మాట మార్చిన కేంద్ర మంత్రి గారు

 

మొన్న సుప్రీం కోర్టు జగన్ మోహన్ రెడ్డి బెయిలు పిటిషను విచారణ చేపట్టినప్పుడు జగన్ తరపున వాదిస్తున్నలాయరు హరీష్ సాల్వే కేంద్ర మంత్రి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి “జగన్ మోహన్ రెడ్డి జైల్లోంచి బయటపడాలంటే కాంగ్రెస్ పార్టీలో చేరక తప్పదు” అని మీడియాకు ఇచ్చిన స్టేట్మెంటును కోర్టుకి సమర్పిస్తూ తన క్లయింటు జగన్ మోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అన్యాయంగా అరెస్టు చేయించిందని చెప్పడానికి ఇదే ఒక ఉదాహరణ అని వాదించేసరికి సీబీఐ కూడా నోట మాటలేకుండా ఉండిపోవలసి వచ్చింది. ఆ విధంగా భరోసా ఇచ్చిన మంత్రిగారికి సమన్లు జారీ చేసి ఈ విషయంలో ఆయనను సంజాయిషీ కోరుతామని సీబీఐ చెప్పింది.

 

మంత్రి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి ఇచ్చిన పేపర్ స్టేట్మెంట్ అటు కాంగ్రెస్ పార్టీని కూడా ఇబ్బందుల్లో పడేసింది. వైయస్సార్ కాంగ్రెస్ నేతలు ఇంతకాలం ఇదే విషయాన్ని గట్టిగా చెపుతున్నప్పటికీ వారి వాదనను కాంగ్రెస్ పార్టీ తేలికగా కొట్టివేస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు స్వంత పార్టీకి చెందిన కేంద్ర మంత్రే స్వయంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వారి వాదనను బలపరుస్తున్నట్లు మాట్లాడటం, ఆ పాయింటును సుప్రీం కోర్టులో జగన్ న్యాయవాదులు బయటపెట్టడంతో కాంగ్రెస్ కూడా అడ్డుగా దొరికిపోయింది.

 

అయితే, మహా మహా కుంభ కోణాలు బయటపడ్డపుడే కాంగ్రెస్ పార్టీ బెదిరిందీ లేదు, బయపడిందీలేదు. ఇక ఎప్పుడో జరిగిన ఈ కుంభకోణాలను చూసి ఎందుకు బయపడుతుంది? ఇటువంటి సమస్యల నుండి బయటపడటానికి కాంగ్రెస్ వద్ద సాంప్రదాయ సిద్దమయిన గృహ చిట్కాలు చాలానే ఉన్నాయి. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ “కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డిగారు చెప్పిన మాటలు పూర్తిగా అయన వ్యక్తిగతమయినవి. పార్టీకి వాటితో సంబంధం లేదు,” అని ప్రకటించి చేతులు దులుపుకొన్నారు.ఇక, మీడియా ఒక వైపు సీబీఐ మరో వైపు నిత్యం వరి కుప్పలు నూర్చి పోస్తున్నట్లు దివంగత ముఖ్య మంత్రి రాజశేకర్ రెడ్డి హయంలో జరిగిన ‘పుణ్య కార్యలన్నిటినీ’ కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నా కూడా, ఒకవేళ రాజశేకర్ రెడ్డి గనుక తప్పుచేసి ఉంటే, కాంగ్రెస్ వాదులమయిన మేమందరం సిగ్గుతో తలలు వంచుకోవలసి ఉంటుందని ఆయన చెప్పడం మరో విశేషం.

 

ఇక ఆ విధంగా స్టేట్మెంట్ ఇచ్చిన మంత్రి గారిలో కూడా స్వచ్చమయిన కాంగ్రెస్ రక్తమే ప్రవహిస్తోంది కనుక, ఆయన కూడా అలవాటయిన మరో చిట్కాను ప్రయోగిస్తూ “జగన్ మోహన్ రెడ్డి మా పార్టీలో చేరితేనే అతనికి జైలు నుండి విముక్తి లభిస్తుందని నేనెన్నడూ అనలేదు. ఆ విధంగా అన్నానని ఎవరయినా ఋజువు చేస్తే నా మంత్రి పదవిని వదులుకోవడానికి కూడా నేను సిద్ధం. మరి ఎవరయినా దానిని నిరూపించగలరా?” అని సవాలు చేసారు. కానీ, సీబీఐ మాత్రం ఆయనకి సమన్లు జారీ చేసి సంజాయిషీ కోరాలని నిర్ణయించుకొనట్లు సమాచారం.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu