గుజరాత్ అసెంబ్లీ  టీషర్ట్ గందరగోళం

నా ఇష్టం నాదంటే అన్నిచోట్లా కుదరదు. సమయ, సందర్భాలను బట్టి ప్రవర్తిస్తేనే, ఎవరికైనా గౌరవం దక్కుతుంది. అందులోనూ చట్ట సభల్లో సభ్యుల ప్రవర్తన,వేషధారణ పదిమందికి ఆదర్శంగా ఉంటేనే సభకున్న గౌరవం నిలబడుతుంది. అందుకే, చట్టసభల్లో సభ్యులప్రవర్తనకు సంబంధించిన నియమావళిని సభాధ్యక్షులు అమలు చేయడం ఆచారంగా వస్తుంది.

అప్పుడప్పుడు కొదంరు సభ్యులు, నాయిష్టం నాది అన్నట్లుగా ప్రవర్తిస్తుంటారు. అలాంటి సందర్భాలలో సభాధ్యక్షుడు నియమావళికి అనుగుణంగా సూచనలు, సలహాలు ఇవ్వడం అవసరం అయితే మందలించడం, చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయినా, కొందరు సభ్యులు, అందుకు విరుద్ధంగా వ్యవహరించి వివాదాలు సృష్టిస్తారు. కౌగిలింతలు, కన్ను గీటటం వంటి చిల్లర చేష్టలతో  నవ్వుల పాలవుతుంటారు.

ఇదిగో అలాంటి సంఘటనే గుజరాత్ శాసన సభలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే  రాష్ట్రంలోని సోమనాథ్‌ నియోజకవర్గం నుంచి తొలిసారిగా శాసనసభకు ఎన్నికైన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే విమల్‌ చుడాస్మ.. గతవారం అసెంబ్లీకి టీషర్ట్‌, ప్యాంట్‌ వేసుకుని వచ్చారు. అయితే మరోసారి ఇలా రావొద్దని.. ఎమ్మెల్యేలు అసెంబ్లీ మర్యాద పాటించాలని స్పీకర్‌ రాజేంద్ర త్రివేది అప్పుడే హెచ్చరించారు. అయితే ఆయన మళ్ళీ సోమవారం కూడా విమల్‌ మళ్లీ టీషర్ట్‌ ధరించే సభకు హాజరవడంతో స్పీకర్‌ త్రివేది అసహనం వ్యక్తం చేశారు. ఆయనను సభ నుంచి బయటకు వెళ్లిపోవాలని ఆదేశించారు. షర్ట్‌ లేదా కుర్తా వేసుకుంటేనే అసెంబ్లీకి రావాలని సూచించారు.

అయితే అసలే కాంగ్రెస్ సభ్యుడు ఆపైన ఉడుకు రక్తం కావడంతో కావచ్చు ఎమ్మెల్ల్యే తీవ్ర అసహనానికి గురయ్యారు. స్పీకర్’తో వివాదానికి దిగారు. ‘ఇదే టీషర్ట్‌తో నేను ఎన్నికల్లో ఓట్లు అభ్యర్థించాను. ప్రజలకు నాకు ఓటేసి అసెంబ్లీకి పంపారు. మీరు మా ఓటర్లను అగౌరవపరుస్తున్నారు’అంటూ స్పీకర్’కు కౌంటర్ ఇచ్చారు.
 అయితే, ఇలాంటి కుర్ర చేష్టలు సభలో చెల్లవని కర్రు కాల్చి వాత పెట్టారు. ‘మీరు మీ ఓటర్లను ఎలా కలిశారన్నది అప్రస్తుతం, ఇపుడు మీరు సభలో ఉన్నారు.  ఎమ్మెల్యే అయినంతమాత్రాన మీకు నచ్చినట్లుగా సభకు రావడానికి కుదరదు. ఇదేం ప్లేగ్రౌండ్‌ కాదు. అసెంబ్లీ నిబంధనలు పాటించాలి. షర్ట్‌, కుర్తా లాంటి ఫార్మల్‌ దుస్తులు వేసుకుంటేనే సభకు రండి అని గట్టిగా చురకేశారు.దీంతో ఎమ్మెల్యే సభ నుంచి బయటకు వెళ్లిపోయారు.

అనంతరం.. స్పీకర్‌తో వాదన పెట్టుకున్న ఎమ్మెల్యే విమల్‌ను మూడు రోజుల పాటు సభ నుంచి బహిష్కరించాలంటూ మంత్రి ప్రదీప్‌ సిన్హ్‌ జడేజా స్పీకర్‌ ముందు ప్రతిపాదన చేశారు. అయితే ఈ ప్రతిపాదనను ముఖ్యమంత్రి  విజయ్‌ రూపానీ వెనక్కి తీసుకున్నారు. గతంలో టీషర్ట్‌ వ్వేస్కుని సభకు వచ్చిన మంత్రి స్పీకర్‌ చెప్పిన తర్వాత ఆయన తన డ్రెసింగ్‌ స్టైల్‌‌ను మార్చుకున్న విఃయాన్ని గుర్తుచేశారు. సభకు టీషర్ట్‌లలో రావడం అంత బాగుండదు. ఈ విషయంలో విమల్‌కు కాంగ్రెస్‌ నేతలు సర్దిచెప్పాలని ముఖ్యమంత్రి రూపాని, కాంగ్రెస్ నాయకులకు చిన్నపాటి క్లాస్ తీసుకున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu