అంగవైకల్యంను జయించిన హసిన్

Publish Date:Sep 12, 2013

Advertisement

 

మనం ఏదన్నా చేయకపోతే అందుకు ఎన్నో కారణాలు చెబుతాం. ఇలా ఉండుంటే ఎన్నో చేసేదాన్ని, వీళ్ళ సాయం వుండుంటే, వారిలాగా నాకు అవకాశం ఉంటేనా అంటూ ఇలా ఎన్నో చెబుతాం. కానీ మన ఓటమికి కారణాలుగా అయితే సాధించాలనే పట్టుదల నిజంగా, బలంగా మనసులో ఉంటే ఎలాంటివి కూడా అడ్డురావు.

"కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు" అన్నది వట్టి మాట కాదని నిరుపించేవారు మనకి ఎదురయినపుడల్లా మనలో ఆత్మవిశ్వాసం ఉప్పొంగుతుంది. తెలియని ధైర్యం వెన్ను తట్టుతుంది. మీరు "హసిన్" గురించి వింటే అయ్యో అని అనరు. వావ్ అని అంటారు. మరి ఇంతకి ఆ హసిన్ ఎవరు అని అనుకుంటున్నారా?

చెన్నైలోని విల్లీవాక్కానికి చెందిన హసిన్ కు పుట్టుకతోనే రెండు చేతులు లేవు. తల్లితండ్రులు ఆ అబ్బాయిని చూసి బాధపడ్డారు. కానీ ఆ అబ్బాయి తనని తాను తక్కువ చేసుకోలేదు. అందరూ చేతులతో చేసే పనులను తాను కాళ్ళతో చేయడం మొదలుపెట్టాడు. పదవ తరగతి దాకా చదివాడు. ఇక ఆ తర్వాత ఏంటి అన్న ప్రశ్న ఎదురయ్యినపుడు హసిన్ తల్లిదండ్రులు మళ్ళీ కృంగిపోయారు. ఈ అబ్బాయికి జీవనోపాధి ఏంటి? ఎలా గడుస్తుంది ఇతని జీవితం అని అందరూ భయపడ్డారు. కానీ హసిన్ మాత్రం భయపడలేదు. ఆలోచించడం ప్రారంభించాడు. ఆ ఆలోచనలకి ఓ రూపు రాగానే ఆచరణలో పెట్టాడు. అతను ఉపాధి మార్గంగా ఏ వృత్తిని ఎంచుకున్నాడో తెలుసా...? మెకానిక్.

రెండు చేతులు లేకపోయినా ధీమాగా భవిష్యత్తును ఎదుర్కోవాలని భావించిన హసిన్.. తన అన్నయ్య నడిపే మెకానిక్ షాపులో పని నేర్చుకోవటం మొదలుపెట్టాడు. కాళ్ళతోనే స్క్రూలు, నట్లు విప్పటం, బిగించటం చేసేవాడు. క్రమక్రమంగా ఆ పనిలో పట్టు కుదిరింది. ఇపుడు రేడియో, టి.వి., సెల్ ఫోను వంటి ఎన్నో ఎలక్ట్రానిక్ వస్తువులు బాగుచేయగలడు. చేతులతో తన అన్న చేసేంత వేగంగా హసిన్ కూడా తన కాళ్ళతో వస్తువులను రిపేర్ చేయగలడు.

చిన్న చిన్న రిపేర్ల నుంచి పెద్ద పెద్ద రిపేర్ల దాకా ఇపుడు హసిన్ దగ్గరికి వచ్చేవారి సంఖ్య ఎక్కువే. తన జీవనోపాధి గురించి భయపడిన తల్లిదండ్రుల చేతిలో తన సంపాదన పెట్టి గర్వంగా కళ్ళెగరేసి చూపించాడు. వాళ్ళ ఆనందం చూసి తాను కూడా ఆనందపడ్డాడు. తనకు వీలయినంతలో సమాజసేవ కూడా చేస్తుంటాడు. ఇంకొకరికి సహాయపడటంలో బోలెడంత సంతృప్తి ఉందని చెబుతాడు. తనని చూసి జాలి పడితే హసిన్ కు నచ్చదు. చేతుల్లేకపోతే ఏంటి? నేను కూడా అందరిలా కాళ్ళతో అన్ని పనులు చేయగలుగుతున్నాను కదా! మరి ఇక నాపై జాలి ఎందుకు అంటాడు.