గాలి ద్వారా సోకవచ్చు.. ఆధారాలున్నాయి అంటున్న శాస్త్రవేత్తలు

మార్గదర్శకాలు మార్చమంటూ డబ్ల్యూహెచ్ఓకు లేఖ

భూగోళాన్ని వణికిస్తున్న కోవిడ్ వైరస్ ను అరకట్టడానికి చేస్తున్న మానవప్రయత్నాలు ఫలితాలు ఇవ్వకముందే  కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య లక్షల్లో  ఉండటంతో ఇది ఎలా వ్యాప్తిస్తోంది అన్న అంశంపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ఒకవైపు వైరస్ ను తుదముట్టించే పరిశోధనలు జరుగుతుంటే మరోవైపు వ్యాప్తి ఎలా చెందుతుంది అన్న విషయంపై శాస్త్రవేత్తలు దృష్టి సారించారు.  కంటిని కనిపించని ఈ వైరస్ వ్యాప్తిపై అనేక కోణాల్లో పరిశోధనలు నిరంతరం జరుగుతున్నాయి. కారణం గత కొన్ని నెలలుగా ఎన్ని కట్టడి చేసినా.. దశల వారీగా లాక్డౌన్ విధించినా బాధితుల సంఖ్యను మాత్రం నియంత్రించలేక పోతున్నాము. కొన్ని దేశాల్లో తగ్గుముఖం పట్టినట్లుపట్టి మళ్ళీ విజృంభిస్తున్న ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, ప్రతి రెండు గంటలకు చేతులను శానిటైజ్ చేసుకోవడం ఇలాంటి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న వైరస్ బారిన పడుతున్న బాధితుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ లేకపోయినప్పటికీ కూడా చాలా మందికి ఈ వ్యాధి సోకడం లో కారణాలేంటో తెలియడం లేదు. ఇదే విషయంపై ఒక శాస్త్రవేత్తల బృందం పరిశోధనలు చేసి ఫలితాలను డబ్ల్యూహెచ్ఓకు లేఖ ద్వారా తెలిపింది. ప్రస్తుతం వ్యాప్తిని అరికట్టేందుకు రూపొందించిన మార్గదర్శకాలను మార్చాలని వారు కోరారు.

ఆధారాలున్నాయి..
కోవిడ్ 19 వైరస్ గాలి ద్వారా వ్యాప్తి చెందుతుందని శాస్త్రవేత్తల బృందం చెబుతోంది. గాలిలో ఉండే చిన్నచిన్న కణాల ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుంది అనడానికి తమ వద్ద ఆధారాలున్నాయని వారు అంటున్నారు. ఈ బృందంలో 32 దేశాలకు చెందిన 239 మంది శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. కరోనా సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వెలువడే తుంపర్లలో ఉండే వైరస్  చాలా సమయం గాలిలోనే ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు. 15 మైక్రాన్ల కంటే చిన్న కణాల ద్వారా మాత్రమే వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని చెప్పారు. ఈ వైరస్ గాలి ద్వారా వ్యాప్తి చెందినదని ప్రపంచ ఆరోగ్య సంస్థ గతంలోనే స్పష్టం చేసింది. తాజాగా శాస్త్రవేత్తల బృందం పరిశోధనల ఫలితాలపై ఏం చెబుతుందో వేచి చూడాలి.

గాలి వెలుతురు తక్కువగా ఉండే ప్రదేశాల్లో
అయితే శాస్త్రవేత్తలు చెప్తున్న అంశాలు నిజమైతే గాలి ద్వారా వైరస్ వ్యాపిస్తుంటే మనం మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎక్కువగా జనసంచారం ఉండే ప్రాంతాలకు వెళ్లకపోవడమే ఉత్తమం.  ప్రజలు ఎక్కువ సంఖ్యలో తిరిగే ప్రాంతాల అన్నింటిలోనూ, గాలి వెలుతురు తక్కువగా ఉండే ప్రదేశాల్లో, మార్కెట్ యాడ్స్, షాపింగ్ మాల్స్, ఆఫీస్ లాంటి చోట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వాలు చెప్పినా ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పినా వ్యక్తిగత జాగ్రత్త ముఖ్యం అన్నది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది.