సలామ్ హలీమ్! (సండే స్పెషల్)

ప్రేమకి కులం, మతం ఉండవంటారు. ప్రేమకే కాదు... ఫుడ్ కీ కూడా ఉండదు అని ఓ వంటకం నిరూపించింది. ఒక మతానికి చెందిన పవిత్ర ఆహారమైనా... ప్రతి మతం వారికీ ప్రీతిపాత్రమయ్యింది. ప్రపంచమంతటా తన పేరు మారుమోగేలా చేసుకుని ఏ ఆహారమూ సంపాదించనంత కీర్తిని మూటగట్టుకోవడం దానికే చెల్లింది. ఇంతకీ ఏమిటది? ఇంకా చెప్పాలా... అర్థమైపోలేదూ... హలీమ్. అవును. ఇది వంటకాలకే రారాజు. రుచుల్లో మహారాజు. 

 

రంజాన్ మాసం వస్తోందంటే ముసల్మానులంతా ఉపవాసాలకు సిద్ధమవుతూ ఉంటారు. అయితే మిగతావారంతా హలీమ్ తినడానికి సిద్ధపడుతూ ఉంటారు. దుకాణాలు తెరిచీ తెరవగానే వాటి ముందు క్యూ కడుతుంటారు. లొట్టలేసుకుంటూ హలీమ్ ని లాగించేస్తుంటారు. ఏమిటంత ప్రీతి? ఓ వంటాన్ని తినడం కోసం ఎందుకింత ఆరాటం? హలీమ్ మాత్రమే ఎందుకింత ప్రత్యేకం? అసలు ఏమిటి హలీమ్ ప్రస్థానం? తెలుసుకుందాం రండి.

 

అలా వచ్చింది...
మహబూబ్ అలీఖాన్... ఆరవ నిజాం నవాబు. ఒకసారి ఈయన తన రాజ్యంలోని రక్షణ వ్యవస్థను బలోపేతం చేయాలని తలపెట్టాడు. దానికోసం ఓ కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సమావేశానికి పర్షియా నుంచి కొందరు ప్రముఖులు వచ్చారు. అది రంజాన్ మాసం కావడంతో వాళ్లంతా ఉపవాస దీక్షలు చేస్తున్నారు. ఆ దీక్షను విరమించడానికి తాము ఎప్పుడూ తినే వంటకం ఉంటే బాగుంటుందని అభిప్రాయ పడ్డారు.  అది మనకు పరిచయం లేదు. దాంతో నవాబు వంటవాళ్లను పిలిచి, ఆ వంటకం ఎలా చేయాలో పర్షియన్ అతిథులతో వాళ్లకి చెప్పించాడు. వెంటనే ఆ వంటకం సిద్ధమైంది. దాని సువాసన అందరి ముక్కు పుటాలనూ అదరగొట్టింది. అదే హలీమ్. మొట్టమొదటి సారిగా ఆరోజు మన దేశంలో అడుగు పెట్టిన హలీమ్... ఆపైన మన దేశాన్ని వదిలిపెట్టి వెళ్లలేదు. 
    

తయారీయే ప్రత్యేకం...
హలీమ్ గొప్పదనమంతా దాన్ని వండటంలోనే ఉంటుంది. గోధుమరవ్వను నాలుగ్గంటలు నీటిలో నానబెడతారు. తర్వాత నీటిని ఒంపేసి మాంసం, కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, మసాలాలతో కలిపి పన్నెండు గంటల పాటు ఉడకబెడతారు. తర్వాత దాన్ని మెత్తని పేస్ట్ లా అయ్యేవరకూ కర్రలతో కలియబెడతారు. ఇలా చేయడాన్ని గోటా కొట్టడం అంటారు. గోటా కొట్టిన తరువాతే హలీమ్ ఘుమఘుమలు మొదలవుతాయి. ఆపైన ఉల్లిపాయ ముక్కలు, బాదం పప్పు, జీడిపప్పు తదితర డ్రై ఫ్రూట్స్ ని నేతిలో వేయించి హలీంలో కలుపుతారు. తినేముందు కొత్తిమీర, పుదీనా, నిమ్మరసం చల్లి ఇస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చల్లారకుండా బట్టీల్లో వేడి మీదే ఉంచుతారు. అందుకే ఎప్పుడు హలీమ్ తిన్నా వేడిగానే ఉంటుంది. ఇంత ప్రత్యేకంగా తయారు చేయబట్టే హలీమ్ అన్నింట్లోకీ ప్రత్యేకంగా నిలిచింది. 

 

పోషకాలకు లోటు లేదు...
అసలు రంజాన్ మాసంలో హలీమ్ ఎందుకు తింటారు? ఎందుకంటే రోజంతా చేసే ఉపవాసం వల్ల నీరసం రాకుండా చేస్తుంది హలీమ్. దానిలో నిండుగా ఉండే పోషకాలు అదనపు శక్తినిచ్చి నెల రోజుల పాటు ఉపవాస దీక్ష చేయగలిగేలా చేస్తుంది. పప్పుధాన్యాలు, నెయ్యి, తాజా మాంసం, డ్రై ఫ్రూట్స్ వంటివి ఎంతో బలవర్ధకం. అందుకే హలీమ్ రంజాన్ మాసపు ప్రత్యేక ఆహారమయ్యింది. మటన్, చికెన్ లతో పాటు వెజిటేరియన్స్ కోసం వెజ్ హలీమ్ కూడా దొరుకుతుంది. మటన్ తో చేసేదాన్ని హలీమ్ అనీ, చికెన్ తో చేసేదాన్ని హరీస్ అనీ అంటారు. పేరు ఏదైనా... పదార్థాలు ఏవైనా... వెజ్ అయినా నాన్ వెజ్ అయినా... దాని రుచి దేనికీ కాదు. 

 

కాసులు కురిపిస్తోంది...
రుచుల్ని అందించడమే కాదు... కాసుల్ని కూడా కురిపిస్తోంది హలీమ్. అది కూడా కోట్లలో. యేటా ఒక్క హైదరాబాద్ లోనే వంద కోట్లకు పైగా బిజినెస్ జరుగుతోందంటే దీని డిమాండ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. భాగ్యనగరంలో ఆరు వేలకు పైగా హలీమ్ సెంటర్లు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఆన్ లైన్ బుకింగ్ కూడా మొదలవ్వడంతో బిజినెస్ అంతకంతకూ పెరిగిపోతోంది. ఎంతోమందికి జీవనాధారం కూడా కల్పిస్తోంది.

 


 

వాస్తవానికి వేరే దేశం నుంచి హలీమ్ హైదరాబాద్ కి వచ్చింది. కానీ ఇప్పుడు హలీమ్ కి హైదరాబాదే కేరాఫ్ అడ్రస్ అయిపోయింది. మన దేశంలోని చెన్నై, కోల్ కతా, బెంగళూర్ వంటి సిటీలతో పాటు పాకిస్థాన్, బంగ్లాదేశ్, చైనా, అమెరికా, మలేషియా, సింగపూర్, సౌదీ తదితర దేశాలకు కూడా హైదరాబాద్ నుంచే హలీమ్ సరఫరా అవుతోంది. అయితే ఇటీవలి కాలంలో విజయవాడ, రాజమండ్రి, గుంటూరు లాంటి ప్రాంతాల్లో కూడా హలీమ్ లభిస్తోన్నా హైదరాబాద్ హలీమ్ రుచి దేనికీ లేదంటున్నారు అభిమానులు. అంతగా హైదరాబాద్ హలీమ్ రుచి అందరినీ కట్టి పడేసింది. పావుకిలో రూ. 100 నుంచి రూ. 150 వరకూ ఉంటుంది. అరకిలో 250 నుంచి 300 రూపాయల వరకూ, కిలో 450 నుంచి 500 వరలకూ ఉంటోంది. 
  

రేటు ఎంతయినా సరే... తిని తీరాల్సిందేనంటారు హలీమ్ ప్రియులు. అవును మరి... హలీమ్ కి వెలకట్టగలమా! తిన్న తర్వాత కొన్ని గంటల వరకూ నోటిని వదిలిపెట్టని ఆ రుచి కోసం ఎంతయినా ఖర్చుపెట్టొచ్చు. వంద భోజనాల వల్ల కలిగే శక్తిని ఒక్క కప్పుతో కలిగించే దాని ఘనతకి ఎన్ని వందలైనా వెచ్చించొచ్చు. తిరుగు లేని హలీమ్ కి ఎన్ని సలామ్ లైనా కొట్టొచ్చు. సలామ్ హలీమ్!

 

-Sameera N