కేసీఆర్ని ఎన్నిసార్లు ఉరితీయాలి?
posted on Nov 18, 2014 4:04PM

తెలుగుదేశం నాయకుడు ఎర్రబెల్లి దయాకరరావు సమాధానం దొరకని ఒక ప్రశ్న వేశారు. అది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ని ఎన్నిసార్లు ఉరి తీయాలి? మంగళవారం నాడు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎర్రబెల్లి ఈ ప్రశ్న వేశారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రైతుల ఆత్మహత్యలన్నీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన హత్యలేనని ఆయన అన్నారు. ఇంతమంది రైతుల ఆత్మహత్యకు కారకుడైన కేసీఆర్‌కి ఎన్నిసార్లు ఉరి తీయాలని ఆయన ప్రశ్నించారు. రైతులు నిరాశకు గురికావల్సిన అవసరం లేదని, తెలుగుదేశం పార్టీ వారికి అండగా వుంటుందని ఎర్రబెల్లి భరోసా ఇచ్చారు. కేసీఆర్ ప్రభుత్వానికి ధైర్యం వుంటే రైతుల ఆత్మహత్యలపై అసెంబ్లీలో టీడీపీ సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని సవాల్ విసిరారు. కేసీఆర్ ఫామ్ హౌస్ చుట్టుపక్కల ప్రాంతాలకు మాత్రం రోజుకు 24 గంటలు కరెంట్ ఇస్తున్నారని, రాష్ట్రంలోని ఇతర రైతులకు మాత్రం రోజుకు కనీసం రెండు గంటలు కూడా కరెంటు ఇవ్వకపోవడం సిగ్గుచేటని ఎర్రబెల్లి విమర్శించారు. కేసీఆర్ కుమార్తె గురించి ప్రశ్నించినందుకే తమను అసెంబ్లీ నుంచి గెంటేశారని ఆయన అన్నారు.