడిదాకా వచ్చారు. కాస్త లోపలకి వచ్చి టీ తాగి వెళ్దురు,’’ అని అభ్యర్థించాడు వడ్రంగి. వడ్రంగి మాటను కాదనలేకపోయాడు పెద్దాయన. ఇద్దరూ కలిసి ఆ ఇంటి ఆవరణలోకి అడుగుపెట్టారు.

 

వడ్రంగి ఆ ఇంటి ఆవరణలోకి అడుగుపెడుతూనే నేరుగా ఒక చిన్న మొక్క దగ్గరకి వెళ్లాడు. దాని లేత కొమ్మలను ఒకసారి తన వేళ్లతో తాకి ఇంట్లోకి అడుగుపెట్టాడు. అంతే! అప్పటివరకూ చిరాకుగా ఉన్న అతనిలో చిత్రమైన మార్పు కనిపించింది పెద్దాయనకు. మొహంలో చిరాకు స్థానాన్ని చిరునవ్వు ఆక్రమించింది. అతణ్ని చూడగానే పరుగులెత్తుకుంటూ వచ్చిన ఇద్దరు పిల్లలనూ ఒక్కసారిగా గుండెలకు హత్తుకున్నాడు. భార్యను పిలిచి యజమాని గురించి గౌరవంగా నాలుగు మాటలు చెప్పాడు. ఆమె యజమాని కోసం ఫలహారం చేయడంలో సాయపడ్డాడు.

 

ఏదో మాయ జరిగినట్లుగా వడ్రంగిలో ఒక్కసారిగా వచ్చిన మార్పు చూసి ఆశ్చర్యం వేసింది పెద్దాయనకు. అందుకే తిరిగివెళ్తూ- ‘‘నువ్వు ఈ చెట్టు దగ్గరకి వచ్చి దాన్ని ముట్టుకున్నప్పటి నుంచీ నీలో నాకు భలే మార్పు కనిపించింది. దీని వెనుక కారణం ఏమన్నా ఉందా!’’ అని అడిగాడు ఆసక్తిగా.

 

పెద్దాయన ప్రశ్నకి వడ్రంగి చిరునవ్వుతో ‘‘మరేం లేదండీ! పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్తూ తమ ఆయుధాలను ఎలాగైతే జమ్మి చెట్టు మీద ఉంచి వెళ్లారో... అలా నాకు ఉద్యోగంలో ఎదురయ్యే చిరాకులన్నింటినీ సాయంవేళకి ఈ చెట్టు మీద తగిలించేస్తాను. ఆ తరువాత ఒక ఉద్యోగిలా కాకుండా... ఒక భర్తలాగా, ఒక తండ్రిలాగా ఈ ఇంట్లోకి ప్రవేశిస్తాను. మర్నాడు ఉదయం తిరిగి పనిలోకి వెళ్లేముందు తిరిగి ఆ చిరాకులని చెట్టు మీద నుంచి తిరిగి తీసుకుంటాను. కానీ అదేం చిత్రమో కానీ, ఆ చిరాకులు ముందు రోజు సాయంత్రం ఉన్నంత భారంగా మర్నాటికి అనిపించవు,’’ అంటూ బదులిచ్చాడు.

(ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)

 

 

- నిర్జర.