అధిష్టానం దెబ్బకు సీమంధ్ర కాంగ్రెస్ నేతలు విలవిలా

 

తెలంగాణా ఉద్యమాలు జోరుగా సాగుతున్న తరుణంలో కాంగ్రెస్ అధిష్టానం తన టీ-కాంగ్రెస్ నేతల రాజకీయ జీవితాలతో చెలగాటమాడుకొంది. ఇప్పుడు తన సీమాంధ్ర నేతల రాజకీయ జీవితాలతో ఆడుకొంటోంది. ఒక రాజకీయ పార్టీ ఎదుట పార్టీ నేతలని దెబ్బతీయడానికి ప్రయత్నించడం సహజమే అయినప్పటికీ, ఇలా స్వంత పార్టీ నేతలనే దెబ్బతీయాలనుకోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. గత రెండు మూడు దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేస్తున్నతమను కాదని, ఇంతకాలం తనను ఎవరయితే సవాలు చేస్తున్నారో, ఎవరిపై కేసులు మోపి జైలులో నిర్భందించిందో వారికోసమే పార్టీని, నేతలని పణంగా పెట్టాలనుకోవడం సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే రాష్ట్ర విభజన నిర్ణయంతో సగం చచ్చి ఉన్నతమకు, విభజన ప్రక్రియను ముందుకు తీసుకు వెళ్లేందుకు అదే జగన్మోహన్ రెడ్డి సాయం తీసుకొని స్వంత ప్రభుత్వమే కూల్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ అధిష్టానం వైఖరితో వారు నివ్వెర పోయారు. హర్షకుమార్, లగడపాటి, సాయి ప్రతాప్ వంటి నిఖార్సయిన కాంగ్రెస్ నేతలందరూ దీనిని తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నారు. ఈ పరిణామాలతో కలత చెందిన అనేక మంది ఇప్పుడు తాము ఏ పార్టీని ఆశ్రయించాలో తెలియక విలవిలలాడుతున్నారు.

 

కాంగ్రెస్ పార్టీ బీసీ, యస్సీ,ఎస్టీ, మైనార్టీ ఓట్ల మీదే ప్రధానంగా ఆధారపడినప్పటికీ, ఆ పార్టీలో ఆధిపత్యం మాత్రం రెడ్డి మరియు కాపు కులస్తుల చేతుల్లోనే ఉందనేది బహిరంగ రహస్యమే. కాంగ్రెస్ ఆడుతున్న ఈ రాజకీయ జూదంలో బలమయిన ఆ రెండు వర్గాల నేతలు తాము ఓడిపోయామనే భావనలో ఉన్నారు. అందువల్ల రెడ్డి కులస్తులు కొందరు వైకాపా గూటికి చేరుకొనే ప్రయత్నాలు చేస్తుంటే, కాపు కులస్తులు మాత్రం తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నట్లు సమాచారం. ఇక మిగిలిన వారు కొత్త పార్టీ పెట్టడం గురించి ఆలోచనలు చేస్తున్నారు.

 

అయితే కాంగ్రెస్ పార్టీ దీనికి ఎంత మాత్రం భయపడటం లేదు. కారణం తమ పార్టీ నేతలలో ఎక్కువ మంది అంతిమంగా వైకాపా గూటికే చేరుకొంటారని దాని నమ్మకం. వైకాపా కూడా కాంగ్రెస్ చెట్టుకు మొలిచిన మరో కొమ్మే గనుక ఎన్నికల తరువాత వైకాపాతో మళ్ళీ అంటూ కట్టుకోవచ్చుననే దృడ (గుడ్డి)నమ్మకంతోనే కాంగ్రెస్ తన నేతలను వదులుకొనేందుకు సిద్దపడుతోంది. కానీ అది ఊహిస్తున్నట్లుగా రెడ్డి కులస్తులు అందరూ వైకాపాలోనే చేరెందుకు సిద్ధంగా లేరని సమాచారం.

 

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అతనితో చేతులు కలపడం ఇష్టం లేక కొందరు, ఏ కాంగ్రెస్ పార్టీని కాదనుకొని తాము బయటకి వచ్చేమో మళ్ళీ భవిష్యత్తులో అదే కాంగ్రెస్ పార్టీతో కలిసే అవకాశం ఉన్నకారణంగా వైకాపాలో చేరేందుకు మరికొందరు ఇష్టపడటం లేదు. తెదేపా, వైకాపాలలో చేరలేని పరిస్థితుల్లో ఉన్న అటువంటి వారు తప్పనిసరిగా మరో రాజకీయపార్టీ పెట్టుకోక తప్పదు. కాంగ్రెస్ అధిష్టానం కూడా సరిగ్గా అదే కోరుకొంటోంది. తెలుగుదేశం పార్టీని అధికారం చెప్పట్టకుండా నిలువరించేందుకు నేతలలో, ప్రజలలో కొంత గందరగోళం సృష్టించి ఓట్లు చీల్చడం ద్వారానే తను లాభపడాలని దురాశకు పోతోంది. కానీ కాంగ్రెస్ హస్తంలో గీతలను తెలుగు ప్రజలు గతంలో మార్చిన సంగతిని మరిచిపోతోంది.