ఆలోచన మీద అదుపు లేకపోతే

అనగనగా ఇద్దరు స్నేహితులు. చిన్నప్పటి నుంచీ కలిసి పెరిగారు, కలిసి చదువుకున్నారు. ఒకరు తన పొలాని చూసుకుంటూ ఊరిలో జీవనాన్ని సాగిస్తుంటే, వేరొకరు రాజధానిలో ఉద్యోగాన్ని పొందారు. రాజధానిలో ఉన్న ఉద్యోగి ఓసారి తన స్నేహితుడి ఇంటికి వచ్చాడు. రాకరాక వచ్చిన నేస్తాన్ని చూసి అతనికి సకల మర్యాదలూ చేశాడు పల్లెటూరి మిత్రుడు. పల్లెటూరి స్నేహితుడు మహా ఉదారమైన మనిషి. ‘చూడూ! నా దగ్గర రెండు గుర్రాలు ఉన్నాయి. నాకేమో ఒక్క గుర్రం చాలయ్యే! నీకు ఉద్యోగరీత్యా తెగ తిరగాల్సిన అవసరం ఉంటుంది కదా! హాయిగా నా రెండో గుర్రాన్ని తీసుకుని వెళ్లి వాడుకో,’ అన్నాడు.

 

పల్లెటూరి నేస్తం పెద్ద మనసు చూసి రాజధాని నేస్తం గుండె నిండిపోయింది. వందలసార్లు కృతజ్ఞతలు చెబుతూ ఆ గుర్రాన్ని బహుమతిగా అందుకున్నాడు. ఇలా ఓ పది రోజులు గడిచాయో లేదో... రాజధాని నేస్తం మళ్లీ పల్లెటూరికి తిరిగివచ్చాడు. ‘నేస్తం ఎలా ఉన్నావు. నువ్వు మళ్లీ రావడం సంతోషంగా ఉంది. ఏదన్నా పని మీద వచ్చావా లేకపోతే నన్ను చూసిపోదామని వచ్చావా?’ అని అడిగాడు పల్లెటూరి నేస్తం.

 

‘నిన్ను చూసి నాకు కూడా సంతోషంగా ఉంది. కాకపోతే నేను అనుకోకుండా ఇక్కడికి రావల్సి వచ్చింది. నువ్వు నాకిచ్చిన గుర్రం ఉంది చూశావూ? అది మా గొప్పగా నాకు సాయపడుతోంది. కానీ నిన్న రాత్రి దాన్ని ఎక్కగానే, దానికి ఏం బుద్ధి పుట్టిందో ఏమో! ఎంత వారిస్తున్నా వినకుండా మీ ఊరి వైపుకి దూసుకువచ్చేసింది,’ అని వాపోయాడు రాజధాని మిత్రడు. ‘చిన్నప్పటి నుంచీ పుట్టి పెరిగిన ఊరు కదా! అందుకనే దాని మనసు ఇటు మళ్లి ఉంటుంది. ఎలాగూ వచ్చారు కదా! ఓ రెండు రోజులు ఉండి వెళ్లండి,’ అంటూ మరోసారి తన చిన్ననాటి మిత్రునికి ఆతిథ్యాన్ని అందించాడు పల్లెటూరి నేస్తం.

 

ఇది జరిగి ఓ పదిరోజులు గడిచాయి. పది రోజుల తర్వాత మళ్లీ గుర్రంతో ప్రత్యక్షం అయ్యాడు రాజధాని మిత్రడు. ‘రావోయ్‌ నేస్తం! నీ గుర్రం గాలి మళ్లీ ఇటువైపు మళ్లిందా ఏమిటి?’ అని అడిగాడు పల్లెటూరి స్నేహితుడు. ‘అవును ఇవాళ ఉదయం దీన్ని ఎక్కి కూర్చున్నానా! ఎంత ప్రయత్నించినా ఆగకుండా పరుగుపరుగున మీ ఊరి వైపుగా దూసుకువచ్చింది,’ అని బిక్కమొగంతో చెప్పాడు రాజధాని ఉద్యోగి.

 

‘మరేం ఫర్వాలేదు! ఓ రెండు రోజులు నా ఆతిథ్యం స్వీకరించి వెళ్లండి,’ అంటూ ఆహ్వానించాడు పల్లెటూరి నేస్తం. అది మొదలు ప్రతి పది రోజులకి ఓసారి ఆ గుర్రం యజమానితో సహా తను పుట్టిపెరిగిన పల్లెటూరికి చేరుకోవడం మొదలుపెట్టింది. పల్లెటూరి నేస్తం చిరునవ్వు చెదరకుండా తన రాజధాని మిత్రుడికి ఆతిథ్యం ఇవ్వసాగాడు. ఇలా కొన్నిసార్లు జరిగిన తర్వాత ‘చూడు నేస్తం. నీ మనసు ఎంత ఉదారమైందో నాకు తెలియంది కాదు. కానీ ఇలా మాటిమాటికీ నీ ఇంటికి వచ్చి నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. పైగా అకస్మాత్తుగా ఇలా రెండేసి రోజులు మాయమైపోవడం వల్ల నా ఉద్యోగానికే ఎసరు వచ్చే ప్రమాదం ఉంది. దీనికేమన్నా ఉపాయం చూడు,’ అని ప్రాథేయపడ్డాడు రాజధాని ఉద్యోగి.

 

పల్లెటూరి నేస్తం కాసేపు ఆలోచించి ‘ఈసారి నువ్వు ఓ నెలరోజుల పాటు నా దగ్గరే ఉండు. ఈ నెల రోజుల్లోనూ గుర్రం మీద పూర్తిగా పట్టు సాధించేందుకు అవసరమయ్యే మెలకువలన్నీ నేర్పుతాను. గుర్రం పూర్తిగా నీ చెప్పుచేతల్లోకి వచ్చేలా తగిన శిక్షణ ఇస్తాను,’ అని చెప్పాడు. అన్నట్లుగానే ఆ నెల రోజుల్లోనూ గుర్రం పూర్తిగా రాజధాని మిత్రుని మాట వినేలా తీర్చిదిద్దాడు. ఆ తర్వాత ఎప్పుడూ కూడా ఆ గుర్రం తిరిగి పల్లెటూరి వైపు పరుగులెత్తలేదు.

 

మన జీవితం కూడా ఆ గుర్రం లాంటిదే! దాని మీద అదుపులేకపోతే తనకి కావల్సిన చోటుకి బలవంతంగా లాక్కుపోతుంది. బలహీనతల్లోకి జారిపోతుంది. వ్యసనాల వైపుగా ఈడ్చుకుపోతుంది. మన దారికి వచ్చిందిలే అనుకునేలోగా చేజారిపోతుంటుంది. అలా కాకుండా దాని మీద పూర్తిగా అదుపు తెచ్చుకున్న రోజున మన చెప్పుచేతల్లోనే ఉండిపోతుంది. దేవుడు మనిషికి ఆలోచన అనే బహుమతిని ఇచ్చాడు. ఆ బహుమతి మీద అదుపు లేకపోతే... దారి తప్పిన గుర్రంలా మారిపోతుంది. అదుపు సాధిస్తే అద్భుతాలకి దారి చూపిస్తుంది.

(ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)

- నిర్జర.