సిక్స్‌ ప్యాక్ ఉంటే..ఆరోగ్యంగా ఉన్నట్లు కాదంట..!

 

ప్రస్తుతం యువత సిక్స్‌ప్యాక్ కోసం తహతహలాడుతున్నారు. ఎక్కడ చూసినా ఎవ్వరి నోట విన్నా..సిక్స్‌ప్యాక్ అనే మాట వినపడుతోంది. సల్మాన్, అమీర్, షారూఖ్, నితిన్, అల్లు అర్జున్‌ల లాగా తమ బాడీ షేప్‌లు మార్చుకునేందుకు యువత ఉర్రూతలూగుతోంది. కాని అలాంటి వారికి పరిశోధకులు షాకిచ్చారు. కండలు పెంచినంత మాత్రాన ఆరోగ్యంగా ఉన్నట్లు కాదంటున్నారు. స్త్రీలు, పురుషులు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరిలో ఉండే మజిల్ కండరాలే సిక్స్‌ప్యాక్. అయితే అదనంగా చేరిన కొవ్వు కారణంగా ఈ ఆరు పలకలు కవర్ అయిపోయి బయటకు కనపడకుండా పోతాయి. తీవ్రమైన వ్యాయామం, కొవ్వు కరిగించడం ద్వారా వీటిని తిరిగి కనపడేలా చెయవచ్చు. ఆరు పలకలు సాధించడం మాత్రమే కాదు కాపాడుకోవడం కూడా కష్టమే.

 

ఇదిలా ఉంటే లేటేస్ట్‌గా ఫ్యామిలీ ప్యాక్‌లు వదిలించుకుని బాడీని ఫిట్‌గా ఉంచుకోవడానికి ఏజ్‌తో సంబంధం లేకుండా అంతా జిమ్ సెంటర్లకు పరిగెడుతున్నారు. వీలైనంత తొందరగా సిక్స్‌ప్యాక్ తెచ్చుకోవాలనుకునే యువత ఆరాటపడుతోంది. వీరికి శిక్షకులు కూడా తోడయ్యారు. దీనిని క్యాష్ చేసుకోవడానికి త్వరగా సిక్స్ ప్యాక్ కనిపించేందుకు మందులను అలవాటు చేస్తున్నారు. శరీరంలోని కొవ్వును తగ్గించేందుకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినమని చెప్పడానికి బదులుగా మందులను సూచిస్తున్నారు. ఇటీవల సిక్స్‌ ప్యాక్‌ కోసం ప్రయత్నించిన ఇద్దరు యువకులు జిమ్‌లో విపరీతంగా వర్కవుట్లు చేసి గుండె సంబంధిత సమస్యలతో ప్రాణాలు పొగొట్టుకున్నారు. వీలైనంత తొందరగా కొవ్వును తగ్గించుకునేందుకు ప్రోటీన్ షేక్స్, స్టెరాయిడ్స్‌ వంటి వాటి జోలికి వెళ్లడంతోనే వారు ప్రాణం మీదకు తెచ్చుకున్నారని వెలుగులోకి వచ్చింది.

 

ఈ వార్త సంచలనం సృష్టించడంతో సిక్స్‌ప్యాక్‌పై జనాల్లో ఉన్న అపోహల్ని తొలగించడానికి నిపుణులు ప్రయత్నించారు. ముందుగా వారికి ఎంతవరకు సిక్స్‌ప్యాక్ అవసరమా అని ఆలోచించాలి. ఒకవేళ సిక్స్‌ప్యాక్ చేయాలనుకుంటే ప్రకృతి సిద్ధమైన ఆహారమే తీసుకోవాలి..దీని వల్ల ఫలితం రావడం లేటైనా ఆరోగ్యానికి నష్టం చేకూరదని నిపుణులు చెప్తున్నారు. మొత్తానికి సిక్స్‌ప్యాక్ ద్వారా ప్రత్యేకంగా ఆరోగ్యపరమైన ప్రయోజనాలు ఏవీ కలగవని అది ఒక సరదా మాత్రమేనని, పైగా దేహాన్ని విపరీతమైన, అలవాటు లేని శ్రమకు గురిచేయడం వల్ల ఇతరత్రా సమస్యలు ఏర్పడవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి బాడీ లవర్స్ సిక్స్‌ప్యాక్ చేయ్యాలనుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి జిమ్‌లో అడుగుపెట్టండి. "ఫిట్‌గా కనిపించాలనుకోవడంతో పాటు ఫిట్‌గా కూడా ఉండాలి". సో బీ కేర్ ఫుల్.