చైనీస్ న్యూ ఇయర్

Publish Date:Feb 8, 2016

న్యూ ఇయర్ అన్ని దేశాలు జరుపుకుంటాయి ఇందులో ప్రత్యేకత ఏముంది అనుకుంటున్నారా? ఉందండి. ప్రతి దేశం  కొత్త సంవత్సరాన్ని  ఒక ప్రత్యేక  తేదిలో జరుపుకుంటుంది. కాని చైనా అలా  కాదు. ప్రతి ఏడాది న్యూ ఇయర్ డేట్ మారుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చాంద్రమాన క్యాలెండరు ప్రకారం కొత్త సంవత్సరాన్ని ప్రారంభిస్తారు కాబట్టి. ప్రతి ఏడాది జనవరి 21 మొదలు ఫిబ్రవరి 20 లోపు ఈ న్యూ ఇయర్ వస్తూ ఉంటుంది. అంతే  కాదు మనకి 12 రాశులతో కూడిన పంచాంగం ఎలాగయితే ఉంటుందో వాళ్ళకి 12 జంతువుల పేర్లతో కూడిన పంచాంగం ఉంటుందిట. అందులో 12 రకాల జంతువులు ఉంటాయి. క్రిందటి సంవత్సరం జంతువూ మేక అయితే ఈ సంవత్సరం జంతువూ కోతి. ఈ ఇయర్ పుట్టిన వాళ్ళు అందరూ ఈ కోతి రాశి  కిందకి వస్తారన్నమాట.

చైనీయులు కొత్త ఏడాదికి స్వాగతం  పలకటం కూడా చాలా చక్కగా ఉంటుంది తెలుసా. ఈ రోజున తమ కుటుంబంలోని పెద్దవారి అందరితో కలిసి కూ ర్చుని భోజనం చెయ్యటం వారి సాంప్రదాయం. ఎవరు ఎంత దూరాలలో ఉన్నా ఈ రోజుకి అంతా  ఒకే దగ్గర చేరి సమిష్టి భోజనం చేస్తారు. పెద్దవాళ్ళు తమకన్నా చిన్న వారికి రెడ్ ఎన్వలప్లలో డబ్బులు పెట్టి ఇస్తారు. ఇలా తీసుకున్నవారికి పెద్దల ఆశీర్వాదం దొరుతుందనే నమ్మకం. ఎరుపుని శుభాసూచికంగా భావించే చైనీయులు ఇంటిని మాత్రమే కాదు నగరానంతా  ఎరుపు రంగుతో నింపేస్తారు.

మూఢనమ్మకాలకి పుట్టినిల్లు అయిన చైనా వారికి వాళ్ళు న్యూ ఇయర్ రోజు తినే ఆహార విషయంలో కూడా చాలా పట్టింపు ఉంది  సుమా! ఏడాదిలో మొదటి రోజు చేపలతో చేసిన ఆహారం తింటే ఏడాది మొత్తం లెక్కలేనంత డబ్బు వచ్చి పడుతుందని, ఎలాంటి అరిష్టాలు దగ్గరకి రావని కూడా వారు నమ్ముతారు. ఇంతే  అనుకుంటున్నారా ఇంకా ఉందండి. ఈ రోజు మొదటిగా మూడు సార్లు పేలే ఒక బాంబు ని  వెలిగిస్తారు. ఆ మూడు బాంబులు గట్టిగా పేలితే ఇంక వాళ్ళ వ్యాపారానికి ఆ ఏడాది మొత్తం డోకా లేనట్టేనట. ఇంకొందరు సంవత్సరం మొదలైన మూడు రోజుల దాకా తలంటు పోసుకోరట,అలా  తలంటితే వారికొచ్చిన అదృష్టం కొట్టుకుపోతుందని నమ్మకంట. ఇంట్లో ఉండే చిన్నపిల్లలు ఆ రోజు ఏడిస్తే అపశకునంగా భావిస్తారు కాబట్టి పిల్లలు ఏడవకుండా అన్ని కొనిపెట్టి వారిని సంతోషపెట్టి ఏడవకుండా చూసుకుంటారట.

వారి నమ్మకాలు ఎలా ఉన్నా మొత్తానికి అందరు  కోరుకునేది ఒక్కటే అందరు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సుఖసౌభాగ్యలతో వర్దిల్లాలనే. వారి కోరికలు నెరవేరాలని ఆశిద్దాం. విష్ యు హ్యాపీ న్యూ ఇయర్ చైనా.  

కళ్యాణి

By
en-us Life Style News -