ఈ ప్రశ్నకి బదులేది!

 

అది ఒక మహా సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యానికి మంత్రిగా ఉన్న వ్యక్తి వయసు పైబడుతోంది. దాంతో తన తర్వాత వారసుడిగా ఉండేందుకు ఎవరు తగినవారా అని నిర్ణయించాలనుకున్నాడు. ఆ ప్రయత్నంలో ఉండగా ఓ రోజు ఎక్కడి నుంచో ఒక యువకుడు రాజాస్థానానికి వచ్చాడు. పేరు గాంచిన విశ్వవిద్యాలయాలలోనూ, ప్రసిద్ధి చెందిన గురువుల దగ్గరా  ఆ యువకుడు సకల శాస్త్రాలూ నేర్చుకున్నాడు. మహామేధావిగా పేరుగాంచాడు. అలాంటి యువకుడి ప్రతిభను విన్న రాజుగారు అతనే రాజ్యానికి కాబోయే మంత్రి అని నిర్ణయించేశారు.

 

రాజుగారి నిర్ణయం విన్న మంత్రి మాత్రం కాస్త డీలా పడ్డాడు. ‘రాజా! మంత్రి పదవి కేవలం పుస్తకజ్ఞానంతోనూ, పైపై మెరుగులుతోనూ, జ్ఞాపకశక్తితోనూ సాగించేది కాదు. ఇంతటి రాజ్యాన్ని నిత్యం ఏదో ఒక క్లిష్ట సమస్య వేధిస్తూనే ఉంటుంది. కాబట్టి నిజజీవితంలో సమయస్ఫూర్తిగా వ్యవహరించే తర్కమే మంత్రికి ఉండాల్సిన తొలి లక్షణం. ఆ తర్కం ఇతనిలో ఉందో లేదో నేను పరీక్షించదల్చుకున్నాను. అప్పటివరకూ మీ నిర్ణయాన్ని వాయిదా వేయండి,’ అంటూ ప్రాధేయపడ్డాడు.

 

యువకుడు ఎలాంటి తర్కానికైనా సమాధానం చెప్పగలడని రాజుగారి నమ్మకం. అందుకే వెనువెంటనే ఆ యువకుడిని ఆస్థానానికి పిలిపించారు. ‘నేను నీకో ప్రశ్న వేస్తాను. ప్రశ్న చాలా చిన్నదే కానీ జవాబు మాత్రం ఆలోచించి చెప్పాలి సుమా! అంతేకాదు! ఒకటే ప్రశ్నని మూడుసార్లు వేస్తాను. మూడుసార్లూ నువ్వు జవాబు చెప్పలేని పక్షంలో బుద్ధిని మరింతగా పదునుపెట్టేందుకు మరి కొద్ది సంవత్సరాలు గడపాల్సి ఉంటుంది,’ అని చెప్పారు మంత్రిగారు.

 

‘ఓస్ అదెంతటి పరీక్ష. మహామహా తర్కాలనే తట్టుకుని నిలబడ్డాను. మీ ప్రశ్న నాకు కేవలమాత్రం,’ అని దర్పంగా వదరాడు యువకుడు.

 

‘మంచిది. అయితే నా ప్రశ్నని విను. ఇద్దరు వ్యక్తులు ఒక ఇంటి పొగగొట్టంలోంచి కిందకి దిగారు. వారిలో ఒకరి ముఖానికి మసి అంటింది. వేరొకరి ముఖం శుభ్రంగానే ఉంది. ఇద్దరిలో ఎవరు మొహం కడుక్కుంటారు?’ అని అడిగాడు.

 

‘ఛీ ఇదీ ఓ ప్రశ్నేనా! మసి అంటుకున్న వ్యక్తి ముఖం కడుక్కుంటాడు,’ అని బదులిచ్చాడు యువకుడు.

 

‘తప్పు! శుభ్రంగా ఉన్న మనిషిని చూసి మసి అంటుకున్న వ్యక్తి తాను కూడా శుభ్రంగా ఉన్నానని అనుకుంటాడు. కానీ మసి అంటుకున్న మనిషిని చూసి, శుభ్రంగా ఉన్న మనిషి తనకి కూడా మసి అంటుకుందేమో అనుకుని మొహం కడుక్కుంటాడు. ఇప్పుడు మళ్లీ చెప్పు! ఇద్దరిలో ఎవరు మొహం కడుక్కుంటాడు,’ అని అడిగాడు మంత్రి.

 

‘మీరే చెప్పారుగా. శుభ్రంగా ఉన్న మనిషి మొహం కడుక్కుంటారని,’ అని చిరాకుపడ్డాడు యువకుడు.

 

‘కాకపోవచ్చు. ఇద్దరూ మొహం కడుక్కోవచ్చు. ఇందాక చెప్పాను కదా! శుభ్రంగా ఉన్న మనిషి మురికిగా ఉన్న వ్యక్తిని చూసి తనకి కూడా మసి అంటుకుందని భావిస్తాడనీ.. ఆ భ్రమలో తన మొహం కూడా కడుక్కుంటాడనీ. అవతలి వ్యక్తి చేష్టని చూసి మసి అంటుకున్న వ్యక్తి తనలో ఏదో లోపం ఉందని గుర్తించే అవకాశం ఉంది. దాంతో అతను కూడా మొహం కడుక్కుంటాడు. ఇప్పుడు మరోసారి ఇదే ప్రశ్నకి జవాబు చెప్పు,’ అని అడిగాడు మంత్రి.

 

రెండోసారి కూడా తన జవాబు తేలిపోయేసరికి యువకుడి అహం దెబ్బతిన్నది. రోషం పొడుచుకువచ్చింది. ‘మీరే చెప్పారు కదా! ఇద్దరూ మొహం కడుక్కుంటారని. ఇంతకు మించి మరో జవాబు నాకు కనిపించడం లేదు,’ అని చిరాకుపడ్డాడు.

 

‘తప్పు! దీనికి మరో జవాబు కూడా ఉంది. ఇద్దరూ మొహం కడుక్కోకుండా ఉండిపోవచ్చు. మసి అంటుకున్న వ్యక్తి శుభ్రంగా ఉన్న వ్యక్తిని చూసి, తను కూడా శుభ్రంగా ఉన్నానని అనుకుని ఊరుకుంటాడు. మసి అంటుకున్న వ్యక్తి ప్రతిస్పందనని బట్టి తన మొహం శుభ్రంగా ఉందేమో అని గ్రహించి అవతలి వ్యక్తి కూడా ఊరుకుండిపోతాడు. ఇప్పుడు ఇదే ప్రశ్నని మరోసారి అడుగుతున్నాను. కనీసం ఈసారన్నా కొత్తగా జవాబు చెప్పేందుకు ప్రయత్నించు,’ అన్నాడు మంత్రి.

 

‘ఏడ్చినట్లు ఉంది. మూడు జవాబులకి మించి ఇంకే ఆస్కారం ఉంటుంది. ఈసారి కూడా మీరు మరో జవాబు చెబితే నేను మళ్లీ ఈ ఆస్థానంలోకి రాను. నాకు తెలిసిన విద్య అంతా పుస్తకజ్ఞానమే అని ఒప్పుకొని నిజమైన జ్ఞానం కోసం, ఆ జ్ఞానాన్ని అందించే అనుభవాల కోసం దేశాటనకు వెళ్లిపోతాను,’ అన్నడు కుర్రవాడు.

 

‘బాబూ! నీ దగ్గరకు ఎవరన్నా ఏదన్నా సమస్యతో వచ్చారే అనుకో! అసలు ముందు ఆ సమస్య సంభవించే అవకాశం ఉందో లేదో కూడా తెలుసుకోవాలి కదా! అసలు ఒక చిన్న పొగగొట్టంలోంచి ఇద్దరు వ్యక్తులు కిందకి రావడం ఎలా సాధ్యం. అందులో ఒకరికి మసి అంటుకుని మరొకరికి అంటుకోకపోవడం ఎలా కుదురుతుంది. ఇంతా జరిగిందే అనుకో! పొగగొట్టంలోంచి కలిసి దిగిన ఇద్దరు వ్యక్తులు అద్దం చూసుకోకుండా ఉంటారా? ఒకవేళ అక్కడ అద్దం లేకపోయినా ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఉంటారా? కాబట్టి నా ప్రశ్నలోనే లోపం ఉందని నువ్వెందుకు చెప్పలేకపోయావు. విషయం లేకుండా వాదన ఎలా సాధ్యమవుతుంది?’ అంటూ కుర్రవాడని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశాడు మంత్రి.

 

ఆ ప్రశ్నలకి బదులివ్వలేక కుర్రవాడు రాజుగారి ముందు నుంచి నిష్క్రమించాడు. మంత్రిపదవి కోసం మళ్లీ వెతుకులాట మొదలైంది.

 

(ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)

- నిర్జర