ఎమ్మెల్యేలకి ఫోన్ చేసిన హీరోయిన్ నీతూ...



ఎర్రచందనం స్మగ్లర్ మస్తాన్ వలీ కేసులో ఒక్కో విషయం మెల్లమెల్లగా బయటపడుతున్నాయి. మస్తాన్ వలీ చేతికి చిక్కి, మూడో భార్యగా మారి, హీరోయిన్ వేషం వేసి చివరికి పోలీసుల చేతికి చిక్కిన నీతూ అగర్వాల్ పోలీసుల విచారణలో అనేక విషయాలను బయటపెట్టినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రిమాండ్‌లో వున్న నీతూ అగర్వాల్‌ను పోలీసులు కోర్టు అనుమతితో ఇంటరాగేషన్ కోసం తమ అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇంటరాగేషన్‌లో నీతూ అగర్వాల్ వెల్లడించిన విషయాలను చూసి పోలీసులే నోళ్ళు వెళ్ళబెట్టారు. మొత్తం ఈ ఇష్యూలో కొంతమంది ఎమ్మెల్యేల ఇన్వాల్వ్‌మెంట్ కూడా వున్నట్టు బయపడింది. అయితే ఆ ఎమ్మెల్యేలు కూడా మస్తాన్ వలీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలేనని సమాచారం.

గుజరాత్ రాష్ట్రానికి చెందిన నీతూ అగర్వాల్‌కి తన సోదరుడిగా చెప్పే ఒక వ్యక్తి ద్వారా మస్తాన్ వలీ పరిచయం అయ్యాడు. మస్తాన్ వలీ బిల్డప్పు, డబ్బు చూసి ఆమె ఇంప్రెస్ అయింది. ఆ ఇంప్రెస్‌ని మస్తాన్ వలీ పెళ్ళిగా మలిచాడు. ఆమెను తన మూడో భార్యగా చేసుకున్నాడు. ఆమెతో ‘ప్రేమ ప్రయాణం’ అనే సినిమా కూడా తీశాడు. నీతో అగర్వాల్ అతనికి మూడో భార్య అయి కొంతకాలం ‘ప్రయాణం’ చేశాక అతని అసలు స్వరూపం ఆమెకు మెల్లమెల్లగా అర్థమవుతూ వచ్చింది. దాంతో ఆమె అతని నుంచి దూరమైపోవాలన్నా వెళ్ళలేని పరిస్థితికి ఆమె చేరుకుంది. మస్తాన్ వలీ తన అక్రమ లావాదేవీలను నీతూ అగర్వాల్ పేరుతో ఓపెన్ చేసిన అకౌంట్ ద్వారా  జరిపేవాడు. అందువల్లో ఆమె ఈ కేసులో ఇరుక్కుపోయింది. బ్యాంక్ లావాదేవీల కారణంగానే ఆమెకు ఎర్రచందనం స్మగ్లర్ల ముఠాలతో సంబంధం వుందన్న విషయం బయపడింది.

మస్తాన్ వలీని పోలీసులు అరెస్టు చేసిన తర్వాత, తన గురించి కూడా మీడియాలో వచ్చేసిన తర్వాత నీతూ అగర్వాల్ బెదిరిపోయింది. ఆమెకు ఏం చేయాలో పాలుపోలేదు. ఈ స్మగ్లర్ల ఉచ్చులో తాను ఇరుక్కుపోయానని అర్థం చేసుకుంది. మస్తాన్ వలీ డబ్బు చూసి మోసపోయానని తెలుసుకుంది. అయితే మీడియాలో వస్తున్న కథనాలు, ఆమె కోసం పోలీసులు జరుపుతున్న వేట ఆమెలో ఒత్తిడి పెంచాయి. పోలీసులకు లొంగిపోవాలని నిర్ణయించుకున్న ఆమె కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఫోన్ చేసినట్టు తెలుస్తోంది. తనకు ఒత్తిడి పెరిగిపోతోందని, తాను ఎక్కువకాలం అజ్ఞాతంలో ఉండలేనని, పోలీసులకు లొంగిపోతానని ఆమె సదరు ఎమ్మెల్యేలకు చెప్పినట్టు సమాచారం. దానికి ఆ ఎమ్మెల్యేలు నువ్వు లొంగిపోతే పోలీసులు రకరకాల ప్రశ్నలతో నిన్ను వేధిస్తారు. అందువల్ల లొంగిపోవద్దనే సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది. అందుకే ఆమె లొంగిపోకుండా ఆగిపోయింది. చివరికి పోలీసులే ఆమెను వెతికి పట్టుకున్నారు.  అయితే ఆ ఎమ్మెల్యేలు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మాత్రం కాదు.. కర్నూలు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు అని తెలుస్తోంది. సదరు ఎమ్మెల్యేల పేర్లు మాత్రం పోలీసు వర్గాలు వెల్లడించడం లేదు. నీతూ అగర్వాల్‌ని ప్రాథమికంగా ఇంటరాగేషన్ చేసిన పోలీసులు త్వరలో మరోసారి ఆమెను ఇంటరాగేట్ చేస్తారని, ఆమెతోపాటు మస్తాన్ వలీని కూడా ఇంటరాగేట్ చేయబోతున్నారు. ఈ జాయింట్ ఇంటరాగేషన్‌లో ఈ జంట మరెన్ని విషయాలు వెల్లడి చేస్తుందో చూడాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu