చంద్రన్న సాధించారు

“ఉత్తముడైన వాడు దేనినాచరిస్తారో సాధారణ జనులూ దాన్ని అనుకరిస్తూ, అనుసరిస్తూ జీవిస్తారు” అని భగవద్గీతలో చెప్పినట్టు ఇప్పుడు ఏపీలో అదే జరుగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణకు రాజధానిగా హైదరాబాద్ ఉండగా..నవ్యాంధ్రకు ఎలాంటి రాజధాని లేదు. అయితే రాజధాని నిర్మించేంత వరకు పదేళ్లపాటు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా నిర్ణయించింది కేంద్రప్రభుత్వం. జూన్ 2 నుంచి రెండు తెలుగు ప్రభుత్వాలు హైదరాబాద్‌లోని సచివాలయం కేంద్రంగా పాలన ప్రారంభించాయి. ఈ లోగా రాజధానిగా అమరావతిని నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం.

 

రాష్ట్రం విడిపోయినా పాలన ఇంకా హైదరాబాద్‌లోనే నెలకొని ఉండటంతో ప్రజలు అసంతృప్తికి లోనయ్యారు. దానికి తోడు ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనలకు హైదరాబాద్ నుంచి వెళ్లడం సమీక్షలు విజయవాడలో నిర్వహించడంతో వారంలో మూడు రోజులు బెజవాడలో ప్రజలకు అందుబాటులో ఉంటానని ప్రకటించారు సీఎం. మళ్లీ విజయవాడ-హైదరాబాద్ మధ్య చక్కర్లు కొట్టడంతో ఆయన తీవ్ర ఇబ్బందికి లోనయ్యారు. ఇక లాభం లేదనుకుని కుటుంబాన్ని సైతం వదిలిపెట్టి ప్రజల కోసం విజయవాడకు వచ్చేశారు. ఆయన లేకుండా మేముండలేమని మంత్రులు సైతం చలో బెజవాడ అన్నారు. ఉద్యోగులు కూడా విజయవాడ వచ్చేయాలని సీఎం విజ్ఞప్తి చేయడంతో అంతా కదిలొస్తున్నారు.

 

కానీ ఇదంతా ఉన్నపళంగా జరిగింది కాదు. వారిని ఒప్పించి..మెప్పించడానికి చంద్రబాబు చెమటోడ్చాల్సి వచ్చింది. ఉద్యోగులు హైదరాబాద్ వదిలి రావడానికి మొదట్లో ఒప్పుకోలేదు. వసతి అన్నారు..పిల్లల చదువులు అన్నారు..ఇంటి అద్దెలన్నారు..చివరికి స్థానికత అన్నారు. మీ పిచ్చిగాని ఉద్యోగులు ఇప్పట్లో రారు అని అన్నింటా విమర్శలు అయినా అక్కడుంది చంద్రబాబు..మొక్కవోని దీక్షతో అవాంతరాలను అధిగమించి తను అనుకున్న దానిని సాధించారు. ఆంధ్రప్రదేశ్ పరిపాలనను అమరావతి కేంద్రంగానే నిర్వహించాలన్న కలను సాకారం చేశారు. రాష్ట్ర విభజన జరిగిన రెండేళ్లకే పాలనరథం స్వరాష్ట్రానికి తరలివచ్చింది. కృషి, పట్టుదల ఉంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి నిరూపించారు.