చైల్డ్ కేర్ సెంటర్లతో పిల్లలు డీలా

 

 

ఒకప్పుడు చైల్డ్కేర్ సెంటర్ అంటే ఏమిటో ఎవ్వరికీ తెలియదు. ఒకవేళ వాటి గురించి విన్నా... అదేదో పాశ్చాత్య దేశాలకి మాత్రమే చెందిన సంస్కృతి అనుకునేవారు. కానీ మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు చైల్డ్ కేర్ కేంద్రాలు మన దేశంలోనూ కనిపిస్తున్నాయి. తల్లిదండ్రులు ఇద్దరూ పనికి వెళ్లే సందర్భాలలో ఈ కేంద్రంలో పిల్లలను వదిలి వెళ్లవచ్చన్న భరోసా పెరిగిపోయింది. కానీ తప్పనిసరి అయితే కానీ పిల్లలను ఈ కేంద్రాలలో.... అది కూడా ఎక్కువసేపు ఉంచవద్దని అనేక పరిశోధనలు రుజువుచేస్తున్నాయి.

 

నార్వేకి చెందిన కొందరు పరిశోధకులు చైల్డ్ కేర్ సెంటర్లకీ పిల్లలలో ఒత్తిడికీ మధ్య ఏమన్నా సంబంధం ఉందేమో అని పరిశీలించారు. దీనికోసం వారు 85 చైల్డ్ కేర్ సెంటర్లలో 112 మంది పిల్లలను గమనించారు. వీరిలో 8 నుంచి 9 గంటల పాటు చైల్డ్ కేర్ సెంటర్లో గడుపుతున్న పిల్లలలో కార్టిసాల్ అనే రసాయనం చాలా ఎక్కువగా కనిపించింది. మన శరీరంలో ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ కార్టిసాల్ ఉత్పత్తి జరుగుతుంది. పిల్లలు ఎంత ఎక్కువసేపు చైల్డ్ కేర్ సెంటర్లో గడిపితే అంత ఎక్కువగా ఈ కార్టిసాల్ పరిమాణం కనిపించింది.

 

చైల్డ్ కేర్ సెంటరులో ఉండే పిల్లల్లో ఇలా ఒత్తిడి పెరిగిపోవడానికి కారణం ఏమిటి అనే ప్రశ్నకు బదులిచ్చే ప్రయత్నం చేశారు పరిశోధకులు. చైల్డ్ కేర్ అయినంత మాత్రాన పిల్లలు సంతోషంగా ఉంటారన్న భరోసా ఏమీ లేదట. అక్కడ ఉండే సవాళ్లు అక్కడా ఉంటాయి. సెంటర్లోని ఇతర పిల్లలతో మెలగడం, తల్లిదండ్రుల నుంచి దూరంగా ఉండటం, గుంపులో గోవిందలా బిక్కుబిక్కుమని గడపడం... లాంటి సమస్యలన్నీ వారి మనసుని క్రుంగదీస్తాయట! పసివయసు పిల్లలకి వారి కుటుంబసభ్యుల సాహచర్యం, స్పర్శ, సాంత్వన చాలా అవసరం అని ఇప్పటికే అనేక పరిశోధనలు చెబుతున్నాయి. ఇప్పుడు మనం వింటున్న పరిశోధన ఇదే రుజువుచేస్తోంది.

 

చైల్డ్ కేర్ సెంటర్లలో పిల్లల అభద్రతా భావం గురించి ఇదివరకు చాలా పరిశోధనలే జరిగాయి. పిల్లల ఉద్వేగ స్థాయి ఇంట్లో స్థిరంగానే ఉంటోందని, చైల్డ్ కేర్ సెంటర్లలో అదుపు తప్పుతోందనీ ఆయా పరిశోధనలు రుజువు చేసే ప్రయత్నం చేశాయి. చైల్డ్ కేర్ సెంటర్లలో పిల్లలను బలవంతంగా పడుకోపెట్టే పద్ధతి కూడా ఏమంత మంచిది కాదని ఈమధ్యే ఓ పరిశోధన తేల్చింది. దీని వల్ల రాత్రిపూట వారు సరిగా నిద్రపోలేకపోతున్నారనీ... తద్వారా ఎదుగుదలకి సంబంధించి అనేక సమస్యలకు లోనవుతున్నారనీ ఆస్ట్రేలియాకు చెందిన ఈ పరిశోధన నిరూపించింది.

 

మొత్తానికీ ఒత్తిడికీ, చైల్డ్ కేర్ సెంటర్లకీ మధ్య ఉన్న లంకెని నిరూపించిన తాజా పరిశోధనతో నార్వే తల్లిదండ్రులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఎందుకంటే నార్వేలో రెండేళ్లలోపు పిల్లలు చాలామంది వారానికి 40 గంటల పాటు చైల్డ్ కేర్ సెంటర్లలోనే గడుపుతున్నారట. అయితే ఈ సమస్య కేవలం నార్వేది మాత్రమే అనుకోవడానికి లేదు. మన దగ్గర కూడా ఈ సంస్కృతి మొదలైంది కాబట్టి... మనమూ భుజాలు తడుముకోవాల్సిందే! మన దగ్గర ఉమ్మడి కుటుంబ సంస్కృతి ఉంది కాబట్టి, పిల్లల్ని చైల్డ్ కేర్ సెంటర్లో కాకుండా అమ్మమ్మల ఒడిలో పెంచే అవకాశం ఉందేమో ఆలోచించుకుంటే మంచిది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఇలాంటి సెంటర్లో చేర్పించినా... ఓ ఆరేడు గంటలకు మించి వారు అందులో మగ్గిపోకుండా చూసుకోవాలి.

- నిర్జర.