మన చేతలకు ఫలితం!

 

అనగనగా ఓ రాజు! అతను ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకునే కరుణామయుడు కాదు. పరమ కర్కోటకుడు! ఈ రాజు పీడ ఎప్పుడు ఎలా విరగడ అవుతుందా అని జనమంతా తెగ ప్రార్థనలు చేసేవారు. కానీ ఏ ఒక్క ప్రార్థనకీ ఫలితం దక్కలేదు. ఇంతలో రాజు తన సమావేశ మందిరానికి మంత్రులందరినీ పిలిపించుకున్నాడు. హఠాత్తుగా ఈ సమావేశం ఎందుకా అనుకుంటూ మంత్రులంతా బిక్కుబిక్కుమంటూ మందిరానికి చేరుకున్నారు. ఆశ్చర్యం! రాజుగారి మొహం ఆవేళ ఎంతో ప్రసన్నంగా ఉంది. ఎప్పుడూ లేనిది కాస్త దయ కూడా కనిపిస్తోంది. ‘‘నేను ఇక మీదట నా ప్రవర్తనను మార్చుకోవాలనుకుంటున్నాను. ఇక నుంచి నా ప్రజలందరి పట్లా దయతో మెలగాలనుకుంటున్నాను,’’ అన్నారు రాజుగారు చిరునవ్వుతో!

 

ఆ మాటలు విన్న మంత్రుల మతులు పోయాయి. తామ విన్న మాటలను నమ్మలేకపోయారు. ‘రాజు తమతో పరాచికాలు ఆడటం లేదు కదా!’ అనుకున్నారు. వాళ్ల మొహాలు చూసిన రాజుగారు ఇలా చెప్పుకొచ్చారు... ‘‘నిన్న ఉదయం నేను ఒక్కడినే మారువేషంలో వేటకి బయల్దేరాను. ఎప్పటిలాగే వేట సంతోషంగా, సవ్యంగా సాగిపోతోంది. అలాంటి సమయంలో ఒక కుక్క, కుందేలుని తరమడం గమనించాను. అది కుందేలుని పట్టుకుంటుందా లేదా అని ఆసక్తిగా వాటిని వెంబడించాను. కుక్క, ఆ కుందేలుని అందుకునే లోపల అది ఒక బొరియలోకి దూరిపోయింది. కానీ అది లోపలికి జారుకునే లోపలే దాన్ని వెంటాడుతున్న కుక్క, కుందేలు కాలుని కొరికిపారేసింది.

 

‘‘అయ్యో ఇక కుందేలు తన జీవితంలో మళ్లీ సరిగా పరిగెత్తలేదు కదా!’’ అనుకుంటూ అడవిలో కాస్త ముందుకు సాగాను. ఇంతలో ఎక్కడి నుంచో అరుపులు వినిపించాయి. అటుగా వెళ్లి చూద్దును కదా! ఎవరో ఒకాయన తన గుర్రం మీద కూర్చుని అడవిగుండా పోతున్నాడు. అతడి గుర్రాన్ని చూసి ఈ కుక్క అరుస్తోంది. ఇందాక కుందేలు వెంటపడిన కుక్కే ఇది. కానీ ఈసారి దానికి మూడినట్లుంది. గుర్రం మీద ఉన్నతను సామాన్యుడిలా లేడు. తన విల్లంబులోకి ఒక బాణాన్ని తీసి, సరాసరి ఆ కుక్క కాలికి ఎక్కుపెట్టి వదిలాడు. బాణం నేరుగా కుక్క కాలిని చీల్చుకుంటూ వెళ్లిపోయింది. ‘’కథ ఇక్కడితో ముగిసిపోలేదు! కుక్క అరుపులకి భయపడిన గుర్రం అడ్డదిడ్డంగా బెదిరిపోయి గంతులేయడం మొదలుపెట్టింది. ఆ అదురుకి దాని రౌతు కిందపడ్డాడు. గుర్రపు తాపులకి అతని మోచిప్ప పగిలిపోయింది. ఇక అతణ్ని విడిపించుకుని అడ్డదిడ్డంగా పరుగులెత్తడం మొదలుపెట్టింది గుర్రం. అలా ఓ పది అడుగులు వేసిన ఆ గుర్రమూ ఓచోట కాలు ఇరుక్కుపోయి బొక్కబోర్లా పడిపోయింది.

 

‘‘మన పెద్దలు కర్మ సిద్ధాంతం అనే మాటను తరచూ అంటం నేను వినేవాడిని. ఎదుటివాడికి మనం ఏం చేస్తామో అదే మనకు తిరిగి వస్తుందని వారు చెప్పేవారు. నాకు ఆ సిద్ధాంతం మీద పెద్దగా నమ్మకం లేదు. కానీ ఏం జరిగితే మనకు బాధ కలుగుతుందో, దానిని ఇతరులకు చేయకూడదని మాత్రం అర్థమైంది. కుందేలు, కుక్క, గుర్రం జంతువుల కాబట్టి వాటికి ఈ నీతి వర్తించకపోవచ్చు. కానీ మనిషికి మంచిచెడుల విచక్షణ ఉంటుంది కాబట్టి అతను మాత్రం తన ప్రవర్తన విషయంలో ఒళ్లు దగ్గరపెట్టుకుని ఉండాలని తెలిసివచ్చింది,’’ అంటూ ముగించాడు రాజు. రాజుగారి మాటలు విన్న మంత్రులంతా ఊపిరిపీల్చుకున్నారు. ప్రకృతే తమ రాజుకి బుద్ధి చెప్పిందనుకుని పండుగ చేసుకున్నారు.

 

(ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)

 

- నిర్జర.