బంధువుల్లా వచ్చి పెళ్లి కుమార్తె నగలనే కొట్టేశారు!
posted on Dec 24, 2020 2:30PM
బంధువుల్లా పెళ్లికొచ్చారు.. పెళ్లి మండపంలో నానా హడావుడి చేశారు. పెళ్లికి వచ్చిన వారితో కలిసి అంతా కలియ తిరిగారు. ముందు వరుసలోనే కూర్చుని వివాహ తంతును వీక్షించారు. పెళ్లి తంతు పూర్తైన తర్వాత జరిగే ఘట్టాల సందర్భంగా తాము వచ్చిన అసలు పని కానిచ్చేశారు. అందరిని నమ్మించి ఏకంగా పెళ్లి కూతురు నగలనే నొక్కేశారు. దాదాపు 20 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు తీసుకుని పెళ్లి మండపం నుంచి దర్జాగా ఊడాయించారు.
నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం బర్దీపూర్ లో జరిగిన ఓ పెళ్లివేడుకలో ఈ ఘటన జరిగింది. సిద్ధిపేట జిల్లాకు చెందిన ఫణీంద్ర అనే యువకుడికి మహారాష్ట్ర వాసి కావ్యతో పెళ్లి కుదిరింది. బర్దీపూర్ శివారు ప్రాంతంలో ఉన్న ఓ మ్యారేజి హాలులో పెళ్లికి ఏర్పాట్లు జరిగాయి. పెళ్లికి ఇద్దరు కొత్త వ్యక్తులు వచ్చారు. పెళ్లికి వచ్చిన బంధువులతో వారు ఇట్టే కలిసిపోయారు. అయితే పెళ్లి క్రతువు పూర్తయిన తర్వాత పెళ్లికుమార్తె నగలను తీసి ఓ బ్యాగులో ఉంచారు. ఇది గమనించిన ఆ ఇద్దరు వ్యక్తులు ఆ బ్యాగును పట్టుకుని ఉన్న మహిళ వద్దకు వెళ్లారు. ఆ ఇద్దరిలో ఒకరు ఆమె దృష్టి మరల్చగా, మరో వ్యక్తి ఇదే అదనుగా బ్యాగ్ ను మాయం చేశాడు. ఆమె ఏం జరిగిందో తెలుసుకునే లోపే ఆ ఇద్దరూ ఫంక్షన్ హాల్ నుంచి ఉడాయించారు.
పెళ్లికి వచ్చిన కొందరు వ్యక్తులు ఏకంగా పెళ్లికుమార్తె నగలనే ఎత్తుకెళ్లడం కలకలం రేపింది. చోరీ ఘటనతో పెళ్లివేడుక కాస్తా గందరగోళంగా మారింది. రూ.20 లక్షల విలువైన బంగారు నగలు దొంగలపాలు కావడంతో పెళ్లికుమార్తె బంధువులు లబోదిబోమన్నారు. ఈ ఘటనపై వరుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని అక్కడి సీసీ కెమెరా ఫుటేజి పరిశీలించారు. సీసీ కెమెరా పుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.