పెళ్లి కోసం తల్లినే చంపాడు
posted on May 4, 2017 11:27AM
.jpg)
క్షణికావేశంలో మనిషి మృగంలా మారుతున్నాడు...ప్రతి నిత్యం మన కళ్ల ముందు జరుగుతున్న ఎన్నో సంఘటనలు దీనికి ప్రత్యక్ష ఉదాహరణలు..తాజాగా తన పెళ్లికి అడ్డు వస్తోందనే కోపంతో కన్న తల్లినే కడతేర్చాడు ఓ కుమారుడు. విద్యాబుద్దులు నేర్పి భావిభారత పౌరుల్ని తయారు చేయాల్సిన ఓ ప్రధానోపాధ్యాయుడే ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డాడు. తంజావూరులోని శ్రీనివాసపురం ప్రభుత్వ పాఠశాలలో త్యాగరాజన్ అనే వ్యక్తి ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు.
మొదటి భార్యతో తరచూ గొడవలు పడుతుండటంతో..రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీనికి తల్లి ససేమిరా అనడంతో ఆమె మీద కక్ష పెంచుకున్న త్యాగరాజన్..గత నెల 20న ఆమె ఒంటి మీద కారం చల్లి, ఆరు సవర్ల నగలు అపహరించి హతమార్చాడు. అనంతరం తన తల్లిని ఎవరో చంపి. నగలు అపహరించుకుపోయారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు త్యాగరాజన్ ప్రవర్తనలో తేడా కనిపించింది. పోలీసులు తమదైన స్టైల్లో విచారణ జరపడంతో అసలు నిజం వెలుగు చూసింది. రెండో వివాహానికి తల్లి అంగీకరించపోవడంతో తానే హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. పోలీసులు అతనిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.