చిరంజీవికి కోపమొచ్చింది

 

రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం, తన మెగా పార్టీని పణంగాపెట్టి మరీ సంపాదించుకొన్న కేంద్రమంత్రి పదవికి ఎప్పుడో రాజీనామా గీకి పడేసినా, ఇంకా ఈ అశోక్ బాబు లాంటి వాళ్ళు అవాకులు చవాకులు వాగుతుంటే, అలుగుటయే ఎరుంగని ధర్మరాజు వంటి చిరంజీవికయినా కోపం రాకపోదు.

 

అయినపట్టికీ పంటి బిగువున ఓర్చుకొంటూ డిల్లీలో అధిష్టానం చుట్టూ తిరుగుతూ రాష్ట్రం విడగొడితే ప్యాకేజీలు ఇస్తే తప్ప ఊరుకొనేది లేదని, భద్రాచలం మాదేనని ఆయన ఎంత గట్టిగా వాదిస్తున్నారో ఆ అశోక్ బాబుకి తెలుసా?ఎంత సేపు చిరంజీవి రాజీనామా చేయలేదని ఆయన మీద పడి ఏడవడమే కానీ, ఆ అశోక్ బాబు రాజీనామా చేసారా? అంటూ ఆయన కూడా చాలా కోపడిపోయారు. తను పదవికి రాజీనామా చేసినా, ప్రధానమంత్రి ఆకాయితం ముక్కని ఎక్కడో పడేసుకొంటే దానికి కూడా తననే నిందించడం భావ్యమా? అని ఆ జీవి పాపం చాలా బాధ పడిపోయారు.

 

అయినా కాయలున్నచెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్లు నిస్వార్ధంగా ప్యాకేజీలకోసం కృషి చేస్తున్నతనవంటి ప్రజాసేవకులకే ఈ సూటిపోటి మాటలు తప్పవని సర్ది చెప్పుకొని, సోనియమ్మని కలిసి హైదరాబాదుని పదేళ్ళకో, పాతికేళ్ళకోసమో యూటీగా చేసి తీరవలసిందేనని, లేకుంటే తన కేంద్ర మంత్రి పదవికి ఈసారి నిజంగానే రాజీనామా చేస్తానని గట్టిగా చెప్పేందుకు బయలుదేరారు.

 

అయితే శుభమా అని బయలుదేరుతుంటే ఈ మీడియా వాళ్ళు పిల్లిలా ఎదురవడమే కాక అర్ధం పర్ధం లేని ప్రశ్నలు వేస్తూ అతితెలివి ప్రదర్శిస్తుంటారు. “ఈసారి మేడం గారిని ఏమేమి అడగబోతున్నారు?” అంటూ అమాయకంగా ప్రశ్నిస్తారు. తీరాచేసి జేబులోంచి ఓ పెద్ద లిస్టు బయటకి తీసి అంతా చెప్పిన తరువాత, “అయితే మీరు రాష్ట్రం విడిపోవాలని కోరుకొంటునట్లే కదా?”అని ప్రశ్నిస్తే ఎటువంటి జీవికయినా నిజంగా కాలుతుంది.

 

ఈసారి కూడా వాళ్ళు ఆ మెగామంత్రిగారు ఇంట్లోంచి బయటకు వస్తుంటే ఆయన మొహం మీద కెమెరా పెట్టి మళ్ళీ అదే ప్రశ్నను ఇంకోలా అడిగి ఇరికించేదామనుకొన్నారు.

 

ఒకసారి పొరపాటు చేస్తే మామూలు జీవి. రెండుసార్లు చేస్తే చిరంజీవి. మూడు సార్లు చేస్తే మెగాజీవి అవుతారు. కానీ, నాలుగయిదు నెలలుగా డిల్లీ నీళ్ళకి బాగా అలవాటుపడిన మీడియా వేసే ఈ చిలక ప్రశ్నలకి కూడా తడబడకుండా సమాధానం చెప్పలేకపోతే ఈ కాంగ్రెస్ జీవికి ఎంత నామోషీ అనుకొంటూ ‘అయితే అడుకోండి’ అన్నారు.

 

అప్పుడు మీడియా వాళ్ళు “అయితే మీకు రాయల తెలంగాణా ఓకేనా? కాదా?”అని చిన్న ప్రశ్న అడిగారు.

 

"హా..హా...నేను ‘ఓకే!’ అనో లేక ‘నాట్ ఓకే!’ అనో జవాబు చెపితే మళ్ళీ నన్ను ఇరికించేదామనుకొన్నారు ఈ వెర్రి సన్నాసులు" అని మనసులోనే నవ్వుకొంటూ, రాజీనామా చేసిన మన కేంద్ర మంత్రిగారు తన మొహం మీడియ వైపుకి ఓసారి గంభీరంగా టర్నింగ్ ఇచ్చుకొని, “నాకు రాయల తెలంగాణా టాపిక్ తో అసలు సంబంధం లేదు. అది నేను మాట్లాడే సబ్జక్ట్ కానే కాదు. దాని గురించి వెళ్లి కోట్ల గారిని అడగండి. నేను కేవలం ‘హైదరాబాద్ యూటీ’ అనే టాపిక్ గురించే మాట్లాడుతాను. మీకు ఆ సబ్జెక్ట్ మీద ఏవయినా డౌట్స్ ఉంటే అడుకోండి."

 

"రాష్ట్రం విడిపోయిన తరువాత కూడా రెండు రాష్ట్రాలలో పరిపాలన సవ్యంగా జరగాలంటే హైదరాబాదుని వీలయితే శాశ్వితంగా లేకుంటే కనీసం పదేళ్ళకోసమయినా యూటీ చేసి తీరాల్సిందే. లేకుంటే బోలెడు ప్రొబ్లెంస్. అందుకే నేను ఇప్పుడే సోనియా మాడం వద్దకు వెళ్లి ఈవిషయం గురించి గట్టిగా చెప్పిరావాలని బయలు దేరుతున్నాను. కానీ మధ్యలో మీ వల్ల ఆలశ్యం అయిపోతోంది,” అంటూ కారులోకి ఎక్కబోయారు.

 

“అయితే మీరు రాష్ట్రం విడిపోవాలని కోరుకొంటునట్లేనని మమ్మల్ని రాసేసుకొమ్మంటారా?” అని అమాయకంగా మొహం పెట్టుకొని మీడియావాళ్ళు ప్రశ్నించారు.