ఫొటో చూస్తే పేరు చెప్పేయవచ్చు

 

మీకు ఎప్పుడైనా ఓ మనిషిని చూడగానే ఇతని పేరు బహుశా ఫలానా అయి ఉంటుందని తోచిందా! ఇలా స్ఫురించడం కేవలం సిక్స్త్ సెన్స్ వల్ల కాదంటున్నారు శాస్త్రవేత్తలు. మనిషి పేరుకీ అతని రూపానికీ మధ్య తగినన్ని పోలికలు ఉండవచ్చని చెబుతున్నారు.

40 శాతం ఖచ్చితంగా

అపరిచిత వ్యక్తులకి సంబంధించిన పేర్లని మనం ఏమేరకు గుర్తుపట్టగలం అనే విషయాన్ని తేల్చేందుకు హిబ్రూ యూనివర్శిటీవారు ఓ పరిశోధన చేశారు. ఇందుకోసం కొంతమందికి... వారికి ఏమాత్రం పరిచయం లేని వ్యక్తుల ఫొటోలను చూపించారు. వాటితో పాటుగా ఓ నాలుగైదు పేర్లని చెప్పి, ఆ ఫొటోకి ఏ పేరు నప్పుతుందో ఊహించమని అడిగారు. ఆశ్చర్యంగా దాదాపు 40 శాతం సందర్భాలలో ఫొటోకి తగిన పేరుని సూచించారట అభ్యర్థులు. కేవలం ఊహామాత్రంగా కనుక ఇలాంటి విషయాల్ని అంచనా వేయగలిగితే అది 25 శాతానికి మించి నిజమయ్యే అవకాశం ఉండకూడదు! ఈ పరిశోదనలో తేలిన మరో విషయం ఏమిటంటే ఏ దేశంవారు, తమ దేశపౌరుల పేర్లనే ఖచ్చితంగా ఊహించగలగడం. ఉదాహరణకి పరిశోధనలో పాల్గొన్న ఫ్రెంచి పౌరులు తమ దేశానికి చెందినవారి పేర్లని మరింత సులువుగా గుర్తించారు. అలాగే ఇజ్రాయేల్ వాసులు, హిబ్రూ జాతివారి పేర్లని త్వరగా పసిగట్టారు.

కారణం ఉంది

లోకంలో ప్రతి జాతికీ ఓ సంస్కృతి ఉంటుంది. ఆ సంస్కృతికి అనుగుణంగానే మనం పేర్లు పెట్టుకుంటాము. వందల ఏళ్లతరబడి అలాంటి పేర్లకి అలవాటుపడటంతో... మనకి తెలియకుండానే ఆ పేర్లకి అనుబంధంగా కొన్ని లక్షణాలను ఊహించుకుంటాము. ఉదాహరణకు రాముడు అన్న పేరు ఉన్న వ్యక్తి కాస్త శాంతంగా కనిపిస్తాడనీ, లక్షణ్ అన్న పేరు వెనుక వినయం ఉట్టిపడుతుందనీ, శివ అన్న పేరు కలిగినవాడు కాస్త కోపంగా కనిపిస్తాడనీ.... రకరకాల అంచనాలు మనకి తెలియకుండానే మెదడులో తిష్టవేసుకుని ఉండిపోతాయి. చిత్రం ఏమిటంటే మనకి ఎలాగైతే ఫలానా పేరుని వినగానే ఓ రూపం గుర్తుకువస్తుందో... ఆ పేరు ఉన్న మనిషి మీద కూడా అలాంటి ప్రభావమే ఉంటుందట. ఆ ప్రభావానికి అనుగుణంగా, తనకి తెలియకుండానే కట్టుబొట్టులలో మార్పు చేసుకుంటాడట. ఇలా తలదువ్వుకునే తీరులోనూ, చూసే చూపులోనూ, కట్టుబొట్టులోనూ అతను చేసుకునే చిన్నచిన్న మార్పులు సైతం తను కనిపించే తీరు మీద ప్రభావం చూపుతాయి. రాముడు అన్న వ్యక్తి బుద్ధిగా నూనెరాసుకుని, పక్క పాపిడి తీసుకుని, బొట్టు పెట్టుకున్నాడే అనుకోండి... నిజంగా అతను రాముడే అనిపిస్తాడు.

అదీ విషయం! ఊహ తెలిసినప్పటి నుంచీ మనం పెరిగే సంస్కృతి, మన చుట్టుపక్కల వాతావరణం, చదివే చదువు, స్నేహితులు, ఎదురయ్యే సమస్యలు... లాంటివన్నీ మన వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తాయని ఇంతవరకూ అనుకునేవారం. కానీ ఎవరో పెట్టే పేరు కూడా మన మనస్తత్వం మీద ముద్రవేస్తుందనీ, దానికి అనుగుణంగానే మనం మారిపోతామనీ ఈ పరిశోధన రుజువుచేస్తోంది. కాబట్టి ఇక మీదట పిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలండోయ్!

- నిర్జర.