అభివృద్దికి అభివృద్ధి..రాజకీయానికి రాజకీయం

పాలన స్వరాష్ట్రం నుంచే సాగించాలన్న కల నెరవేరింది..విజయవాడతో పాటు గుంటూరులో పలు రాష్ట్ర స్థాయి ప్రభుత్వ కార్యాలయాలు ప్రారంభమయ్యాయి. రెండేళ్ల ఉత్కంఠకు తెరదించుతూ ఒకదాని వెంట మరొకటి శరవేగంగా కార్యాలయాల తరలింపు ప్రక్రియ జరుగుతుండటం శుభపరిణామం. విజయవాడ, గుంటూరు జంటనగరాలు..మధ్యలో తాత్కాలిక సచివాలయం ఉన్న వెలగపూడి..టోటల్‌గా రాజధాని ప్రాంతంలో పండగ వాతావరణమే. నిన్న మొన్నటి వరకు అమరావతికి పాలనా యంత్రాంగాన్ని తరలించాలని అహర్నిశలు శ్రమించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆ బాధ తీరిపోవడంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడంతోపాటు రాజకీయంగా ప్రత్యర్థులకు చెక్ పెట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. 

 

తీవ్ర ఆర్థిక లోటుతో పీకల్లోతు కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని తన అనుభవంతో, చాకచాక్యంతో ఒక్క గట్టు ఎక్కిస్తూ వస్తున్నారు బాబు. ఆర్థికంగా నిలబడాలంటే పెట్టుబడులు ఆకర్షించబడాలి..ఈ విషయం ఆయనకు తెలిసినంతగా ఎవరికి తెలియదు.. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ఆంధ్రప్రదేశ్‌కు ఎన్నో కంపెనీలను రప్పించారు. ఇప్పుడు నవ్యాంధ్ర విషయంలోనూ ఇదే రకమైన ఫార్మూలాను అనుసరిస్తున్నారు చంద్రబాబు. దీనిలో భాగంగానే తన బృందంతో కలిసి చైనా పర్యటనకు వెళ్లారు. ఇటు రాష్ట్రాభివృద్ధితో పాటు రాజకీయంగానూ ఈ పర్యటనను చంద్రబాబు ఉపయోగించుకున్నారు.

 

నవ్యాంధ్ర రాజధానిగా ముందు ప్రచారం జరిగిన ప్రకాశం జిల్లా దొనకొండలో అంతర్జాతీయ పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు కానుంది. దీనిని రాజకీయంగా ఎలా వాడతారా అని మీరు అనుకోవచ్చు. ఇక్కడే ఉంది బాబు మైండ్ గేమ్‌..అదే అసలు స్టోరీ. దొనకొండలో రాజధాని ఏర్పాటుకానుందనే ముందస్తు సమాచారంతో జగన్ అండ్ కో అక్కడ పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారు. అంతేకాకుండా తన అనుకూల మీడియాతో రాజధాని దొనకొండే అన్నట్లుగా ప్రచారం చేయించారు. అయితే రాజధానిగా అమరావతి ఫిక్స్ కావడంతో జగన్ షాక్‌కు గురయ్యారు. కోట్లు కుమ్మరించి కొన్న భూములు బూడిదలో పోసిన పన్నీరు చెందంగా తయారైంది. చంద్రబాబు చైనా పర్యటనలో భాగంగా అక్కడి చిన్న, మధ్య తరహా పారిశ్రామిక వేత్తలతో చేసుకున్న ఒప్పందం కుదుర్చుకుంది. 

 

దీని ప్రకారం దొనకొండ ప్రాంతంలో మూడు దశల్లో రూ.49 వేల కోట్ల పెట్టుబడులతో 55 వేల మందికి ఉపాధి కల్పించేందుకు డ్రాగన్ ముందుకొచ్చింది. అనుకున్న ప్రకారం ప్రాజెక్ట్‌లు రావాలంటే భూములు కావాలి. అందుకోసం భూసేకరణ చేయాలి. అంటే ఆ భూసేకరణలో జగన్ అండ్ కో భూములు పోతాయి. నా భూములు నాకు కావాలి అంటే అక్కడ కుదరదు. ఎందుకంటే పొద్దున్న లేస్తే రాష్ట్రం..రాష్ట్రం అనే జగన్..ఇపుడు భూముల విషయంలో మొండి పట్టుదల పడితే జనంలో చులకన అవుతారు. కాబట్టి తప్పక భూసేకరణకు ఒప్పుకోవాలి. ఇక రెండోది జగన్ సొంత జిల్లా కడపలో కొత్త స్టీల్ ఫ్యాక్టరీకి ఒప్పందం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జమ్మలమడుగు వద్ద బ్రాహ్మణి స్టిల్స్ పేరుతో ఉక్కుపరిశ్రమకు శంకుస్థాపన చేశారు. 

 

అయితే ఆ పరిశ్రమ వివిధ కారణాల వల్ల ఆగిపోయింది. పరిశ్రమ నిర్మిస్తామని భూమిని తీసుకున్న బ్రహ్మణి సంస్థ అధినేత గాలి జనార్థన్ రెడ్డి అది నిర్మించకుండానే జైలుపాలయ్యారు. తదనంతరం పరిణామాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆ భూములను స్వాధీనం చేసుకుంది. దీంతో స్టీల్ ఫ్యాక్టరీ కల ఇప్పట్లో సాధ్యం కాదనే అభిప్రాయం ఆ ప్రాంత వాసుల్లో పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో చైనా ఐరన్ ఇండస్ట్రీని బ్రాహ్మణి స్టీల్స్‌కి ఇచ్చిన భూముల్లో పెట్టబోతున్నారు. త్వరలోనే చైనా బృందం వచ్చి సాధ్యాసాధ్యాలు పరిశీలించి ఓ అంచనాకి రాబోతున్నారు. ఇక్కడ పెట్టుబడుల కోణంలో పెద్ద ప్లస్ రాష్ట్రానికి..పొలిటికల్‌గా అంతకంటే పెద్ద బూస్ట్‌ చంద్రబాబుకి. చైనా వాళ్లు స్టిల్ ఫ్యాక్టరీ పెడితే జగన్‌కి పెద్ద ఎదురుదెబ్బ తగులుతుంది. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్‌కు అడ్డుతగిలితే జనం చెప్పులు, చీపుళ్లు చూపిస్తారు ఎందుకంటే వైఎస్ హయాంలో వేల ఎకరాలు ధారాదత్తం చేస్తే మీరేం చేశారు..ఇప్పుడు చంద్రబాబు మంచి చేస్తుంటే ఎందుకు అడ్డుతగులుతున్నారని ఎదురు తిరుగుతారు. ఇక సొంతజిల్లాలో జగన్‌కు సెగే. మొత్తానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి పెట్టుబడులు సాధించారు..రాజకీయవేత్తగా ప్రత్యర్థికి చెక్ పెట్టారు .