కేటీఆర్ దగ్గరే ‘ఆంధ్రా వాసన’ వస్తోంది

 

మాజీ మంత్రిణి, తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు డీకే అరుణ కొత్త పదాన్ని కనిపెట్టారు... అదే ‘ఆంధ్రా వాసన’. నరవాసనలా ధ్వనిస్తున్న ఈ కొత్తపదాన్ని ఆమె వాళ్ళమీద వీళ్ళమీద కాకుండా పక్కా తెలంగాణవాది అయిన కేసీఆర్ కుమారుడు కేటీఆర్ మీదే ప్రయోగించారు. కేటీఆర్ దగ్గర ఆంధ్రా వాసన వుందని, తన దగ్గర ఆంధ్రా వాసన లేదని ఆమె అన్నారు. కేటీఆర్‌కి ఆ పేరు ఎన్టీఆర్ పేరును చూసి పెట్టారని, అలాగే కేటీఆర్ ఆంధ్ర ప్రాంతంలో చదువుకున్నారని, కేటీఆర్ భార్య కూడా ఆంధ్ర ప్రాంతానికే చెందిన వ్యక్తి అని ఆమె అన్నారు. ఈరకంగా అన్ని రకాలుగా కేటీఆర్ దగ్గరే ఆంధ్రా వాసన వుంది తప్ప తెలంగాణలో పుట్టి పెరిగిన తన దగ్గర లేదని ఆమె చెప్పారు. ఈ వాసనల గొడవ ఇలా వుంచితే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజకవర్గంలోనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా తెలంగాణ ప్రభుత్వం ఎంతమాత్రం పట్టించుకోవడం లేదని డి.కె.అరుణ విమర్శించారు. అంతేకాకుండా రైతుల ఆత్మహత్యలను అవమానపరిచే విధంగా కేసీఆర్ మాట్లాడ్డం బాధాకరమని ఆమె అన్నారు.