వీరికి హెచ్.ఐ.వి ఉంది. కానీ...


తెలియక చేసిన పొరపాటు కావచ్చు, అనుకోకుండా దక్కిన శాపం కావచ్చు... హెచ్‌.ఐ.వి ఎవరి జీవితంలోకి అయినా ప్రవేశించవచ్చు. అయితే ఆ వైరస్‌ ప్రవేశించడంతోనే జీవితం అంతం కాదనీ, ఇక మృత్యువే ఏకైక మార్గం కాదనీ గ్రహించి తీరడం అవసరం. హెచ్‌.ఐ.వికి మందు లేకపోవచ్చు. కానీ హెచ్‌.ఐ.వి పాజిటివ్‌ మనుషులు కూడా ఇతరులలాగానే బిడ్డల్ని కనేందుకు, సుదీర్ఘకాలం జీవించేందుకు తగిన చికిత్సలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అందుకే హెచ్‌.ఐ.వి పాజిటివ్‌ ఉన్నవారు తమలోని రోగనిరోధక శక్తి క్షీణించకుండా గమనించుకోవడం ఎంత అవసరమో, ఆత్మవిశ్వాసం సడలకుండా చూసుకోవడమూ అంతే అవసరం! మహా మహా సెలబ్రెటీలు సైతం హెచ్.ఐ.వితో జీవిస్తున్నారని తెలిస్తే... సామాన్యులలో కూడా ఆశకి రెక్కలు రావడం ఖాయం.

 

ఛార్లెస్ షీన్‌

 

హాలీవుడ్‌కి చెందిన ప్రసిద్ధ నటులలో ఛార్లెస్‌ షీన్‌ ఒకరు. Wall Street, Two and a Half Men, The Three Musketeers వంటి చిత్రాలతో పాటుగా అనేక టెలివిజన్ సిరీస్‌ ద్వారా షీన్‌ ప్రపంచవ్యాప్తంగా అందరికీ పరిచయమే! అలాంటిది గత ఏడాది తనకు హెచ్.ఐ.వి ఉందని బహిరంగంగా ఒప్పుకోవడం ద్వారా షీన్‌ వార్తల్లోకి ఎక్కాడు. తాను నాలుగు సంవత్సరాలుగా హెచ్.ఐ.వితో బాధపడుతున్నాననీ, ఇప్పుడు దానిని బహిరంగంగా ఒప్పుకోవడంతో తన మనసులోని బాధ తీరిపోయిందనీ షీన్‌ చెప్పుకొచ్చాడు. ఇతరులు కూడా తాము హెచ్.ఐ.వి పాజిటివ్‌ అన్న విషయాన్ని నిర్మొహమాటంగా ఒప్పుకోవాలని పిలుపునిచ్చాడు.

 

మేజిక్‌ జాన్సన్‌

 

బాస్కెట్‌బాల్‌ చరిత్రలోనే మేజిక్‌ జాన్సన్‌ది ఒక ప్రత్యేక అధ్యాయం. 12 సార్లు NBA విజేతగా, ఒలంపిక్‌లో స్వర్ణ పతకాన్ని సైతం సాధించిన ప్రతిభావంతునిగా జాన్సన్‌ క్రీడాలోకానికి పరిచయం. అయితే 15 ఏళ్ల క్రితమే జాన్సన్‌ తనకు హెచ్.ఐ.వి సోకిందన్న విషయాన్ని ప్రపంచానికి వెల్లడించాడు. వెల్లడించడమే కాదు, హెచ్.ఐ.వి గురించి ప్రజలలో అవగాహన కలిగేలా విస్తృతంగా ప్రచారం చేస్తున్నాడు. Magic Johnson Foundation పేరుతో హెచ్.ఐ.వి మీద ఒక యుద్ధాన్నే చేస్తున్నాడు. మరోపక్క దాంపత్య జీవితాన్ని అనుభవిస్తూ ఒక ఆరోగ్యవంతమైన బిడ్డకి కూడా జన్మనిచ్చాడు.

 

జెర్రీ హెర్మన్‌

 

హెచ్.ఐ.వి సోకిన వ్యక్తులు ఎక్కువ రోజులు బతకరు అనే అపోహ ఒకటి ఉంది. దీనిని పటాపంచలు చేయాలంటే హెర్మన్‌ గురించి చెప్పుకోవాల్సిందే. అమెరికాలో అటు నాటకాలకీ, ఇటు సినిమాలకీ ఎడాపెడా సంగీతాన్ని సమకూర్చడంతో హెర్మన్‌ దిట్ట. అందుకుగాను ఆయనకు లభించిన పురస్కారాలకి లెక్కలేదు. అలాంటి హెర్మన్ 1984లో తనకు హెచ్.ఐ.వి సోకిందని తెలియగానే హతాశుడయ్యాడు. ఇక ఎంతో కాలం బతకనంటూ స్నేహితులకు వీడ్కోలు సైతం ఇచ్చేశాడు. కానీ పోరాడిచూద్దాం అనే ఆలోచన ఆయన జీవితాన్ని నిలిపింది. 1990ల్లో హెచ్.ఐ.వి తీవ్రతను తగ్గించే మందులు రావడంతో ఇప్పటికీ హెర్మన్‌ హాయిగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఆయన వయసు – 85 ఏళ్లు మాత్రమే!

 

క్రిస్‌ స్మిత్‌

 

క్రిస్‌ స్మిత్‌ నటుడు కాదు, క్రీడాకారుడు కాదు, సంగీతకారుడు అంతకంటే కాదు. ఆయనో పక్కా రాజకీయనేత. ఇంగ్లండులోని లేబర్ పార్టీ తరఫున అద్భుతాలు సృష్టించిన నాయకుడు. తాను హెచ్.ఐ.వితో బాధపడుతున్నానంటూ బహిరంగంగా ఒప్పుకొన్న తొలి బ్రిటన్‌ పార్లమెంటేరియన్‌. 1987 నుంచీ హెచ్.ఐ.వితో సతమతమవుతున్నా, దానిని మీద పైచేయి సాధిస్తూనే ఉన్నారు. హెచ్.ఐ.వి కోసం విరాళాలను సేకరించే సంస్థకు ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు.
వీరంతా గతం తాలూకు జ్ఞాపకాలు కాదు. వర్తమానంలో మనతో పాటుగా జీవిస్తున్నవారే! హెచ్.ఐ.వి అనే మహమ్మారితో నిశ్శబ్దంగా పోరాటం చేస్తున్నవారే! మరి వారి జీవితాలు ఇతరులు గెలుపు గుర్రాలని ఎక్కేందుకు స్ఫూర్తిగా ఎందుకు మారకూడదు!

 

- నిర్జర.