ఇంటర్వ్యూలో విజయం కోసం

 

ఎంత ప్రతిభ ఉన్నా ఒకోసారి చిన్నపాటి లోపాలతో ముందుకు వెళ్లలేకపోతుంటాం. మెదడులో బోల్డంత జ్ఞానం, నరనరాన తెలివితేటలున్నా చిన్నపాటి ఉద్యోగమో, ఆ ఉద్యోగంలో పదోన్నతో సంపాదించలేకపోతుంటాం. అర్హత ఉంది కదా! కావల్సిన ఉద్యోగం కాళ్ల దగ్గరకి వస్తుందనే రోజులు పోయాయి. ఇంటర్వ్యూకి వెళ్లినప్పుడు కొన్ని చిట్కాలను దృష్టిలో ఉంచుకోక తప్పని కాలం ఇది. వాటిలో కొన్ని ఇవిగో...

 

 

సంస్థ గురించి అవగాహన

ఇంటర్వ్యూకి వెళ్లే సంస్థ చరిత్ర ఏమిటి? దాని అవసరాలు ఏమిటి? సంస్థ పయనం ఎలా ఉంది? లాంటి విషయాల మీద కొంత అధ్యయనం అవసరం. అందుకోసం సంస్థకి సంబంధించిన వెబ్‌సైట్‌ని ఓసారి పరిశీలిస్తే సరిపోతుంది. సంస్థ గురించి ఒక అవగాహన ఉన్న వ్యక్తులను తీసుకునేందుకు అధికారులు ఇష్టపడతారు. ఇంటర్వ్యూలో సంస్థకు సంబంధించిన ప్రశ్న ఎదురైనప్పుడు బిక్కమొగం వేయాల్సిన పరిస్థితి రాదు.

 

 

ఆత్మవిశ్వాసం

ఇంటర్వ్యూ గదిలోకి అడుగుపెట్టగానే కాళ్లు వణకడం ఖాయం. కానీ మొహంలో చిరునవ్వుని మాత్రం మర్చిపోకూడదు. జీవితంలో ఒక అవకాశం పోతే మరో అవకాశం రావచ్చు... కానీ భయపడితే చేతికందే అవకాశాలు చేజారిపోవడం తప్ప ఫలితం ఉండదు. అందుకే ధైర్యాన్ని కూడగట్టుకొని, ఆత్మవిశ్వాసంతో మెలగాలి. ఆత్మవిశ్వాసం ఉన్న మనిషిని ఏ సంస్థా కూడా వదులుకొనేందుకు ఇష్టపడదు.

 

 

బాడీ లాంగ్వేజ్

ఇంటర్వ్యూల మీద మన శరీరభాష చాలా ప్రభావం చూపుతుంది. ఎదురుగా వ్యక్తుల కళ్లలోకి చూడకుండా తప్పుకోవడం, చేతులు కట్టుకుని కూర్చోవడం, సీట్లో కూర్చుని ఊగడం, గోళ్లు కొరుక్కోవడం, వంగిపోయి నడవడం... లాంటి సూచనలు అధికారులలో ఏమంత సానుకూల అభిప్రాయాన్ని కలిగించవు.

 

మనల్నే ఎందుకు తీసుకోవాలి

సంస్థకి ఇంటర్వ్యూకి వెళ్లున్నాం సరే! వాళ్లు మనల్నే ఎందుకు ఆ ఉద్యోగానికి ఎన్నుకోవాలి! అన్న విషయం మీద కొంత ఆలోచించడం మంచిది. సంస్థకు మీరెలా ఉపయోగపడగలరు. మీ వల్ల సంస్థకు కలిగే అదనపు లాభం ఏముంటుంది. ఇతరులకంటే మీరు భిన్నంగా ఎలా సంస్థ ఎదుగుదలకి తోడ్పడగలరు... లాంటి విషయాల మీద ఒక అవగాహనకు రావడం వల్ల ఇంటర్వ్యూని ఎదుర్కొనే తీరే మారిపోతుంది. అలాంటి విశ్వాసంతో తెలియకుండానే అధికారులను ఇంప్రెస్‌ చేయగలుగుతాము.

 

వస్త్రధారణ

విడిగా ఎలా ఉన్నా ఇంటర్వ్యూ రోజునన్నా కాస్త శుభ్రమైన దుస్తులు వేసుకుని వెళ్లి తీరాల్సిందే! రాముడు మంచి బాలుడులాగా చక్కగా తల దువ్వుకొని, గడ్డం చేసుకుని తీరాల్సిందే. వీలైనంత వరకూ టీషర్టులు వేసుకుని వెళ్లకపోవడం మంచిది. సంస్థని బట్టి టక్‌ చేసుకోవడం, షూస్‌ వేసుకోవడం, టై పెట్టుకోవడం కూడా ఆ రోజుకి తప్పనిసరి కావచ్చు. అలాగని దస్తులు మరీ ఆర్భాటంగా ఉన్నా అవతలివారికీ, మనకీ కూడా అవి అసౌకర్యాన్ని కలిగిస్తాయి.

 

ముఖ్యమైన ప్రశ్నలు

ఇంటర్వ్యూలో ఎలాంటి ప్రశ్నలు రావచ్చు అనేదాని మీద కొంత కసరత్తు అవసరం. మీ గురించి చెప్పండి? లాంటి సాధారణ ప్రశ్నల దగ్గర్నుంచీ... ఇన్నాళ్లూ ఖాళీగా ఎందుకున్నారు? లాంటి ఇబ్బందికరమైన ప్రశ్నల వరకూ ఎలాంటి ప్రశ్నకైనా బదులిచ్చేందుకు సిద్ధంగా ఉండాలి. అలాగని జవాబులని బట్టీపట్టమని కాదుగానీ, ఏ ప్రశ్ననైనా నిబ్బరంగా, నిజాయితీగా ఎదుర్కునేందుకు సమాయత్తం కావాలి.

 

ప్రవేశం, నిష్క్రమణ

ఇంటర్వ్యూ గదిలోకి ప్రవేశించగానే అధికారులను చిరునవ్వుతో పలకరిడంతో మన మీద తొలి అభిప్రాయం ఏర్పడిపోతుంది. ఇక చాలామంది ఇంటర్వ్యూ ముగిసింది కదా అన్న సంబరంలో హడావుడిగా వెళ్లిపోతూ ఉంటారు. అధికారులకు థాంక్స్‌ చెప్పడం, వారి దగ్గర నుంచి సెలవు తీసుకోవడం కూడా మర్చిపోతుంటారు. ఇంటర్వ్యూ గది బయటకి అడుగు పెడితే కానీ తతంగం ముగిసినట్లు కాదన్న విషయం గుర్తుంచుకోవాలి.

 

 

- నిర్జర.