పనికిమాలిన విషయాలు

అనగనగా ఓ బద్ధకిష్టి. బారెడు పొద్దెక్కాక లేవడం, తినడం, తిరగడం, రాత్రివేళకి పడుకోవడం.... ఇదే అతని దినచర్యగా ఉండేది. ఎప్పటిలాగే ఓ రోజు ఆ బద్ధకిష్టి సుష్టుగా తినేసి, అలా చల్లగాలికని చెరువుగట్టుకి చేరుకున్నాడు. ఆ చెరువుగట్టు మీద ఊసుపోక అటూఇటూ తిరగడం మొదలుపెట్టాడు. ఇంతలో అతనికి ఓ కపాలం కనిపించింది. దానిని చూసిన బద్ధకిష్టికి ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. దాని పక్కనే కూర్చుని నిశితంగా పరిశీలించడం మొదలుపెట్టాడు. ఆ కపాలం తనని చూసి నవ్వినట్లు తోచింది. ‘ఎవరు నువ్వు? నీకు ఈ గతి ఎలా పట్టింది?’ అని అడిగాడు బద్ధకిష్టి.

 

‘జీవితాన్ని వృధా చేసుకుంటూ, పనికిమాలిన విషయాలను పట్టించుకోవడం వల్లే ఈ స్థితికి చేరుకున్నాను,’ అంది ఆ కపాలం. ఆ మాటలు విన్న బద్ధకిష్టికి ఎక్కడలేని ఆశ్చర్యం వేసింది. కపాలం మాట్లాడటం ఏమిటి? అందులోనూ తన పరిస్థితికి కారణం ఏమిటో చెప్పడం ఏమిటి? అనుకున్నాడు. వెంటనే ఈ విషయాన్ని ఎవరితోనన్నా పంచుకోవాలని అనిపించింది. కానీ ఎవరితో పంచుకుంటే బాగుంటుంది! అని తెగ ఆలోచించాడు. చివరికి ఏకంగా రాజుగారి దగ్గరకు వెళ్లే తను చూసిన విషయాన్ని చెప్పాలని నిశ్చయించుకున్నాడు. ఇంత చిత్రమైన విషయం అంతటి ప్రభువు దగ్గరకు చేరాల్సిందే అని బయల్దేరాడు.

 

అలా బద్ధకిష్టి రాజుగారి దగ్గరకు బయల్దేరాడు. ఓ రెండు రోజులు కాలినడకన రాజధానికి చేరుకుని, రాజదర్బారులోకి ప్రవేశించాడు. అక్కడ నిండు సభలో ఉన్న రాజుగారిని చూస్తూ తను మోసుకొచ్చిన వార్తని వినిపించాడు. ‘కపాలం ఏమిటి? మాట్లాడటం ఏమిటి? నీకుగానీ మతిపోయిందా!’ అని అడిగారు రాజుగారు. ‘లేదు ప్రభూ! కావాలంటే మీరే వచ్చి స్వయంగా చూడండి!’ అంటూ రెట్టించాడు బద్ధకిష్టి. బద్ధకిష్టి అంత గట్టిగా చెప్పడంతో రాజుగారిలో కూడా ఎక్కడలేని ఆసక్తి బయల్దేరింది. ఎక్కడో కథల్లో తప్ప తను కపాలం మాట్లాడటం గురించి విననే లేదయ్యే! అందుకే మందీమార్బలాన్ని వెంటతీసుకుని బద్ధకిష్టి వెంట బయల్దేరాడు. ఓ పూటంతా ప్రయాణించి వారు కపాలం ఉన్న చెరువుగట్టుకి చేరుకున్నారు.

 

ఆ కపాలం ఇంకా అక్కడే ఉంది. చిరునవ్వు నవ్వుతున్నట్లే ఉంది. ‘నేను ఈ దేశపు రాజుగారిని తీసుకువచ్చాను. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావో ఈయనతో ఓసారి చెప్పు,’ అని అడిగాడు బద్ధకిష్టి. దానికి ఆ కపాలం నుంచి ఎలాంటి జవాబూ రాలేదు. మరోసారి, ఇంకోసారి.... అలా పదేపదే ఆ కపాలాన్ని ప్రశ్నించినా కూడా అది నిమ్మకుండిపోయింది. కపాలం మాట్లాడకపోయేసరికి, రాజుగారికి పట్టరాని ఆవేశం వచ్చింది. తమని నవ్వులపాలు చేయడానికే బద్ధకిష్టి ఈ పన్నాగం పన్నాడని ఆయన అనుకున్నారు. వెంటనే ‘వీడి శిరస్సుని ఖండించి ఆ కపాలం పక్కనే పడేయండి,’ అని ఆజ్ఞాపించి తన దారిన తాను చక్కా వెళ్లిపోయారు.

 

రాజుగారి ఆజ్ఞని భటులు నెరవేర్చారు. ఆ కపాలం పక్కనే బద్ధకిష్టి శిరస్సుని కూడా పడేసి వెళ్లిపోయారు. అంతా సద్దుమణిగిన తరువాత, అప్పుడు మాట్లాడింది కపాలం. ‘నా సంగతి సరే! ఇప్పుడు నీ సంగతి చెప్పు. నీకు ఈ గతి ఎలా పట్టింది?’ అంటూ బద్ధకిష్టి శిరస్సుని అడిగింది. దానికి బద్ధకిష్టి శిరస్సు ‘ఏముంది! జీవితాన్ని వృధా చేసుకుంటూ, పనికిమాలిన విషయాలను పట్టించుకోవడం వల్లే ఈ స్థితికి చేరుకున్నాను,’ అంటూ నిట్టూర్చింది.

 

(ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)

- నిర్జర.