ఎలా చూస్తే అలాగే!

 

అనగనగా ఓ కొండదిగువు గ్రామం. ఆ గ్రామంలోని జనమంతా కలిసిమెలసి ఉండేవారు. ఆ గ్రామం చివర కట్టెలమ్మెకునే ఒక పేదరాలు ఉంది. చాలా ఏళ్ల క్రితమే ఆమె భర్త చనిపోయాడు. ఆయన జ్ఞాపకంగా మిగిలిన ఒక్కగానొక్క కొడుకుని కడుపున పెట్టుకొని పెంచుకుంటోంది! కానీ అదేం చిత్రమో ఆ కుర్రవాడికి ఎవరన్నా సరిపడేది కాదు. తల్లి ఉదయమంతా కట్టెలు కొట్టుకుని మధ్యాహ్నానికి అలసిపోయి వచ్చేసరికి, అతని దగ్గర బోల్డన్ని ఫిర్యాదులు సిద్ధంగా ఉండేవి. ‘ఆ ఇంట్లోవారు మంచివారు కాదు, ఈ పక్కింటి పిల్లవాడు పెంకివాడు, ఆ వీధి చివరామె చాలా మొండిది...’ ఇలా రకరకాల ఆరోపణలు చేస్తూ ఉండేవాడు.

 

పిల్లవాడిని తనతో పాటుగా ఊరిలోకి తీసుకువెళ్తే, అక్కడ అతని ఫిర్యాదులు తగ్గుతాయేమో అనుకుంది తల్లి. అందుకని కట్టెలు అమ్ముకునేందుకు వెళ్తూ పిల్లవాడిని కూడా తోడు తీసుకువెళ్లడం మొదలుపెట్టింది. కానీ పిల్లవాడి తీరు మారనే లేదు. అటు పక్క దుకాణం వాళ్లు, ఇటు పక్కనుంచి దుకాణం వాళ్లు... ఆఖరికి దారిన పోయేవాళ్లు కూడా అతనికి చెడ్డవారుగానే కనిపించసాగారు.

 

పిల్లవాడి ఫిర్యాదులతో తెగ విసిగిపోయింది తల్లి. ‘వీడికి అసలు మనుషుల పొడే గిడుతున్నట్లు లేదు’ అనుకుంది. అనుకుని వాడిని తనతో పాటు కట్టెలు కొట్టేందుకు అడవికి తీసుకువెళ్లడం మొదలుపెట్టింది. కానీ అదేం చిత్రమో! ఆ పిల్లవాడు చెట్టూపుట్టల్ని కూడా వదిలేవాడు కాదు. ‘ఆ చెట్టు ఎందుకూ పనికిరానిది, ఈ చెట్టుకి ముళ్లున్నాయి...’ అంటూ తిట్టేవాడు. చివరికి తల్లి వాడి ప్రవర్తనతో విసిగిపోయింది. వాడిలో ఎలాగైనా మార్పు తీసుకురావాలంటూ ఓ ఉపాయాన్ని ఆలోచించింది.

 

మర్నాడు వాడిని పక్కనే ఉన్న కొండమీదకు తీసుకుపోయింది. ఎప్పుడూ లేనిది తల్లి, తనను అంతెత్తు ఉన్న కొండ మీదకి తీసుకువెళ్లడం చూసి పిల్లవాడికి ఆశ్చర్యం వేసింది. అక్కడ ఒక చోట పిల్లవాడిని ఆపి తల్లి- ‘‘నువ్వు గమనించావో లేదో కానీ ఈ కొండకి ఓ ప్రత్యేకత ఉంది. నువ్వు ఒక మాట అంటే దాన్ని అది తిరిగి అంటుంది. ఆ కొండని తిట్టి చూడు, అది కూడా నిన్ను తిరిగి తిడుతుంది,’’ అని చెప్పింది.

 

పిల్లవాడికి తిట్టడం అంటే మహా సరదా కదా! అందుకని తల్లి అడిగిందే తడువు, తన నోటికి వచ్చిన తిట్లన్నీ తిట్టడం మొదలుపెట్టాడు. నిజంగానే అవన్నీ ఆ కొండకోనల్లో ప్రతిధ్వనించి, పిల్లవాడికి తిరిగి వినిపించాయి. మొదట్లో పిల్లవాడికి ఏదో సరదాగా ఉందికానీ, తన తిట్లు తనకే వినిపించడం మొదలుపెట్టేసరికి... కాసేపటికి అతని మొహం సిగ్గుతో కందగడ్డలా తయారైంది.

 

‘‘ఇప్పుడు ఆ కొండకి కాస్త మంచి మాటలు చెప్పిచూడు. అవే మాటలు నీకు వినిపిస్తాయి!’’ అంది తల్లి. పిల్లవాడు నిదానంగా మాటలను కూడబలుక్కుంటూ ‘‘నువ్వు చాలా మంచివాడివి!’’ అని అరిచాడు. తిరిగి అతనికి అవే మాటలు వినిపించాయి. మరోసారి ‘‘నేను నీ స్నేహితుడిగా ఉండాలనుకుంటున్నాను!’’ అని అరిచాడు. అవే మాటలు అతనికి యథాతథంగా వినిపించాయి.

 

తల్లి, పిల్లవాడి తల మీద చేయి వేసి- ‘‘ప్రపంచం కూడా ఇంతేరా! అందులో మంచీచెడూ రెండూ ఉంటాయి. నువ్వు దేన్ని చూడాలనుకుంటే దాన్ని చూడగలుగుతావు. మనుషులలో ఉన్న చెడు ఎలాగూ బయటపడక తప్పదు. ఇక వెతికి మరీ నువ్వు వారిలో లోపాలను కనిపెట్టడం ఎందుకు. అందుకు బదులుగా వారిలో మంచి లక్షణాలను గమనించవచ్చు కదా! ముందుగానే వారితో శతృత్వాన్ని పెంచుకునే బదులు, మిత్రుడిగా వారి మనసుని గెలుచుకునే ప్రయత్నం చేయవచ్చు కదా!’’ అని చెప్పింది తల్లి. తల్లి మాటలతో పిల్లవాడికి ఏదో కొత్త విషయం బోధపడినట్లు అయ్యింది.

(ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)

 

..Nirjara