నెలరోజుల్లో తాత్కాలిక రాజధాని..

 

రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఆంధ్ర రాష్ట్ర పరిపాలనా ఇక్కడ నుండే చూడటం కొంచం కష్టంగా మారింది. ఏపీలోనే ఉండి పరిపాలనా బాధ్యతలు చూసుకుందామా అంటే అక్కడ సరైన సౌకర్యాలు లేవు. కనీసం సీఎం క్యాంపు కార్యాలయంలో ఇంకా పనులు మొత్తం పూర్తి కాలేదు. పోని అక్కడి నుండి ఇక్కడికి ఇప్పుడికిప్పుడు రావడం అంటే అది కష్టమైన పని. ఈ నేపథ్యంలో ఏపీ రాజదాని అమరావతికి సమీపంలో గుంటూరు. విజయవాడ నగరాల్లో తాత్కాలికంగా ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేయాలనీ ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీలోనే మూడు రోజులు ఉందామని ప్రజలకు పాలనను మరింత దగ్గర చేద్దామని చంద్రబాబు అధికారులను సూచించారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఏ శాఖలు, ఏ విభాగాలు ముందుగా తరలించాలో చర్చజరిపినట్టు తెలుస్తోంది. దీనికోసం చంద్రబాబు ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసి దానికి పంచాయతీరాజ్‌ శాఖ కార్యదర్శి కెఎస్‌ జవహర్‌రెడ్డి, గృహనిర్మాణ శాఖ కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌, ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి హేమా మునివెంకటప్ప, రహదారులు, భవనాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పురపాలకశాఖ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. వీరే ముందుగా ఏ శాఖలు తరలించాలి.. ఈ శాఖలకు అనువైన ప్రదేశాలను పరిశీలించనున్నారు.

 

అయితే దాదాపు 25 శాఖలను హైదరాబాద్ నుండి ఏపీకి తరలించాలని భావిస్తున్నారు. వీటిలో కూడా అన్ని ఒక్కసారి కాకుండా ముందు కొన్ని శాఖలను తరువాత కొన్నిశాఖలను తరలించాలని... ముందుగా ఏఏ శాఖలైతే ప్రజలకు దగ్గర సంబంధం ఉంటుందో ఆ శాఖలను తరలించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా శాఖలలో పనిచేసే ఉద్యోగులు కూడా వెళ్లాల్సి ఉంటుంది.. అయితే ఎంతమంది ఉద్యోగులు వెళ్లాలి? వారి కుటుంబాలకు నివాసం కల్పించేందుకు ఎన్ని చదరపు అడుగులు కావాలన్నది ప్రాథమికంగా అంచనా వేశారు. మొత్తంగా 20,053మంది ఉద్యోగులు అక్కడికి తరలాల్సి ఉంటుంది. అదేవిధంగా వారి నివాసాలకు 1.73కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణం కావాలి. మొత్తంగా 2.18కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణం అవసరం కానుంది. తాత్కాలిక రాజధానికి నెల రోజుల్లోగా నిర్ణయించిన శాఖలు, ఉద్యోగులు తరలిపోనున్నారు.